‘మెరుపు దాడులకు రాజకీయ మరక’

Congress Blasts Amit Shah Over Airstrikes - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌పై భారత వైమానిక దాడులను బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని మాజీ కేంద్ర మంత్రి మనీష్‌ తివారీ ఆరోపించారు. మెరుపు దాడుల్లో 250 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మన యుద్ధవిమానాలు నిర్ధేశిత లక్ష్యాలను ఛేదించాయని, అయితే ఎంతమంది దాడుల్లో మరణించారని ఇప్పుడే వెల్లడించడం తొందరపాటు అవుతుందని వాయుసేన పేర్కొంది.

వాయుసేన వివరణను ప్రస్తావిస్తూ అమిత్‌ షా ప్రకటనను మనీష్‌ తివారీ తప్పుపట్టారు. అమిత్‌ షా వ్యాఖ్యలు మెరుపుదాడులను రాజకీయం చేయడం కాదా అని ఆయన నిలదీశారు. వాయుసేన ప్రకటనకు భిన్నంగా 250 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని చెప్పడం రాజకీయ ప్రయోజనాలతో ముడిపెట్టడమేనని అన్నారు.

మరోవైపు బాలాకోట్‌లో ఉగ్రవాదుల మరణంపై ఎలాంటి ఆధారాలు లేవని విదేశీ మీడియా కథనాలు ప్రచురించిందని మరో కాంగ్రెస్‌​ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్‌ సిబల్‌ ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

కాగా పీఓకేలో భారత్‌ చేపట్టిన వైమానిక దాడుల్లో 300 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని పాలక బీజేపీ శ్రేణులే ప్రచారంలో పెట్టాయని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం వ్యాఖ్యానించారు. బాధ్యతకలిగిన పౌరుడిగా, ప్రభుత్వం వెల్లడించే సమాచారాన్ని తాను విశ్వసిస్తానని,అయితే ప్రపంచాన్ని మనం నమ్మించాలంటే విపక్షాలను నిందించడం మానేసి ఆ దిశగా చర్యలు చేపట్టాలని హితవు పలుకుతూ చిదంబరం ట్వీట్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top