
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తుల తిరుగుబాటు నేపథ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) దీపక్ మిశ్రాను అభిశంసించే దిశగా సీపీఎం ప్రయత్నాలు ప్రారంభించింది. తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే పనిని సీపీఎం ప్రారంభించింది. అందులో భాగంగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మంగళవారం జేడీయూ తిరుగుబాటు నేత శరద్ యాదవ్‌ను, ఎన్సీపీ నేత తారీఖ్ అన్వర్‌ను కలసి చర్చించారు.
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు జనవరి 12న మీడియా ముందుకు వచ్చి సీజేఐపై తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. అభిశంసన తీర్మానంపై ప్రస్తుతం ఇతర ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరుపుతున్నామనీ, బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే జనవరి 29 నాటికి ఈ అంశంపై స్పష్టత వస్తుందని ఏచూరి చెప్పారు.