పర స్త్రీ వ్యామోహంతో ‘దోశ కింగ్‌’ పతనం

The Rise And Fall Of  Dosa King, Owner Of Saravanan Bhawan - Sakshi

సాక్షి, చెన్నై: ‘దోశ కింగ్‌’గా పేరొందిన శరవణభవన్ వ్యవస్థాపకుడు రాజగోపాల్‌కు జీవితఖైదు ఆదివారం నుంచి మొదలు కానుంది. హత్య కేసులో న్యాయస్థానం ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. రాజగోపాల్ జీవితంలో ఒక సినిమాకు సరిపడా కథ ఉంది. చిన్నతనంలో కడు బీదరికం అనుభవించి, స్వయంకృషితో ఉన్నత స్ధానానికి ఎదిగి.. మూఢ విశ్వాసాల కారణంగా ఎలా పతనం అయ్యాడో చెప్పడానికి ఆయన జీవితం ఓ గొప్ప ఉదాహరణ. ‘మహిళలపై వ్యామోహం, హత్య చేసైనా సొంతం చేసుకోవాలనే బలహీనత కారణంగా చివరకు కారాగారం పాలయ్యారు.

ఎప్పుడూ నుదుటిపై గంధపు బొట్టు పెట్టుకుని, తెల్లని దుస్తులు ధరించే 71 ఏళ్ల రాజగోపాల్ తమిళనాడులోని  తక్కువ కులానికి చెందిన ఉల్లిపాయల వ్యాపారి కుమారుడు. 1981లో చెన్నైలో కిరాణా దుకాణంతో జీవితాన్ని ప్రారంభించిన రాజగోపాల్, ధైర్యంగా అడుగు ముందుకు వేసి తన మొదటి రెస్టారెంట్‌తో దిగువ మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే ఇడ్లీ, దోసెలు రుచి చూపించారు. అలా ఇంతింతై శరవణ భవన్ పేరు భారతదేశమంతా పాకింది. శరవణభవన్‌ గ్రూప్‌నకు దేశ, విదేశాల్లో కలిపి 20 వరకు హోటళ్లున్నాయి. ఆయన రెస్టరెంట్స్‌లోని గోడలపై దేవతల చిత్రపటాల పక్కనే రెండు ఫోటోలు కనిపిస్తాయి. ఒకటి కుమారులతో కలిసి, మరొకటి తను నమ్మిన ఆధ్యాత్మిక గురువుతో రాజగోపాల్‌ దిగిన ఫొటో. తన దగ్గర పనిచేసే కింది స్థాయి ఉద్యోగులకు కూడా ‘హెల్త్‌ ఇన్సూరెన్స్‌’ కల్పించి వారికి పెద్ద దిక్కులా మారారు. 

ఓ జ్యోతిష్కుడి మాటవిని 2000 సంవత్సరం ప్రారంభంలో తన కింది ఉద్యోగి కుమార్తెను మూడవ భార్యగా పొందడానికి విఫలయత్నం చేశారు. అప్పటికే సదరు యువతి ప్రేమ వివాహం చేసుకొన్న కారణంగా ఆయన్ని తిరస్కరించడంతో ఆమె భర్తను 2001లో హత్య చేయించాడు. 2004లో కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మళ్లీ అప్పీలు చేసుకోవడంతో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు మార్చిలో సమర్థించింది. కోర్టు ఆదేశాల మేరకు జూలై 7 నుంచి ఆయనకు శిక్ష అమలు చేస్తారు. అట్టడుగుస్థాయి నుంచి శిఖరాలను అధిరోహించిన రాజగోపాల్‌ శేషజీవితాన్ని జైలు ఊచల వెనుక గడపనున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top