'మాల్యాకు కాంగ్రెస్ రూ.9000 కోట్ల సబ్సిడీ'
గోవాలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పోటీ చేస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
పణజి: గోవాలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పోటీ చేస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. పణజిలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 'సామాన్యుడిని తక్కువ అంచనా వేయొద్దు' అన్న ఒకేఒక్క ఎజెండాతో 2013 ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేశామని తెలిపారు.
దేశంలో అతితక్కువ విద్యుత్ చార్జీలు వసూలు చేస్తున్న రాష్ట్రాల్లో ఢిల్లీ రెండో స్థానంలో ఉందన్నారు. విద్యుత్ కోసం రూ. 1400 కోట్ల సబ్సిడీ ఇచ్చామని, దీంతో 36 లక్షల కుటుంబాలకు మేలు జరిగిందని తెలిపారు. విజయ్ మాల్యాకు కాంగ్రెస్ పార్టీ రూ.9000 కోట్లు సబ్సిడీగా ఇస్తే, దేశం నుంచి పారిపోవడానికి ఆయనకు బీజేపీ సహకరించిందని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.
లోక్ పాల్ బిల్లును తెచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీ ముందుకు రాలేదని గుర్తు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టడానికి ఈ రెండు పార్టీలే కారణమన్నారు. ఈ పార్టీలు తమను వెక్కిరించాయని, ఎగతాళి చేసిన పార్టీలు సింగిల్ సీటు కూడా దక్కించుకోలేకపోయాయని తెలిపారు.


