అందుకే పాక్‌కు చైనా మద్దతు : ‘రా’ మాజీ చీఫ్‌ | Sakshi
Sakshi News home page

అందుకే పాక్‌కు చైనా మద్దతు : ‘రా’ మాజీ చీఫ్‌

Published Mon, Feb 18 2019 10:43 AM

Pulwama Attack RAW Ex Chief Vikram Sood Comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పాకిస్తాన్‌తో తమకు ఉన్న క్రిడ్‌ ప్రోకో ఒప్పందం వల్లే జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు చైనా నిరాకరిస్తోందని ‘రీసర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌(రా)’ మాజీ చీఫ్‌ విక్రమ్‌సూద్‌ అన్నారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘జాతీయ భద్రతకు బాహ్య నిఘా’అనే అంశంపై సెమినార్‌కుఆయన హాజరయ్యారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... పుల్వామా ఉగ్రదాడి ఆదిల్‌ ఒక్కడి వల్లే సాధ్యం కాలేదని, అతడి వెనుక పెద్ద టీమ్‌ ఉందని వ్యాఖ్యానించారు. భారత్‌ను ప్రత్యక్షంగా ఎదుర్కోలేకే పాకిస్తాన్‌ ఇలా పరోక్షంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాక్‌కు.. అంతర్జాతీయ సమాజంలో చైనా ఒక్కటే వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు. చైనాలోని జింగ్‌జాంగ్‌ ప్రావిన్స్‌లో.. పాక్‌ ఉగ్రవాదులను మోహరించిందని అందుకే చైనా ఆ దేశానికి మద్దతు పలుకుతోందని ఆరోపించారు. ‘ఇదొక క్రిడ్‌ప్రోకో ఒప్పందం. చైనాలో ఉన్న టెర్రరిస్టులు ఆ దేశానికి ఎటువంటి హాని చేయరని పాకిస్తాన్‌ మాట ఇచ్చింది. కాబట్టి చైనా పాక్‌కు అండగా నిలుస్తోంది’ అని సూద్‌ వ్యాఖ్యానించారు.

ఇక పుల్వామా ఉగ్రదాడిపై భారత్‌ ఎలా స్పందించబోతోందని భావిస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా.. ‘ఇదేం బాక్సింగ్‌ మ్యాచ్‌ కాదు. పంచ్‌కు బదులు పంచ్‌ విసరడానికి. ప్రధాని మోదీ చెప్పినట్లుగా అందుకు సరైన సమయం రావాలి’ అని సూద్‌ పేర్కొన్నారు. కాగా గురువారం నాటి పుల్వామా ఉగ్రదాడిని చైనా ఖండిం‍చినప్పటికీ.. ఈ దాడికి బాధ్యత వహించిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత వినతిని తోసిపుచ్చింది. జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిని భారత్‌ దీర్ఘకాలంగా కోరుతున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement