కర్ణాటక, కేరళ మధ్య ‘కరోనా చిచ్చు’

Corona Virus: Kerala, Karnataka Border Stalemate Not Resolved - Sakshi

సాక్షి, నూఢిల్లీ : భారత దేశ పౌరులు దేశవ్యాప్తంగా సంచరించే స్వేచ్ఛను దేశ రాజ్యాంగం కల్పించింది. అయితే మనదీ సమాఖ్య దేశం అవడం వల్ల రాష్ట్రాలకన్నా కేంద్రానికి ఎక్కువ హక్కులు ఉంటాయి. ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ దేశంలోకి కూడా వచ్చిందన్న వార్తలతో మొట్టమొదటగా స్పందించిన సిక్కిం రాష్ట్రం మార్చి 16వ తేదీన తన రాష్ట్ర సరిహద్దులను మూసివేసింది. మార్చి 20వ తేదీన తమిళనాడు మూసివేసింది. మార్చి 21న ప్రకటించిన కర్ఫ్యూను తెలంగాణ కొనసాగించి తన సరిహద్దులను మూసివేసింది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో మార్చి 24వ తేదీ నుంచి దేశంలోని రాష్ట్రాలన్నీ తమ సరిహద్దులను మూసివేశాయి. అంతర్జాతీయ సరిహద్దుల్లాగా దేశ అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేయడం స్వాతంత్య్ర భారత దేశంలో ఇదే తొలిసారి. (దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేత!)

సరిహద్దుల మూసివేత కారణంగా వాహనాలు నిలిచిపోవడంతో మానవుల అక్రమ రవాణా మొదలయింది. హర్యానా–ఉత్తరప్రదేశ్‌ సరిహద్దుల్లో వలస కార్మికులు యమునా నది దాటేందుకు ప్రమాదకరమైన రబ్బర్‌ ట్యూబ్‌లను వినియోగించారు. మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దుల్లో పెన్‌గంగను దాటేందుకు వలస కార్మికులు ఇలాంటి దుస్సాహసాలకే పాల్పడ్డారు. మహారాష్ట్ర–గుజరాత్‌ సరిహద్దుల్లో వలస కార్మికులు బారీ ఖాళీ పాల క్యాన్లలో దాక్కొని వెళుతూ పట్టుపడ్డారు. అంతర్రాష్ట్ర సరిహద్దులను ‘కానిఫ్లిక్ట్‌ జోన్స్‌’గా మీడియా అభివర్ణించడం కేరళ–కర్ణాటక సరిహద్దు విషయంలో నిజమైంది. కేరళలోని కాసర్‌గాడ్‌ జిల్లాను కర్ణాటకలోని మంగళూరుకు కలిపి జాతీయ రహదారిని కర్ణాటక మూసివేసింది. కాసర్‌గాడ్‌ ఉత్తర కేరళలోని కేవలం 13 లక్షల జనాభా కలిగిన చిన్న జిల్లా అయినప్పటికే అప్పటికే అక్కడ 20 కోవిడ్‌ కేసులు నమోదు కావడంతో కర్ణాటక అక్కడి నుంచి ఎవరిని అనుమతించకుండా ఈ చర్య తీసుకుంది. సార్వభౌమాధికార దేశాల్లోలాగా అంతర్రాష్ట్ర సరిహద్దులను మూయడం భారత్‌లో చెల్లదని, పైగా కేరళ, కర్ణాటక రాష్ట్రాలు భారత్, పాకిస్థాన్‌ దేశాల్లో విడి విడిగా లేవని కేరళ విమర్శించింది. రోడ్డుపై ఎర్రమట్టి కుప్పలను పోయడం తమ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు చేసిన ప్రయత్నంగా కూడా ఆరోపిస్తూ కేరళ హైకోర్టును ఆశ్రయించింది.

‘దేశ సార్వభౌమాధికారం లేదా సమగ్రత కోసం ప్రజల కదలికలపై ఆంక్షలు విధించవచ్చుగానీ ఈ రీతిగా బ్యారికేడ్లు పెట్టి ప్రజా కదలికలను నియంత్రించడానికి వీల్లేదు. భారత రాజ్యాంగంలోకి 19 (1)(డీ) సెక్షన్‌ ప్రకారం ప్రజలు దేశవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్లవచ్చు, తిరగవచ్చు. ఈ రాజ్యాంగ స్ఫూర్తిని కర్ణాటక ప్రభుత్వం గౌరవించాల్సిందే. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కర్ణాటక చేత సరిహద్దులు తెరిపించాలి’ అంటూ కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. సరిహద్దులను అలా మూసి ఉంచాల్సిందేనంటూ ఆ మరుసటి రోజు కర్ణాటక సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి సీటీ రవి వ్యాఖ్యానించగా సోషల్‌ మీడియాలో ఆయనకు తెగ మద్దతురావడం గమనార్హం. ఇలాంటి గొడవలు రాష్ట్రాల మధ్య కొత్త వివాదాలకు దారి తీసే ప్రమాదం ఉంది. (కరోనా: బయటికొస్తే బండి సీజే!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top