త్వరలో చైనాను దాటనున్న మహారాష్ట్ర

Maharashtra Soon Overtake China Record In Coronavirus - Sakshi

ఢిల్లీ : కరోనా వైరస్‌ కేసులు దేశవ్యాప్తంగా రోజురోజుకు ఉదృతమవుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర వైద్యారోగ్య శాఖ శనివారం వరకు వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు దేశంలో ఇప్పటివరకు 2,36,657 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 6,642గా ఉంది. ఇప్పటివరకు కరోనా నుంచి 1,14,073 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,15,942 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అయితే దేశంలో నమోదైన కరోనా కేసుల్లో అగ్రభాగం మహారాష్ట్రదే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా శనివారం వరకు ఒక్క మహారాష్ట్రలోనే దాదాపు 80వేలకు పైగా కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తుంది. ఈ లెక్కన రానున్న రెండు మూడు రోజుల్లో మహారాష్ట్ర చైనాను దాటేయనుంది. చైనాలో అనధికార లెక్కల ప్రకారం దేశంలో కరోనా కేసుల సంఖ్య 84వేలుగా ఉంది. ఇవి సరైన లెక్కలా కావా అనే విషయాన్ని పక్కనపెడితే మనకున్న సమాచారం ప్రకారం రానున్న రోజుల్లో మహారాష్ట్ర చైనాను దాటడం ఖాయంగా కనిపిస్తోంది.  (40 వేలు దాటిన కరోనా మరణాలు)

ఇక దేశవ్యాప్తంగా 6642 మరణాలు చోటుచేసుకోగా ఒక్క మహారాష్ట్రలోనే 2849 మరణాలు చోటుచేసుకున్నాయి. మహారాష్ట్ర తర్వాత దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న జాబితాలో తమిళనాడు, గుజరాత్‌, ఢిల్లీ ముందువరుసలో ఉన్నాయి. తమిళనాడులో 28,694 కరోనా కేసులు నమోదవ్వగా, ఢిల్లీలో 26,334, గుజరాత్‌లో 19094 కేసులు నమోదయ్యాయి. రాజస్తాన్‌లోనూ కరోనా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఆ రాష్ట్రంలో 10వేలకు పైగా కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 218గా ఉంది. ఇటు మధ్యప్రదేశ్‌లో కరోనా బాధితుల సంఖ్య 8996, ఉత్తర్‌ ప్రదేశ్‌లో 9773కు చేరింది. (24 గంటల్లో 9887 కేసులు.. 294 మరణాలు)

ఇక తెలుగురాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 3588కు చేరగా, మృతుల సంఖ్య 73కి చేరింది. ఇక తెలంగాణలో శుక్రవారం వరకు 3,290 కేసులు నమోదవ్వగా.. 113 మంది మరణించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 68,50,236 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 3,98,224 మంది మృత్యువాతపడ్డారు. అత్యధిక కేసులు నమోదయిన దేశాల్లో భారత్‌ (2,36,657) ఆరోస్థానంలో నిలిచింది. అమెరికాలో ఇప్పటివరకు 19,65,708 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత బ్రెజిల్‌ (6,46,006), రష్యా(4,49,834), స్పెయిన్‌ (2,88,058) దేశాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నాయి. (2 మిలియన్ల వ్యాక్సిన్లు సిద్ధం: ట్రంప్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top