‘లోక్‌సభ, 4 అసెంబ్లీలకు అయితే ఓకే’

Capable of holding Lok Sabha elections, 4 state assembly polls together in Dec - Sakshi

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించాల్సి వస్తే.. అందుకు సిద్ధంగానే ఉన్నామని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. డిసెంబర్‌లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సామర్థ్యం తమకుందని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ బుధవారం తెలిపారు. లోక్‌సభ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ఎన్నికలకు అవసరమైన అన్ని ఈవీఎంలు సెప్టెంబర్‌ చివరి నాటికి, వీవీప్యాట్‌లు నవంబర్‌ చివరి నాటికి సిద్ధంగా ఉంటాయని రావత్‌ తెలిపారు. మిజోరం అసెంబ్లీ ఈ డిసెంబర్‌ 15 నాటికి, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ అసెంబ్లీలు వరుసగా వచ్చే సంవత్సరం జనవరి 5, జనవరి 7, జనవరి 20 నాటికి ముగుస్తాయి.   

ఈ నెలలోనే జమిలిపై నివేదిక
లోకసభ, అన్ని అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన న్యాయ ప్రక్రియను లా కమిషన్‌ ఈ నెలలోనే కేంద్రానికి సిఫారసు చేయనుంది. కమిషన్‌లోని ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మేం ఏకకాల ఎన్నికలకు మద్దతు తెలుపుతామా లేదా అని మమ్మల్ని అడగలేదు. అందుకు సంబంధించిన మార్గా న్ని సూచించే పనిని మాత్రమే మాకు అప్పజెప్పారు’ అని ఆ అధికారి చెప్పారు. ఏకకాలం లో ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగానికి, ప్రజా ప్రతినిధుల చట్టానికి చేయాల్సిన సవరణలను కమిషన్‌ సిఫారసు చేయనుంది. ఆ సిఫారసులను కేంద్రం తప్పనిసరిగా పాటించకపోవచ్చనీ, అయితే రాజకీయ పార్టీ లు, భాగస్వామ్య పక్షాల మధ్య చర్చ జరుగుతుందని అధికారి అన్నారు. రాజ్యాంగానికి కనీసం రెండు సవరణలైనా చేసి, మెజారిటీ రాష్ట్రాలు కూడా సవరణలను ఆమోదిస్తేనే ఏకకాల ఎన్నికలను నిర్వహించడం సాధ్యమవుతుందని కమిషన్‌ ఇప్పటికే చెప్పింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top