రాహుల్‌తో కమల్‌ భేటీ

Kamal Hassan meets Rahul Gandhi, calls it 'courtesy meeting' - Sakshi

కాంగ్రెస్‌తో ఎంఎన్‌ఎం జట్టు కడుతుందా?

తమిళనాట ఆసక్తికర రాజకీయం

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సినీ నటుడు, మక్కల్‌ నీధి మయ్యమ్‌(ఎంఎన్‌ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యారు. రాహుల్‌ నివాసంలో బుధవారం గంటపాటు జరిగిన ఈ భేటీలో ప్రియాంక వాద్రా కూడా పాల్గొన్నారు. ‘మేమిద్దరం రాజకీయాలపై చర్చలు జరిపాం. తమిళనాడులో మక్కల్‌ నీధి మయ్యమ్, కాంగ్రెస్‌ కూటమి ఏర్పాటుపై మాట్లాడుకోలేదు. ఇది మర్యాద పూర్వక సమావేశం మాత్రమే’ అని కమల్‌ విలేకరులతో అన్నారు.

అంతకుముందు కమల్‌ ఎన్నికల కమిషన్‌(ఈసీ) అధికారులను కలిశారు. తన మక్కల్‌ నీధి మయ్యమ్‌ పార్టీ రిజిస్ట్రేషన్‌పై వారితో మాట్లాడారు. తమ పార్టీకి త్వరలోనే గుర్తింపు దక్కనుందని తెలిపారు. పార్టీ గుర్తు ఇంకా ఖరారు చేయలేదన్నారు. రాహుల్‌తో సమావేశం మర్యాద పూర్వకమేనని కమల్‌ చెబుతున్నప్పటికీ, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఎన్‌ఎం, వామపక్షాలు కలిసి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తమిళనాట రాజకీయ పరిస్థితులు అస్పష్టంగా ఉన్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని వారు చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత నెలలో సీఎం కుమారస్వామి ప్రమాణస్వీకారం సందర్భంగా బెంగళూరులో కమల్, రాహుల్‌ సమావేశమయ్యారు. తమిళనాడు రాజకీయాల్లో మొదటిసారిగా జయలలిత, కరుణానిధి లేకుండా ఈసారి అక్కడ ఎన్నికలు జరుగనుండగా కొత్తగా రాజకీయ పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి.

రజనీకాంత్‌ కూడా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించినప్పటికీ పార్టీని ఇంకా ఖరారు చేయలేదు. బూత్‌ స్థాయి నుంచి పార్టీని నిర్మించుకునే పనిలో ఉన్నారు. అయితే, కమల్‌ హాసన్‌ ఇవేమీ లేకుండానే పార్టీ కార్యకలాపాలను ప్రారంభించారు. కమల్, కాంగ్రెస్, దినకరన్‌ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తే అధికారం ఖాయమని ఏఐఏడీఎంకే నేత ఒకరు విశ్లేషించారు. ఈ నేపథ్యంలోనే కమల్, రాహుల్‌ సమావేశం జరిగిందని సమాచారం. తమిళనాడులో ఉన్న 39 లోక్‌సభ స్థానాలపై అధికార బీజేపీ కూడా కన్నేసి ఉంచింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top