‘ఆ తల్లి ప్రకటన చూసి చలించిపోయా’

Piyush Goyal Slams Oppositions For Petty Politics - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు తప్పుడ వాగ్ధానాలు చేస్తున్నాయని, ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తున్నందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ  పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ వేముల తల్లి రాధిక ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌పై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రోహిత్‌ ఆత్మహత్య తరువాత తన కుటుంబానికి ఇంటి నిర్మాణం కోసం ఇరవై లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారని, రెండేళ్ల గడిచిన వారి నుంచి ఎలాంటి స్పందన లేదని ఇటీవల ఆమె తెలిపారు. రాజకీయ లబ్ధికోసమే తనకు తప్పుడు వాగ్ధానాలు చేశారని వాపోయారు.

రాధిక వ్యాఖ్యలపై పియూష్ గోయల్ తీవ్రంగా స్పందించారు. ‘రోహిత్ తల్లి రాధిక ప్రకటనను చూసి నేను చలించిపోయాను. రాధికను ప్రతిపక్ష పార్టీలు రాజకీయ బంటుగా వాడుకున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి చిల్లర రాజకీయలు మానుకోవాలి. కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా పలు ర్యాలీలో రోహిత్‌ వేముల కుటుంబానికి పలు హామీలు ఇచ్చారు. ఆ తల్లికి అబద్ధపు ప్రకటను చేసినందుకు రాహుల్‌ క్షమాపణలు చెప్పాలి. ఇలాంటి చర్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంద’ని గోయల్‌ అన్నారు.

తనకు ఇంటి నిర్మాణం కోసం ప్రకటించిన ఇరవై లక్షలకు ముస్లిం లీగ్‌ నుంచి రెండు చెక్కులు వచ్చాయని, అవి రెండు బౌన్స్‌ అయ్యాయని ఆమె చేసిన ఆరోపణలపై ఐయూఎమ్‌ఎల్‌ నేత ఎమ్‌కే మునీర్‌ స్పందించారు. ‘రాధిక వేములకు ఇరవైలక్షలు ఆర్థిక సహయం చేస్తామన్నది వాస్తవం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాం. పొరపాటు వల్ల రెండు చెక్కులు బౌన్స్‌ అయ్యాయి. ఇదివరకే ఇంటి నిర్మాణ స్థలం కోసం ఐదు లక్షలు చెల్లించామ’ని ముస్లిం లీగ్‌ నేత మునీర్‌ పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top