ఆ ఆరోపణలు కేసు పెట్టదగినవే

FIR Against Rakesh Asthana Shows Cognisable Offences - Sakshi

అవినీతి వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన సీబీఐ

న్యూఢిల్లీ: అవినీతి కేసులో తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దుచేయాలన్న ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానా పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించింది. ఈ వ్యవహారంలో అస్థానాతో పాటు ఇతర అధికారులపై వచ్చిన ఆరోపణలు కేసు పెట్టదగినవేనని ఢిల్లీ కోర్టుకు తెలిపింది. అస్థానా పిటిషన్‌పై అభిప్రాయం తెలపాలని కోర్టు ఆదేశించగా సీబీఐ గురువారం ఈ మేరకు బదులిచ్చింది. ఇంకా చార్జిషీట్‌ దాఖలుచేయలేదని, విచారణ పూర్తయ్యే సరికి చాలా విషయాలు బయటికి వస్తాయని తెలిపింది. అస్థానా, సీబీఐ డీఎస్పీ దేవేంద్రకుమార్, మధ్యవర్తి మనోజ్‌ ప్రసాద్‌ల పిటిషన్లను జస్టిస్‌ నజ్మీ వాజిరి బెంచ్‌ విచారణకు చేపట్టింది.

ఈ దశలో అనవసర సందేహాలొద్దు..
‘అవినీతి సంబంధ కేసుల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రిట్‌ పిటిషన్‌ ద్వారా సవాలుచేసినప్పుడు,  ఆ ఎఫ్‌ఐఆర్‌లోని ఆరోపణల్లో కేసు పెట్టదగినవి ఉన్నాయా? లేవా? అన్న విషయాన్ని పరిశీలించాలి. ఈ దశలో కేసుతో సంబంధంలేని విషయాలు, సందేహాల్ని లేవనెత్తకూడదు. ఇక ప్రస్తుత కేసులో వచ్చిన ఆరోపణలు కేసుపెట్టదగినవే అని తేలడంతోనే ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి విచారణ ప్రారంభించాం. కొత్త బృందం దర్యాప్తును ప్రారంభించి, కీలక పత్రాలను పరిశీలిస్తోంది. తదుపరి దశలో సవివర అఫిడవిట్‌ దాఖలుచేస్తాం’ అని సీబీఐ పేర్కొంది. కాగా,  అస్థానాపై విచారణ చేపట్టకుండా యథాతథ స్థితిని కోర్టు నవంబర్‌ 14 వరకు పొడిగించింది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top