బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి 

Krishnaiah Submitting Letter To Union Minister Over BC Reservation - Sakshi

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య

సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆధ్వర్యంలో వందలాది మంది బీసీలు జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ‘ఓట్లు బీసీలవి.. సీట్లు అగ్రకులాలకా?’అంటూ నినదించారు.

ధర్నాను ఉద్దేశించి ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం 30 ఏళ్లుగా ఉద్యమిస్తున్నా ప్రభుత్వాలు స్పందించడం లేదని పేర్కొన్నారు. 16 రాష్ట్రాల నుంచి బీసీలకు ప్రాతినిధ్యమే లేదని వాపోయారు. ఇది ప్రజాస్వామ్యం కాదని, ధనస్వామ్యమని ఆరోపించారు. పార్లమెంట్‌లో 96 మంది బీసీ సభ్యులున్నా బీసీ రిజర్వేషన్లపై మాట్లాడకపోవడం అన్యాయమని పేర్కొన్నారు.

బీసీల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర సామాజిక, న్యాయ మంత్రి థావర్‌చంద్‌ గెహ్లాట్‌ను బీసీ సంఘాల నేతలు కలిశారు. కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు కేవలం రూ.1,050 కోట్లు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ నీల వెంకటేశ్, బీసీ జేఏసీ చైర్మన్‌ నీరడి భూపేష్‌ సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top