ఎల్సీడీ టీవీ.. అటాచ్డ్‌ టాయిలెట్‌!

CBI Sends Jail Video to UK Court - Sakshi

మాల్యాను ఉంచబోయే జైలు గదిలో సకల సదుపాయాలు

లండన్‌ కోర్టుకు వీడియో పంపిన సీబీఐ

ముంబై: గోడకు 40 అంగుళాల ఎల్‌సీడీ టీవీ, వెస్ట్రన్‌ స్టైల్‌ టాయిలెట్, 6 ట్యూబ్‌లైట్లు, 3 ఫ్యాన్‌లు, బట్టలు ఉతుక్కోవడానికి ప్రత్యేక చోటు, గాలి వెలుతురు బాగా వచ్చేలా పెద్ద కిటికీలు, వాకింగ్‌ కోసం ఆవరణ, సెల్‌ నుంచి నేరుగా లైబ్రరీకి వెళ్లడానికి దారి. కింగ్‌ఫిషర్‌ అధినేత విజయ్‌మాల్యా కోసం మహారాష్ట్ర జైలు అధికారులు చేసిన ఏర్పాట్లు ఇవి. బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టి లండన్‌ పారిపోయిన మాల్యాను వెనక్కి రప్పించిన తరువాత ఆయన్ని ఉంచే జైలును సీబీఐ సిద్ధం చేసి, దాని వీడియోను బ్రిటన్‌ కోర్టుకు పంపింది.

భారత్‌లో జైళ్లు శుభ్రంగా ఉండవని, అందుకే తాను వెళ్లనంటూ మాల్యా ఆరోపించడం తెల్సిందే. దీంతో మాల్యాను ఉంచబోయే జైలు గదిని వీడియో తీసి పంపించాలంటూ లండన్‌ కోర్టు ఆదేశించింది. మహారాష్ట్ర అధికారులు ముంబై ఆర్థర్‌ రోడ్‌ జైలులోని 12వ నంబర్‌ బ్యారెక్‌ను  ముస్తాబు చేశారు. గదిలో ప్రతీది తెలిసేలా 8 నిమిషాల వీడియో తీసి లండన్‌ కోర్టుకు ఇచ్చారు. మంచంపై మెత్తటి పరుపు, శుభ్రంగా ఉతికిన దుప్పట్లు, దిండ్లు ఉంచారు. టీవీలో ఆంగ్ల, మరాఠీ చానెల్స్‌ వచ్చే ఏర్పాట్లు చేశారు.   మాల్యాను ఉంచబోయే బ్యారెక్‌ లోపల, బయట రేయింబవళ్లు గార్డులు కాపలా ఉంటారు. సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుంది. ఇక్కడ పేరు ప్రఖ్యాతులున్న ఖైదీలను, ప్రాణహానీ ఉన్న వారిని ఉంచుతారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top