మహారాష్ట్రలో మజ్లిస్ బోణి | MIM open account, wins in two seat in Maharastra Elections | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో మజ్లిస్ బోణి

Oct 20 2014 1:48 AM | Updated on Mar 29 2019 9:24 PM

మహారాష్ట్రలో మజ్లిస్ బోణి - Sakshi

మహారాష్ట్రలో మజ్లిస్ బోణి

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆలిండియా మజ్లిస్-ఈ-ఇత్తెహాదుల్-ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీ బోణీ కొట్టింది.

సాక్షి, ముంబై/సాక్షి, సిటీబ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆలిండియా మజ్లిస్-ఈ-ఇత్తెహాదుల్-ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీ బోణీ కొట్టింది. హైదరాబాద్ పాతనగరానికే పరిమితమైన ఎంఐఎం ఎట్టకేలకు తన చట్టసభల ప్రాతి నిధ్యాన్ని మహారాష్ర్టకు సైతం విస్తరించింది. తొలిసారిగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి 2 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ముందుగా నాందేడ్ కార్పొరేషన్‌లో సత్తాచాటి మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లోకి ప్రవేశించిన ఆ పార్టీ 3 నియోజకవర్గాల్లో గట్టిపోటీనిచ్చి రెండోస్థానంలో నిలిచింది. ఔరంగాబాద్ సెంట్ర ల్ నియోజకవర్గం నుంచి జర్నలిస్టు సయ్యద్ ఇంతియాజ్ జలీల్, ముంబైలోని బైకలా నియోజకవర్గం నుంచి న్యాయవాది వారిస్ యూసుఫ్ పఠాన్‌లు ఎంఐఎం తరఫున విజయం సాధిం చారు. ఇంతియాజ్ శివసేన అభ్యర్థి, మాజీ ఎంపీ ప్రదీప్ జైస్వాల్‌ను 20 వేల ఓట్ల తేడాతో, వారిస్ బీజేపీ అభ్యర్థి మధుకర్ చవాన్‌ను 1,357 ఓట్ల తేడాతో ఓడించారు. 
 
 24 చోట్ల పోటీ, 0.9 శాతం ఓట్లు... 
 మహారాష్ట్రలోని 288 స్థానాలకుగాను మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్న 24 చోట్ల ఎంఐఎం పోటీ చేసింది. రాష్ట్రంలో పోలైన ఓట్లలో 0.9 శాతం (4,89,614 ఓట్లు) దక్కించుకుంది. ఔరంగాబాద్ ఈస్ట్, వందేరా ఈస్ట్, పర్భనీ నియోజకవర్గాల్లో గట్టి పోటీనిచ్చిన ఎంఐఎం స్వల్ప ఓట్ల తేడాతోనే  ఓడిపోయింది. మరో తొమ్మిది నియోజకవర్గాల్లో మూడో స్థానంలో నిలిచింది. ప్రత్యర్థి పార్టీలకు దీటుగా పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్, పార్టీ తెలంగాణ రాష్ర్ట శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్, ఆరుగులు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, 23 మంది కార్పొరేటర్లు, పార్టీ బాధ్యులు పక్షం రోజులకు పైగా మహారాష్ట్రలో మకాం వేసి ప్రచారం చేశారు. అయితే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుందనుకున్న ఎమ్మెన్నెస్ 219 స్థానాల్లో పోటీ చేసి జున్నార్ స్థానంలో మాత్రమే గెలిచి దారుణ పరాభవం పొందింది (2009లో ఎమ్మెన్నెస్‌కు 13 సీట్లు వచ్చాయి). మహారాష్ట్రలో పార్టీకి క్షేత్రస్థాయి యంత్రాంగం లేకున్నా ఎంఐఎం 2 స్థానాల్లో విజయ సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.   
 

Advertisement
 
Advertisement
Advertisement