గుజరాత్‌ నుంచే పరువు నష్టం దావాలు?

Why India Rich And Powerful Go To Ahmedabad To Sue Their Critics? - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణానికి సంబంధించి వార్తా కథనాన్ని ప్రచురించినందుకు ‘ది సిటిజెన్‌’ పత్రిక సంపాదకురాలు సీమా ముస్తఫాపై అనిల్‌ అంబానీకి చెందిన రిలయెన్స్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ లిమిటెడ్‌ తాజాగా ఏడువేల కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది. ఇదే కంపెనీ గత వారం ఇదే కారణంతో ‘ఎన్డీటీవీ’పైన పది వేల కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది. ఇదే రాఫెల్‌ యుద్ధ విమానాల స్కామ్‌కు సంబంధించి అంబానీ కంపెనీ పలువురు కాంగ్రెస్‌ నాయకులు, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్‌ సింగ్, మీడియా సంస్థలపై మొత్తం 75 వేల కోట్ల రూపాయల మేరకు పరువు నష్టం దావాలు వేసింది. అన్ని దావాలు కూడా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరంలోనే దాఖలు చేయడం గమనార్హం.

భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా కుమారుడు జయ్‌ షా కూడా 2017లో ‘ది వైర్‌’ మీడియాపై వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది కూడా అహ్మదాబాద్‌ నుంచే. పరువు నష్టం దావాలకు, గుజరాత్‌కు లింకేమిటీ? ఎందుకు అక్కడి నుంచే దావాలు వేస్తున్నారు? 2004లో గుజరాత్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన కోర్టు రుసుముల చట్టం ప్రకారం ఎంత పెద్ద మొత్తానికి పరువు నష్టం దావా వేసినా గరిష్టంగా చెల్లించాల్సింది 75 వేల రూపాయలు మాత్రమే. ఉత్తుత్తి పరువు నష్టం దావాలను నిరుత్సాహ పర్చేందుకుగాను దేశంలోని పలు రాష్ట్రాలు పరువు నష్టం దావా రుసుములను పెంచాయి. పేద వారికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో గుజరాత్‌ రాష్ట్రం అన్నింటికన్నా  పరువు నష్టం రుసుములను తక్కువగా పేర్కొంది. అందుకని భారీ మొత్తాలకు పరువు నష్టం దావాలను వేయాలనుకున్న వారు గుజరాత్‌ను ఆశ్రయిస్తున్నారు.

ముఖ్యంగా గుజరాత్‌లో బ్రాంచీలున్న కంపెనీలు అలా చేస్తున్నాయి. పైగా ఎక్కడో ఉన్న నిందితుడిని కోర్టు విచారణ పేరిట గుజరాత్‌ వరకు రప్పించి తిప్పించవచ్చన్నది కూడా వారి కుట్రలో ఓ భాగం. గుజరాత్‌ హైకోర్టుకు సివిల్‌ జురిడిక్షన్‌ హోదా లేకపోవడం కూడా కలిసిసొచ్చే అవకాశమే. ఈ హోదా లేకపోవడం వల్ల అన్ని సివిల్‌ పరువు నష్టం దావాలను అహ్మదాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులోనే దాఖలు చేయాలి. అప్పీల్‌కు మాత్రమే హైకోర్టుకు రావాలి. బాంబే, కలకత్తా, ఢిల్లీ, మద్రాస్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఐదు హైకోర్టులు మాత్రమే సివిల్‌ జురిడిక్షన్‌లో ఉన్నాయి. వీటి పరిధిలో ఓ పరిమితికి మించి పరువు నష్టం దావాలు వేయాలంటే హైకోర్టులనే నేరుగా ఆశ్రయించాల్సి ఉంటుంది.

తమిళనాడులోని సిటీ సివిల్‌ కోర్టులో 25 లక్షల రూపాయల వరకు పరువు నష్టం కేసు దాఖలు చేయవచ్చు. పది లక్షల నుంచి 25 లక్షల వరకు మూడు శాతం చొప్పున కోర్టు ఫీజు చెల్లించాలి. 25 లక్షలకు మించిన పరువు నష్టం దావాలయితే మద్రాస్‌ హైకోర్టులోనే దాఖలు చేయాలి. ఎంత మేరకైనా పరువు నష్టం దావా వేయవచ్చు. అయితే అందులో ఒక శాతం మొత్తాన్ని కోర్టు రుసుము కింద చెల్లించాలి. 2015లో సవరణల ప్రకారం ఢిల్లీలో దిగువ కోర్టులు రెండు కోట్ల రూపాయల వరకు, అంతకుమించితే హైకోర్టులో పరువు నష్టం దావాలు వేయాల్సి ఉంటుంది. రిలయెన్స్‌ కంపెనీ ‘ఎన్డీటీవీ’పైన మద్రాస్‌ నుంచి పరువు నష్టం దావా వేసి ఉన్నట్లయితే కోర్టు రుసుము కింద వంద కోట్ల రూపాయలను చెల్లించాల్సి వచ్చేది. గుజరాత్‌లో గరిష్ట రుసుము 75 వేల రూపాయలే కనుక ఆ మొత్తాన్ని చెల్లించి పదివేల కోట్ల రూపాయలకు దావా వేసింది. పేదలను దృష్టిలో పెట్టుకొని కోర్టు రుసుములను అతి తక్కువగా నిర్ణయిస్తే రిలయెన్స్‌ లాంటి పెద్దలు, రాజకీయ నాయకులకే ఎక్కువగా ఉపయోగపడుతుంది. అందుకు ఎక్కువగా మీడియా సంస్థలే నష్టపోవాల్సి వస్తోంది. సామాన్యులు చాలా వరకు పరువు నష్టం దావాల జోలికి వెళ్లరని తెల్సిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top