
పౌరసత్వ సవరణ చట్టంపై దీదీ వ్యాఖ్యల పట్ల బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇండోర్ : పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీలపై ఆందోళనలు కొనసాగించాలని విద్యార్ధులకు సలహా ఇస్తానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఆమె మతిస్ధిమితం కోల్పోయారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గీయ అన్నారు. పౌరచట్టం అమల్లోకి వస్తే చొరబాటుదారులను గుర్తించే పరిస్థితి నెలకొంటుందని, అప్పుడు ఆమె ఓటుబ్యాంక్ (చొరబాటుదార్లు) దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. చొరబాటుదారులను పంపించివేస్తారని ఆమె ఆందోళన చెందుతున్నారని అందుకే మతిస్ధిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అసహనంతో వ్యాఖ్యలు చేస్తున్న మమతా బెనర్జీకి తక్షణమే వైద్య పరీక్షలు జరిపించాలని అన్నారు. గురువారం కోల్‌కతాలో జరిగిన ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ పౌర చట్టం, ఎన్‌ఆర్‌సీలపై ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన కొనసాగించాలని విద్యార్ధులకు సూచించిన సంగతి తెలిసిందే.