పీఠం ఎక్కించిన ఓట్ల శాతం | Plate loaded percentage of votes | Sakshi
Sakshi News home page

పీఠం ఎక్కించిన ఓట్ల శాతం

Oct 20 2014 1:50 AM | Updated on Mar 29 2019 9:24 PM

పీఠం ఎక్కించిన ఓట్ల శాతం - Sakshi

పీఠం ఎక్కించిన ఓట్ల శాతం

హర్యానా రాజకీయాల్లో బీజేపీ చరిత్ర సృష్టించింది. పార్టీలో హేమాహేమీలు ఎవరూ లేకున్నా, ప్రధాన పార్టీలైన కాంగ్రెస్,

హర్యానాలో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ
4 నుంచి 47 సీట్లకు పెరిగిన బలం
9 శాతం నుంచి 33 శాతానికి పెరిగిన ఓట్లు

 
చండీగఢ్: హర్యానా రాజకీయాల్లో బీజేపీ చరిత్ర సృష్టించింది. పార్టీలో హేమాహేమీలు ఎవరూ లేకున్నా, ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, ఐఎన్‌ఎల్‌డీలకుతోడు కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీలు, స్వతంత్రులు బరిలో నిలిచినా ఒంటరి పోరుతో అఖండ విజయం సాధించి తొలిసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ చిన్న పార్టీగా ముద్రపడ్డ కాషాయ పార్టీ...మోదీ ప్రభంజనంతో అధికార కాంగ్రెస్‌ను మట్టికరిపించింది. 90 స్థానాలున్న హర్యానాలో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 4 సీట్లకే పరిమితమైన స్థితి నుంచి ఏకంగా 47 సీట్లు గెలుచుకొని సత్తా చాటింది. 1966లో హర్యానా ఏర్పడినప్పటి నుంచీ బీజేపీ సాధించిన అత్యుత్తమ ఫలితాలు ఇవే కావడం విశేషం. 1987లో బీజేపీ 20 చోట్ల పోటీ చేసి 16 స్థానాల్లో గెలుపొందింది. ఈ ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన సీట్లను సాధించడంతోపాటు భారీగా తన ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 9.05 శాతం ఓట్లతో సరిపెట్టుకున్న కమలదళం తాజా ఎన్నికల్లో అనూహ్యంగా 24.15 శాతం ఓట్లను పెంచుకొని మొత్తంమీద 33.2 శాతం ఓట్లు సాధించింది. బీజేపీ అన్ని చోట్లా ఒంటరిగానే పోటీ చేయాలంటూ తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలనిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మోదీ చేపట్టిన సుడిగాలి ప్రచారానికితోడు స్థానిక నేతలు, సీఎం రేసులో ఉన్న నేతలైన కెప్టెన్ అభిమన్యు, పార్టీ హర్యానా చీఫ్ రామ్‌విలాస్ శర్మ, మోహన్‌లాల్ ఖట్టర్, ఓపీ ధన్కర్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు.

కాంగ్రెస్, ఐఎన్‌ఎల్‌డీలోని ప్రముఖ నేతలంతా బీజేపీ ప్రభావం ముందు నిలువలేకపోయారు. కాంగ్రెస్ నాయకురాలు, వ్యాపార దిగ్గజం నవీన్ జిందాల్ తల్లి సావిత్రి జిందాల్ (హిసార్), నిర్మలా సింగ్ (అంబాలా సిటీ), దివంగత మాజీ సీఎం బన్సీలాల్ కుమారుడు రణ్‌బీర్‌సింగ్ మహేంద్ర (బద్‌ఖల్) తదితర ప్రముఖులు ఓటమిపాలయ్యారు. అలాగే ఐఎన్‌ఎల్‌డీ చీఫ్ చౌతాలా మనవడు దుష్యంత్ (ఉచనా కలాన్) తదితరులు ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా 13 మంది మహిళలు గెలుపొందారు.

కాంగ్రెస్, ఐఎన్‌ఎల్‌డీ ఓట్ల శాతం పతనం: హర్యానా ఓటర్లు బీజేపీకి బ్రహ్మరథం పట్టడంతో పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, ఈసారైనా అధికారం కోసం కలలుగన్న ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌ఘోర పరాజయం పాలయ్యాయి. కుంభకోణా ల ఆరోపణలు, ప్రజావ్యతిరేకత కాంగ్రెస్ ఓటమికి కారణమవగా అవినీతి కేసులో ఐఎన్‌ఎల్‌డీ చీఫ్ ఓం ప్రకాశ్ చౌతాలా జైలుపాలవడం ఆ పార్టీ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపిం ది. కాంగ్రెస్ కేవలం 20.6 శాతం ఓట్లను సాధించగా ఐఎన్‌ఎల్‌డీ 2000 తర్వాత పోటీ చేసిన నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లోకెల్లా అత్యల్పంగా 24.1 శాతం ఓట్లు పొందింది. 2009లో ఐఎన్‌ఎల్‌డీ 25.29ఓట్ల శాతంతో 31సీట్లను గెలుచుకుంది. 2009లో కాంగ్రెస్ 35.12శాతం ఓట్లను సాధించింది. కాగా, కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్‌సింగ్ హూడా తన పదవికి రాజీనామా చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement