breaking news
life term prison
-
పర స్త్రీ వ్యామోహంతో ‘దోశ కింగ్’ పతనం
సాక్షి, చెన్నై: ‘దోశ కింగ్’గా పేరొందిన శరవణభవన్ వ్యవస్థాపకుడు రాజగోపాల్‌కు జీవితఖైదు ఆదివారం నుంచి మొదలు కానుంది. హత్య కేసులో న్యాయస్థానం ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. రాజగోపాల్ జీవితంలో ఒక సినిమాకు సరిపడా కథ ఉంది. చిన్నతనంలో కడు బీదరికం అనుభవించి, స్వయంకృషితో ఉన్నత స్ధానానికి ఎదిగి.. మూఢ విశ్వాసాల కారణంగా ఎలా పతనం అయ్యాడో చెప్పడానికి ఆయన జీవితం ఓ గొప్ప ఉదాహరణ. ‘మహిళలపై వ్యామోహం, హత్య చేసైనా సొంతం చేసుకోవాలనే బలహీనత కారణంగా చివరకు కారాగారం పాలయ్యారు. ఎప్పుడూ నుదుటిపై గంధపు బొట్టు పెట్టుకుని, తెల్లని దుస్తులు ధరించే 71 ఏళ్ల రాజగోపాల్ తమిళనాడులోని తక్కువ కులానికి చెందిన ఉల్లిపాయల వ్యాపారి కుమారుడు. 1981లో చెన్నైలో కిరాణా దుకాణంతో జీవితాన్ని ప్రారంభించిన రాజగోపాల్, ధైర్యంగా అడుగు ముందుకు వేసి తన మొదటి రెస్టారెంట్‌తో దిగువ మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే ఇడ్లీ, దోసెలు రుచి చూపించారు. అలా ఇంతింతై శరవణ భవన్ పేరు భారతదేశమంతా పాకింది. శరవణభవన్ గ్రూప్‌నకు దేశ, విదేశాల్లో కలిపి 20 వరకు హోటళ్లున్నాయి. ఆయన రెస్టరెంట్స్‌లోని గోడలపై దేవతల చిత్రపటాల పక్కనే రెండు ఫోటోలు కనిపిస్తాయి. ఒకటి కుమారులతో కలిసి, మరొకటి తను నమ్మిన ఆధ్యాత్మిక గురువుతో రాజగోపాల్ దిగిన ఫొటో. తన దగ్గర పనిచేసే కింది స్థాయి ఉద్యోగులకు కూడా ‘హెల్త్ ఇన్సూరెన్స్’ కల్పించి వారికి పెద్ద దిక్కులా మారారు. ఓ జ్యోతిష్కుడి మాటవిని 2000 సంవత్సరం ప్రారంభంలో తన కింది ఉద్యోగి కుమార్తెను మూడవ భార్యగా పొందడానికి విఫలయత్నం చేశారు. అప్పటికే సదరు యువతి ప్రేమ వివాహం చేసుకొన్న కారణంగా ఆయన్ని తిరస్కరించడంతో ఆమె భర్తను 2001లో హత్య చేయించాడు. 2004లో కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మళ్లీ అప్పీలు చేసుకోవడంతో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు మార్చిలో సమర్థించింది. కోర్టు ఆదేశాల మేరకు జూలై 7 నుంచి ఆయనకు శిక్ష అమలు చేస్తారు. అట్టడుగుస్థాయి నుంచి శిఖరాలను అధిరోహించిన రాజగోపాల్ శేషజీవితాన్ని జైలు ఊచల వెనుక గడపనున్నారు. -
భార్య రెండో భర్త హత్య కేసు.. నిందితుడికి యావజ్జీవం
న్యూఢిల్లీ: విడిపోయి అధికారికంగా విడాకులు తీసుకోకుండానే మరో వ్యక్తిని పెళ్లాడిన భార్య రెండవ భర్తను హత్య చేసిన వ్యక్తికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. హర్యానాకు చెందిన ప్రమోద్ 2007లో పూజా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ప్రమోద్ తన పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నాడని అత డిని విడిచి వేరుగా ఉన్న ఆమె అనిల్ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో అక్టోబర్ 3, 2008లో అనిల్ కనిపించకుండా పోయాడు. కుమారుడు కనిపించకుండా పోయాడని అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు క్రమంలో పోలీసులు అనిల్ మొబైల్ ఫోన్ శోధించగా చివరిసారిగా ప్రమోద్ మాట్లాడినట్లు తెలిసింది. ప్రమోద్ను అరెస్టు చేసి విచారణ చేయగా అనిల్‌ను హత్య చేసినట్లు అంగీకరించాడు. ఈ కేసును విచారణ జరిపిన అదనపు సెషన్స్ జడ్జి ఉమేద్‌సింగ్ గ్రేవాల్ ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా ప్రమోద్ను దోషిగా ప్రకటించి, యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించారు.