మాల్దీవుల్లో మనం జోక్యం చేసుకుంటే...? | If India intervene maldives crisis, what happened? | Sakshi
Sakshi News home page

మాల్దీవుల్లో మనం జోక్యం చేసుకుంటే...?

Feb 7 2018 4:25 PM | Updated on Sep 17 2018 4:55 PM

If India intervene maldives crisis, what happened? - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణాసియా దేశమైన మాల్దీవుల్లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంలో భారత దేశం జోక్యం చేసుకుంటుందా? దాదాపు మూడు దశాబ్దాల కింద అప్పటి భారత ప్రధాన మంత్రి రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం తీసుకున్న చొరవ మేరకు భారత సైనికులు మాల్దీవులు వెళ్లి ఆ దేశ అధ్యక్షుడు మహుమూద్‌ అబ్దుల్‌ గయూమ్‌ను రక్షించడమే కాకుండా తిరిగి ఆయన్ని అధికార సింహాసనం మీద కూర్చోబెట్టింది. అంతర్జాతీయ వ్యవహారాల్లో అప్పుడు భారత్‌ నిర్వహించిన పాత్రను అంతర్జాతీయ సమాజం ప్రశంసించింది.

మాల్దీవుల్లో ఇప్పుడు ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించడం కోసం అప్పటిలాగా సైనిక చర్య తీసుకునే అవకాశం భారత ప్రభుత్వానికి ఉందా? మారిన నేటి అంతర్జాతీయ పరిస్థితుల్లో అలాంటి చర్య తీసుకునేందుకు అవకాశం ఉందా? ఉంటే అందుకు భారత ప్రభుత్వం సిద్ధపడుతుందా? సిద్ధపడి సైన్యాన్ని పంపిస్తే ఎదురయ్యే పరిణామాలు ఏమిటీ? అవి ఎలా ఉంటాయి? ప్రస్తుత మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ నిరంకుశంగా వ్యవహరిస్తూ దేశంలో ఎమర్జెన్సీ విధించి మాజీ దేశాధినేతలను, ప్రతిపక్ష నేతలను, సుప్రీం కోర్టు న్యాయమూర్తులను జైళ్లలో నిర్బంధించారని, ఈ విషయంలో భారత జోక్యం చేసుకొని వారందరిని విడిపించాలని ప్రవాస జీవితం గడుపుతున్న మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మొహమ్మద్‌ నషీద్‌ భారత్‌కు పదే పదే విజ్ఞప్తి చేస్తున్న కారణంగా ఇప్పుడు ఈ ప్రశ్నలు తలెత్తాయి. నాడు భారత సైన్యం జోక్యం చేసుకొని రక్షించిన నాటి అధ్యక్షుడు అబ్దుల్‌ గయూమ్‌ కూడా ఇప్పుడు నిర్బంధించిన వారిలో ఉన్నారు.

నవంబర్‌ 3, 1988
ఎలాంటి శబ్దాలు లేకుండా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే మాల్లీవుల రాజధాని నగరం మాలి నగరం ఉదయం ఆరు గంటలకు మిషన్‌ గన్ల మోతలు, రాకెట్లు, గ్రెనేడ్ల పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. సముద్రమార్గాన పడవల్లో వచ్చిన దాదాపు 80 మంది సాయుధులు కాల్పులు జరుపుతూ దేశాధ్యక్షుడి భవనాన్ని, మల్దీవులు సెక్యూరిటీ సర్వీసెస్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌) ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. వాటితోపాటు ప్రభుత్వ రేడియో, టీవీ కార్యాలయాలను స్వాధీనం చేసుకున్నారు. నగరం అంతటా విద్యుత్‌ను, నీటి సరఫరాను నిలిపి వేశారు. ఆ దాడి చేసిన సాయుధులు ఎవరో కాదు, ఉమా మహేశ్వరన్‌ నాయకత్వంలోని ‘పీపుల్‌ లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలం (పీఎల్‌ఓటీఈ). ఎల్‌టీటీఈకి వ్యతిరేకంగా భారత ఇంటెలిజెన్స్‌ సంస్థలు గట్టిగా మద్దతిస్తున్న సంస్థ అది. భారత సైనికులు శ్రీలంకతో కలిసి ఎల్‌టీటీఈకి వ్యతిరేకంగా పోరాడుతున్న సమయమది.

దేశ బహిష్కరణకు గురైన మాల్దీవుల వ్యాపారి అబ్దుల్లా లుథూ, ఆయన సహచరుడు సిక్కా అహ్మద్‌ ఇస్మాయిల్‌ మాలిక్‌ల తరఫున తమిళ ఈలం సంస్థ ఈ దాడిని జరిపింది. ఈ దాడిని విజయవంతం చేయడం కోసం తమిళ ఈలం సంస్థకు చెందిన కొంత మంది సభ్యులు ముందుగానే పర్యాటకుల రూపంలో మాలికొచ్చి రంగం సిద్ధం చేసుకున్నారు. దాడి వార్తలు తెలియగానే దేశాధ్యక్షుడు గయూమ్‌ దేశాధ్యక్ష భవనం వదిలేసి రహస్య ప్రదేశానికి వెళ్లారు. అక్కడి నుంచి ఆయన భారత్, పాకిస్థాన్, శ్రీలంక, అమెరికా, బ్రిటన్, కామన్‌ వెల్త్‌ దేశాల సహాయాన్ని అర్థించారు.

పాకిస్థాన్‌తోపాటు బ్రిటన్, కామన్‌వెల్త్‌ దేశాలు స్పందించలేదు. శ్రీలంక ముందుగా స్పందించి భారత ప్రభుత్వం సహకారాన్ని కోరింది. భారత విమానాలను పంపిస్తే వాటి వెంట తమ సైన్యాన్ని పంపిస్తామని శ్రీలంక సూచించింది. అప్పటికి ఈ అంశాన్ని చర్చించని రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తెలపలేదు. అమెరికా జోక్యం చేసుకునేందుకు సుముఖంగా ఉంది. అయితే ఆ దేశం తన సైన్యాన్ని పంపించాలంటే డిగో గార్షియా నుంచి పంపించాలి. అక్కడి నుంచి అమెరికా సైన్యం మాలి చేరుకోవాలంటే మూడు రోజులు పడుతుంది. అప్పటికి అంతా ముగిసిపోతుందని భావించి అమెరికా జోక్యం చేసుకునేందుకు ముందుకు రాలేదు.

ఆపరేషన్‌ కాక్టస్‌
రాజీవ్‌ ప్రభుత్వం ముందుకు మాల్దీవుల అంశం వచ్చినప్పుడు ‘దక్షిణాసియాలోని ఓ చిన్న దేశంలో అస్థిర పరిస్థితులు ఏర్పడితే వాటిని చక్కదిద్దాల్సిన బాధ్యత దక్షిణాసియాలోనే అతిపెద్ద దేశమైన భారత్‌పైన ఉంటుంది. అంతేకాకుండా అస్థిర పరిస్థితులను చూస్తూ ఊరుకుంటే ఒక్కోసారి మనదేశంలో కూడా అలాంటి పరిస్థితు ఏర్పడవచ్చు. ఈ ప్రాంతంలో ఓ బాధ్యతగల దేశంగా సముచిత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీ ఉన్నతాధికారుతో వ్యాఖ్యానించారు. ఉన్నత సైనిక, పౌర అధికారులంతా చాలాసేపు తర్జనభర్జన పడినప్పటికీ విషయం తెల్సిన తొమ్మిది గంటల్లోనే 1600 మంది భారత సైన్యం మాలిలో దిగింది.

మాలిని ముట్టడించిన తమిళ సాయుధులు హులుహులు విమానాశ్రయాన్ని పట్టించుకోకపోవడంతో భారత సైనికులు అక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా దిగడంతోపాటు విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకొని తన ఆపరేషన్‌ను నిర్విఘ్నంగా నిర్వహించింది. (గమనిక! ఆపరేషన్‌ కాక్టస్‌ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే శుశాంత్‌ సింగ్‌ రాసిన ‘ఆపరేషన్‌ కాక్టస్‌: మిషన్‌ ఇంపాజిబుల్‌ ఇన్‌ ది మాల్దీవ్స్‌’ లేదా ‘మిషన్‌ ఒవర్‌సీస్‌’ పుస్తకం చదవండి) అప్పటికే తనను తాను దేశాధ్యక్షుడిగా ప్రకటించుకున్న అబ్దుల్లా లుథూను భారత సైన్యం గద్దె దింపి తిరిగి గయూమ్‌ను అధ్యక్షుడిగా ప్రకటించింది. 27 మంది బంధీలతో పడవల్లో పారిపోతున్న కొంతమంది తమిళ సాయుధులను అమెరికా వైమానిక సహకారంతో భారత నౌకాదళం పట్టుకొని అరెస్ట్‌ చేసింది. అప్పటి నుంచి ఓ సంవత్సరం పాటు 150 మంది భారతీయ సైనికులు గయూమ్‌కు రక్షణగా మాలిలోనే ఉన్నారు.

భారత్‌ జోక్యం చేసుకుంటుందా?
ఆపరేషన్‌ కాక్టస్‌ తర్వాత మాల్దీవులకు ఆర్థిక, సైనక సహకారాన్ని భారత్‌ అందిస్తున్నప్పటికీ ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా దూరంగా ఉంటూ వస్తోంది. ఇప్పటికే చైనాను దూరం చేసుకున్న భారత్‌ మాల్దీవుల్లో జోక్యం చేసుకుంటే చైనాతో మరింత శత్రుత్వం పెరుగుతుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించే పేరుతో ఓ దేశ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడం సమంజసం కాదని వారంటున్నారు. ఆపరేషన్‌ కాక్టస్‌ లాంటి ఆపరేషన్‌ను ఇప్పుడు నిర్వహించలేమని రక్షిణ శాఖ నిపుణుడు నితిన్‌ గోఖ్లే అన్నారు. విదేశీ పర్యటనల్లో తలమున్కలై అంతర్జాతీయ వ్యవహారాలకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ మల్దీవుల సంక్షోభంలో జోక్యం చేసుకుంటే ఇంటా బయట ఆయన ప్రతిష్ట పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి, ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement