కర్ణాటక బంద్‌: ఆంధ్రా బస్సుపై రాళ్ల దాడి | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తంగా మారిన కర్ణాటక బంద్

Published Thu, Feb 13 2020 11:10 AM

Karnataka bandh: Protesters Hurl Stones At Bus In Farangipet - Sakshi

బెంగళూరు : ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కన్నడిగులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలంటూ కన్నడ సంఘాలు ఇవాళ రేపు కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు ఇప్పటికే అన్ని సంఘాలు (ఆటో, క్యాబ్‌, రైతు, కార్మిక) తమ మద్దతును ప్రకటించడంతో రాష్ట్ర బంద్‌ ఉద్రిక్తంగా మారింది. గురువారం ఉదయం తిరుపతి నుంచి మంగళూరు వెళ్తున్న బస్సుపై ఫరంగిపెటె ప్రాంతంలో కొందరు నిరసన కారులు రాళ్ల దాడి చేశారు.  సరోజినీ బిందురావ్‌ నివేదికను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన సంఘాల ప్రతినిధులు రేపు ముఖ్యమంత్రి యడియూరప్పకు నివేదికను సమర్పించనున్నారు. అయితే ప్రభుత్వ, స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా నడుస్తాయని, ఎటువంటి సెలవు లేదని విద్యాశాఖ మంత్రి సురేశ్ కుమార్ తెలిపారు. బంద్‌కు పిలుపునిచ్చిన సంస్థలు శాంతియుతంగా నిరసనలు తెలపాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు కర్ణాటక సీఎం యడ్యురప్ప ప్రజలకు నిరసనకారులు  ఎలాంటి అసౌకర్యం కలిగించరాదని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం కన్నడిగులకు అనుకూలంగా ఉందని తెలిపారు. ఆందోళన కారులు తమతో మాట్లాడటానికి అనుకూలంగా ఉంటే తమ ప్రభుత్వం వారితో చర్చించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని వెల్లడించారు. సరోజినీ మహిషి నివేదికను అమలు చేయడానికి తాము ఇప్పటికే సాధ్యమైనవన్నీ చేశామని, ఇంకా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కాగా 1984లో కర్ణాటక ప్రభుత్వం కేంద్ర మాజీ మంత్రి సరోజినీ బిందురావ్ మహిషి నేత్రుత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రెండు సంవత్సరాల అనంతరం 1986లో ఈ కమిటీ తమ నివేదికను సమర్పించింది. నివేదికలో 56 సిఫారసులను పేర్కొన్న కమిటీ.. కన్నడిగులకు అన్ని సెక్టార్లో 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని సూచించింది.

Advertisement
Advertisement