యూపీ ఎన్నికల్లో ఈసారి ఎవరికి పట్టం? | pre election surveys predict tight fight in uttar pradesh | Sakshi
Sakshi News home page

యూపీ ఎన్నికల్లో ఈసారి ఎవరికి పట్టం?

Sep 7 2016 3:53 PM | Updated on Aug 25 2018 4:30 PM

మరో ఆరునెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌పై అన్ని పార్టీలు దృష్టిపెట్టాయి.

మరో ఆరునెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌పై అన్ని పార్టీలు దృష్టిపెట్టాయి. రానున్న ఎన్నికల్లో పాలకపక్ష ఎస్‌పీ.. ఇంకా బీజేపీ, బీఎస్‌పీ మధ్య త్రిముఖ పోటీ బలంగా ఉంటుందని ఏబీపీ-సీఎస్‌డీఎస్, హఫింగ్టన్‌ పోస్ట్- సీ ఓటర్‌ వేర్వేరుగా నిర్వహించిన రెండు సర్వేల్లో వెల్లడైంది. ఏబీపీ- సీఎస్‌డీఎస్‌ సర్వేలో పాలకపక్ష ఎస్పీ కాస్త ముందంజలో ఉండగా, రెండో సర్వేలో బీజేపీ కాస్త ముందంజలో ఉంది. రెండు సర్వేల్లో బహుజన సమాజ్‌ పార్టీకి మూడో స్థానం, కాంగ్రెస్‌ పార్టీకి నాలుగో స్థానం లభించాయి.

ఈసారి ఎన్నికల్లో ఏబీపీ సర్వే ప్రకారం సమాజ్‌వాదీ పార్టీకి 30 శాతం ఓట్లు, బీజేపీకి 27 శాతం, బీఎస్‌పీకి 26 శాతం, కాంగ్రెస్‌ పార్టీకి ఐదు శాతం ఓట్లు, హఫింగ్టన్‌పోస్ట్‌ సర్వే ప్రకారం ఎస్పీకి 27.51 శాతం, బీజేపీకి 27.79 శాతం, బీఎస్‌పీకి 25.44 శాతం, కాంగ్రెస్‌ పార్టీకి 6.19 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ఇంతవరకు ప్రకటించకపోయినా బీజేపీ ముందుండటం విశేషం. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 12 శాతం ఓట్లకు పరిమితమైన బీజేపీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో 42 శాతం ఓట్లతో 71 లోక్‌సభ సీట్లను సాధించిన విషయం తెల్సిందే.

ఇప్పటికీ రాజకీయ పార్టీల ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఖరారు కానందున, దాదాపు 17 కోట్ల జనాభా కలిగిన యూపీలో తాము తీసుకున్న శాంపిల్‌ పరిణామం తక్కువైనందున తాము ప్రస్తుతానికి ఓట్ల శాతం మాత్రమే అంచనా వేశామని, సీట్ల శాతాన్ని అంచనా వేయలేదని రెండు సర్వేలు తెలియజేశాయి. ఈ సర్వేలను జూలై, ఆగస్టు నెలల్లో నిర్వహించగా, మరో సర్వేను అక్టోబర్, నవంబర్‌ నెలల్లో నిర్వహిస్తామని సర్వే సంస్థలు వెల్లడించాయి. ముఖ్యమంత్రిగా అఖిలేష్‌ యాదవ్‌ పనితీరుతో 61 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఏబీపీ సర్వే వెల్లడించగా, ఎస్పీకే ఓటు వేస్తామని 50 శాతం ముస్లింలు వెల్లడించినట్లు హఫింగ్టన్‌పోస్ట్‌ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement