పొరపాటుగా కేఎల్‌ఓ నేత విడుదల.. | unfortunately he released | Sakshi
Sakshi News home page

పొరపాటుగా కేఎల్‌ఓ నేత విడుదల..

May 16 2014 3:04 AM | Updated on Sep 2 2017 7:23 AM

రెండు నెలల కిందట బెంగళూరులో అరెస్టు చేసిన కామ్తాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (కేఎల్‌ఓ) నేత ఒకరిని పశ్చిమ బెంగాల్ పోలీసులు పొరపాటున విడుదల చేశారు.

 తర్వాత లొంగుబాటు... పోలీసుల నిర్వాకంపై దర్యాప్తు
 
 మాల్దా(పశ్చిమ బెంగాల్): రెండు నెలల కిందట బెంగళూరులో అరెస్టు చేసిన కామ్తాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (కేఎల్‌ఓ) నేత ఒకరిని పశ్చిమ బెంగాల్ పోలీసులు పొరపాటున విడుదల చేశారు. కేఎల్‌ఓ నేత తర్వాత తిరిగి లొంగిపోయినా, పోలీసుల నిర్వాకంపై మాల్దా రేంజ్ డీఐజీ సత్యజిత్ బెనర్జీ దర్యాప్తుకు ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జనరల్ రికార్డ్ ఆఫీసర్ జితేన్ రాయ్ సర్కార్, కానిస్టేబుల్ ప్రశాంత ఘోష్‌లను సస్పెండ్ చేశారు. బెంగాల్‌లో చర్చనీయాంశంగా మారిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. అజ్ఞాతంలో ఉన్న కేఎల్‌ఓ అగ్రనేత మల్ఖాన్ సింగ్ సహచరుడైన నబను బర్మన్‌ను గత మార్చి నెలలో పశ్చిమ బెంగాల్ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. హబీబ్‌పూర్ కాల్పుల కేసులో నిందితుడైన అతడిని అక్కడి నుంచి తీసుకు వచ్చాక మాల్దా జైలులో ఉంచారు.

అదే జైలులో ఉంటున్న కేఎల్‌ఓ కొరియర్లు కుముద్ బర్మన్, కార్తీక్ మండల్‌లను బుధవారం కోర్టులో హాజరుపరచగా, కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. వారిద్దరూ కూడా హబీబ్‌పూర్ కాల్పుల కేసులో నిందితులు. వారిద్దరినీ విడుదల చేయాలంటూ కోర్టు నుంచి జైలుకు ఆదేశాలు అందగా, జైలు సిబ్బంది కుముద్ బర్మన్ బదులు నబను బర్మన్‌ను విడుదల చేశారు. జైలు నుంచి బయటకు వచ్చాక కుముద్ బర్మన్ కామ్తాపూర్ పీపుల్స్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుభాష్ బర్మన్‌తో ఫోన్‌లో మాట్లాడాడు. ఈ విషయాన్ని సుభాష్ బర్మన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీర్థా బసు దృష్టికి తేవడంతో జరిగిన గందరగోళం వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి దాటాక సుమారు ఒంటిగంట సమయంలో నబను బర్మన్ పోలీసులకు లొంగిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement