లాక్‌డౌన్‌ల వైఫల్యం: జేపీ మోర్గాన్‌ అధ్యయనం

Lockdowns Failed to Alter the course of Pandemic: JP Morgan Study - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌ను అరికట్టడం కోసం దాని బారిన పడిన దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్‌లు విధించాయి. కొన్ని దేశాలు లాక్‌డౌన్‌లు పూర్తిగా ఎత్తివేయగా, మరికొన్ని దేశాలు పాక్షికంగా కొనసాగిస్తున్నాయి. ఇంకొన్ని దేశాలు దశల వారిగా ఎత్తివేస్తున్నాయి. కరోనాను అరికట్టడంలో ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ల ప్రభావం ఎంత? ఆశించిన ఫలితాలు వచ్చాయా? కరోనా వైరస్‌ మహమ్మారి విస్తరణను అరికట్టడంలో లాక్‌డౌన్‌లు విఫలం అవడమే కాకుండా వాటివల్ల ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఉపాధి కోల్పోయారని ప్రముఖ ఆర్థిక విశ్లేషణ సంస్థ ‘జేపీ మోర్గాన్‌’ ఓ అధ్యయన నివేదికలో తెలిపింది. (ఇది నిజమా.. ఇంతకంటే దారుణం ఉండదు)

లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పలు దేశాల్లో కరోనా ఇన్‌ఫెక్షన్లు తగ్గాయని, మరికొన్ని దేశాల్లో ఇన్‌ఫెక్షన్లు పెరిగాయని.. ఇలా తగ్గడానికి, పెరగడానికి ప్రత్యక్షంగా లాక్‌డౌన్‌ కారణం కాదని, కరోనా వైరస్‌ సొంత ‘గతి’ క్రమమే అందుకు కారణం కావచ్చని జేపీ మోర్గాన్‌ సంస్థ తరఫున నివేదికను రూపొందించిన ఫిజిసిస్ట్, స్ట్రాటజిస్ట్‌ అయిన మార్కో కొలనోవిక్‌ వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిపై లాక్‌డౌన్‌ల ప్రభావం తక్కువేనని, లాక్‌డౌన్‌ చర్యలు సరిపోలేదని అధ్యయనం పేర్కొంది. విద్యా సంస్థలు, షాపింగ్‌ మాల్స్‌ తెరచిన తర్వాత కూడా డెన్మార్క్‌లో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయని, అదే జర్మనీలో లాక్‌డౌన్‌ను సడలించాక ముందులాగా కేసులు తక్కువగానే ఉన్నాయని అధ్యయనం తెలిపింది. (అక్కడ విమాన సర్వీసులు వాయిదా?)


లాక్‌డౌన్‌ చర్యలను ఉపసంహరించుకున్నాక అమెరికాలోని అలబామా, విస్కాన్సిన్, కొలరాడో, మిసిసిపిలలో కరోనా కేసులు తక్కువగానే ఉన్నాయని పేర్కొంది. నెవడా, నార్త్‌ డకోడాలో కేసులు పెరిగాయి. భారత్‌లో కూడా కేసులు పెరిగాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేశాక అన్ని చోట్ల జనసమూహాలు పెరుగుతాయి కనుక కరోనా కేసులు కూడా పెరిగే అవకాశం ఉంటుందన్నది మోర్గాన్‌ సంస్థ వాదన. లాక్‌డౌన్‌లు ఎత్తివేశాక ఎక్కువ దేశాల్లో కరోనా కేసులు పెరగకుండా తగ్గడం అనేది లాక్‌డౌన్‌లకు సంబంధించిన విషయం కాదని, అది కరోనా వైరస్‌ ‘గతి’కి సంబంధించిన అంశంమని మోర్గాన్‌ అభిప్రాయపడినట్లు స్పష్టం అవుతుంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య, మరణాల సంఖ్య ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉండడం కూడా కరోనా వైరస్‌ ‘గతి’కి సంబంధించిన అంశమని పలువురు శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికే అభిప్రాయపడ్డారు. కరోనా వల్ల కన్నా లాక్‌డౌన్‌ల వల్ల సంభవిస్తున్న మరణాలు ఎక్కువగా ఉన్నాయని, ఇక ముందు కూడా ఉంటాయని మోర్గాన్‌ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top