కోట్ల ఆస్తి ఉన్నా..దిక్కులేని చావు! | Sakshi
Sakshi News home page

కోట్ల ఆస్తి ఉన్నా..దిక్కులేని చావు!

Published Tue, Jan 13 2015 12:22 PM

కోట్ల ఆస్తి ఉన్నా..దిక్కులేని చావు!

ముంబై: నగరంలో ఉంటున్న ఓ వృద్ధురాలికి కోట్లలో ఆస్తి ఉంది. అంత ఆస్తి ఉంటే ఎవరైనా దర్జాగానే జీవితాన్ని వెల్లదీస్తారని అనుకుంటాం. అయితే ఇక్కడ భిన్నంగా జరిగిన ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. జయశ్రీ ఘోల్ కర్(68) అనే వృద్దురాలికి వెర్సినోవాలోని యారీ రోడ్డులోరూ. 30 కోట్లకు పైగా ఆస్తి ఉంది. ఆ వృద్ధురాలు సోదరుల్లో ఒకరు స్థానికంగా ఒక బంగ్లాలో ఉండగా, మరో సోదరడు అమెరికా లో సెటిల్ అయ్యాడు. కాగా, ఆ వృద్ధురాలిని ఇంట్లో వాళ్లు బయటకు గెంటేశారు. దీంతో దయనీయ స్థితిలో జీవనాన్ని సాగించిన ఆ వృద్దురాలు జనవరి 9 వ తేదీన అసువులు బాసింది.

 

జనవరి ఏడో తేదీన బాంబే హైకోర్టు ఆదేశాలతో జేజే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో రెండు రోజుల అనంతరం అసువులు బాసింది. దీనిపై  హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు..  వృద్ధులకు తగిన సంక్షేమ పథకాలు కల్పించడంలో ప్రభుత్వం తగిన చొరవ చూపకపోవడాన్ని తప్పుబట్టింది. ఒకవేళ ఇంట్లో వాళ్లు వృద్దులను చూసినా.. చూడకపోయినా వారి బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని సూచించింది. వైద్య సదుపాయాలతో పాటు, ఓల్డేజ్ హోమ్ లను ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానికి లేదా?అని ప్రశ్నించింది.

Advertisement
Advertisement