పెట్రో షాక్‌తో బైక్‌ అమ్మి గుర్రం కొన్నాడు..

Maharashtra Milkman Sells Bike, Now Does Rounds On Horse - Sakshi

సాక్షి, ముంబయి : పెట్రోల్‌ ధరలు రికార్డుస్ధాయికి చేరడంతో వాహనదారులు ఉక్కిరిబిక్కిరవుతుంటే స్ధానిక పన్నులు అధికంగా వడ్డిస్తున్న మహారాష్ట్రలో పెట్రోల్‌ ధరలు మరింత భారమయ్యాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో ప్రజలు పెట్రోల్‌ బంకుల్లో తమ జేబులను ఖాళీ చేసుకుంటున్నారు. ఇక పెట్రో భారాలను భరించలేని ఓ వ్యక్తి ఏకంగా బైక్‌ను అమ్మేసి గుర్రాన్ని కొనుగోలు చేయడం అందరినీ విస్తుగొలుపుతోంది. ముంబయికి 100 కిమీ దూరంలోని ఓ చిన్న గ్రామానికి చెందిన పాలు విక్రయించే పాండురంగ్‌ తన బైక్‌ను రూ 22,000కు అమ్మేసి రూ 25,000కు గుర్రాన్ని కొనుగోలు చేశారు.

ప్రతిరోజూ ఉదయం పాలు పోసేందుకు ఏడు కిలోమీటర్లు తిరిగే పాండురంగ్‌ పెట్రోల్‌ ధర రూ 80 దాటడంతో పెట్రోల్‌ కొనేందుకే అతనికి రోజుకు రూ 200 వెచ్చించాల్సి వస్తోంది. తన తండ్రి కూడా ఇదే వృత్తిలో ఉండేవాడని, అప్పట్లో ఏడు కిలోమీటర్లు కాలినడకనే తిరుగుతూ పాలు పోసేవారని చెప్పుకొచ్చాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఈ వృత్తిని తాను చేపట్టానని, వేగంగా పాలు సరఫరా చేసేందుకు బైక్‌ను వాడుతున్నానని చెప్పాడు. పెట్రోల్‌ ధరలను భరించలేకే తాను బైక్‌ను రూ 22,000కు అమ్మేశానని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇప్పుడు తాను గుర్రంపైనే ఇంటింటికీ తిరుగుతూ పాలు పోస్తున్నానని, బైక్‌తో పోలిస్తే గుర్రానికి నిర్వహణ వ్యయం చాలా తక్కువగా ఉందని, దీని బాగోగులు చూసేందుకు వారానికి కేవలం రూ 50 ఖర్చు చేస్తున్నానని చెప్పాడు. భార్య, ముగ్గురు పిల్లలు, తల్లిని పోషించాల్సిన పాండురంగ్‌ గుర్రంపై పాలుపోస్తుండటంతో పెట్రోల్‌పై పెట్టే ఖర్చు గణనీయంగా తగ్గింది. పెట్రోల్‌ పంపుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుడా పోయిందని చెబుతున్నాడు. ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ దేశంలోనే అత్యధికంగా రూ 85.29కు చేరింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top