భావోద్వేగానికి గురైన షుజత్‌ బుఖారీ భార్య

Shujaat Bukhari Wife Questions If He Did Not Deserve to Live Then who Does - Sakshi

కశ్మీర్‌ : ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ జర్నలిస్టు, ‘రైజింగ్‌ కశ్మీర్‌’ పత్రిక సంపాదకుడు షుజత్‌ బుఖారీ మరణించి నేటికి సరిగ్గా ఏడాది. షుజత్‌ మరణం పాత్రికేయ లోకానికి తీరని లోటు. నేటికి కూడా ఆయన లేడనే వార్తను చాలా మంది నమ్మలేకపోతున్నారు. షుజత్‌ బుఖారీ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య డాక్టర్‌ తహ్మీనా బుఖారీ తన భర్త రాసిన వ్యాసాలను ‘కశ్మీర్స్‌ థిన్‌ రెడ్‌లైన్స్‌ ఇన్‌ శ్రీనగర్‌’ పేరిట ఓ సంకలనంగా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తన భర్తను తల్చుకోని భావోద్వేగానికి గురయ్యారు తహ్మీనా.

ఆమె మాటల్లోనే.. ‘తను(షుజత్‌ బుఖారీ) మరణించాక నా జీవితం చాలా కష్టంగా మారింది. తన చావు నా ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. తన గురించి ఆలోచించినప్పుడల్లా.. నాకు ఎల్లా వేళలా తోడుగా నిలిచే మనిషి నేడు నన్ను విడిచి వెళ్లాడని గుర్తుకొస్తుంది. అలా అనిపించగానే నా గుండె బరువెక్కుతుంది. ఇప్పుడా మనిషి మా మధ్య ఉంటే.. తన పిల్లలకు గైడ్‌గా మారి.. ఈ ప్రపంచంతో ఎలా మెలగాలో చెబుతుండేవాడు. తను ఇక లేడు.. ఎన్నటికి తిరిగి రాడు. నీ భర్తను ఎందుకు చంపారని జనాలు నన్ను ప్రశ్నిస్తుంటారు. సాధరణంగా నాకు నేనే ఎన్నో సార్లు ఈ విషయం గురించి ప్రశ్నించుకొన్నాను. కానీ నాకు సమాధానం దొరకలేదు. అయితే ఒక్కోసారి నాకు చాలా ఆశ్చర్యం కల్గుతుంటుంది. షుజత్‌ బుఖారీ లాంటి ఓ వ్యక్తిని బతకడాని వీల్లేదని చంపేస్తే.. ఇక ఈ భూమ్మిద బతికే హక్కు ఎవరికుంటుంది అని ఆశ్చర్యపోతుంటాను’ అన్నారు.

‘తనను చంపడానికి ఎన్నో సిద్ధాంతాలున్నాయి. కానీ నా దగ్గర సమాధానం మాత్రం లేదు. ఇదంతా జరిగిపోయింది. నా భర్త చనిపోయాడు.. తననేవరు తిరిగి తీసుకురాలేరు. నాకు దేవుడు ఇచ్చే తీర్పే అన్నింటికంటే ఉన్నతమైనది. తను పై నుంచి ప్రతి దాన్ని చూస్తుంటాడు. నా భర్త విషయంలో దేవుడు నాకు న్యాయం చేస్తాడు. నాకా నమ్మకం ఉంది. షుజత్‌ను ఓ గొప్ప తండ్రిగా.. భర్తగా గుర్తు చేసుకుంటాను.. తనతో గడిపిన అందమైన జీవితాన్ని గుర్తు చేసుకుంటాను. తనొక జర్నలిస్ట్‌గా, శ్రేయోభిలాషిగా, స్నేహితుడిగా మాత్రమే జనాలకు తెలుసు. కానీ నేను తనలో ఉన్న మరో కోణాన్ని త్వరలోనే జనాల ముందు ఆవిష్కరిస్తాను. ఓ పుస్తకం రూపంలో తనలోని మరో గొప్ప వ్యక్తిని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను. తను వదిలి వెళ్లిన ఆశయాలను పూర్తి చేయడమే నా ముందున్న లక్ష్యం’ అన్నారు.

‘ఈ వ్యాస సంకలనాన్ని షుజత్‌ నిర్మించిన సంస్థకు.. అతని పిల్లలకు అంకితం ఇస్తున్నాను. తనతో పని చేసే వారిలో షుజత్‌ ఆత్మవిశ్వాసాన్ని మెండుగా నింపాడు. భయం లేని జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వారికి కావాల్సిన ధైర్యాన్ని ఇచ్చాడు. షుజత్‌ లేడు.. ఇక రైజింగ్‌ కశ్మీర్‌ పని కూడా ముగిసి పోతుందని చాలా మంది భావిస్తున్నారు. కానీ దీన్ని అబద్దమని నిరూపిస్తాం. ఇక ఈ ‘కశ్మీర్స్‌ థిన్‌ రెడ్‌ లైన్స్‌ ఇన్‌ శ్రీనగర్‌’ సంకలనం షుజత్‌ ఆలోచనలకు ప్రతిరూపం. తన అభిప్రాయాలకు.. ఆసక్తులకు.. సంబంధించినవే కాక తనకు విలువైనవిగా అనిపించిన విషయాలను కూడా ఇందులో ప్రస్తావించాడు’ అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top