జస్టిస్‌ పీఎన్‌ భగవతి కన్నుమూత

జస్టిస్‌ పీఎన్‌ భగవతి కన్నుమూత - Sakshi


న్యూఢిల్లీ: భారత న్యాయ వ్యవస్థలో ‘ప్రజా ప్రయోజన వ్యాజ్యం’(పిల్‌)కు ఆద్యుడిగా భావించే న్యాయ కోవిదుడు, మాజీ సీజేఐ జస్టిస్‌ పీఎన్‌ భగవతి గురువారం కన్ను ముశారు. ఆయన వయసు 95 ఏళ్లు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.అంత్యక్రియలు శనివారం నిర్వహిస్తామని చెప్పారు. భగవతికి భార్య ప్రభావతి, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పీఎన్‌ భగవతి 1985 జూలై నుంచి 1986 డిసెంబర్‌ వరకు సుప్రీంకోర్టుకు 17వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అంతకు ముందు గుజరాత్‌ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు.



1973 జూలైలో సుప్రీంకోర్టులో జడ్జిగా చేరారు. సుప్రీంకోర్టు జడ్జిగా భగవతి..పిల్, భారత న్యాయ వ్యవస్థలో సంపూర్ణ జవాబుదారీతనం లాంటి భావనలను ప్రవేశపెట్టారు. ఖైదీలు కూడా ప్రాథమిక హక్కులకు అర్హులే అని ఆయన ఓ సందర్భంలో తీర్పునిచ్చారు. ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి పౌరులు కోర్టులను ఆశ్రయించడానికి వారికి ప్రత్యేక హక్కులుండనక్కర్లేదని అన్నారు. 1978లో ప్రస్తుత కేంద్ర మంత్రి మేనకా గాంధీ పాస్‌పోర్టు స్వాధీన కేసులో ఆయన ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది. పౌరుల కదలికలను నియంత్రించకూడదని, పాస్‌పోర్టులను తమ వద్దే ఉంచుకునే హక్కు ప్రతిఒక్కరికి ఉందని భగవతి ఆ సందర్భంగా అన్నారు. మినర్వా మిల్స్‌ కేసు విచారణలో...అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న సమయంలో పార్లమెంట్‌ చేసిన 42వ రాజ్యాంగ సవరణకు మద్దతిచ్చిన ఏకైక జడ్జి భగవతినే. అయితే ఆ కేసు విచారించిన ధర్మాసనంలో మెజారిటీ కారణంగా దాన్ని కొట్టివేశారు.



ప్రధాని సంతాపం: భగవతి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థను ప్రజలకు చేరువ చేయడంలో భగవతి ఎంతో కృషిచేశారని కొనియాడుతూ ట్వీట్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top