
థానే(మహారాష్ట్ర) : దేశంలో ఎక్కడో చోట ప్రతిరోజు ఆడ పిల్లలపై వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఇంట, బయట వారికి రక్షణ కరువైంది. తన ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు బాలికలను వేధించాడు ఆ ఆటో డ్రైవర్. ఈ సంఘటన థానే జిల్లా కల్యాణ్‌లో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలివీ.. పట్టణానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెలు(16,13) గురువారం సాయంత్రం తమ తల్లి పనిచేసే హోటల్ వద్దకు వెళ్లారు.
తమ తల్లితో మాట్లాడిన అనంతరం వారు ఆటోలో ఉల్హాస్‌నగర్‌లోని ఇంటికి తిరిగి పయనమయ్యారు. అయితే, ఆ ఆటో డ్రైవర్ వారి మాటలు వింటూ తల్లి ఫోన్ ఇవ్వాలని అడిగాడు. వారు ఇవ్వటానికి నిరాకరించడంతో ఆటోను మరో దారికి మళ్లించాడు. అక్కడ వారిద్దరినీ పట్టుకుని వేధించాడు. నంబర్ ఇవ్వకుంటే చపేస్తానంటూ బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక(13) అక్కడి నుంచి తప్పించుకుంది.
అనంతరం ఆటో డ్రైవర్ మరో బాలికను పట్టుకుని సమీపంలోని పెట్రోల్ బంకు పక్కకు తీసుకెళ్లి వేధించాడు. అనంతరం ఆమె ఇంటివైపు ఆటోను మళ్లించగా ఆ బాలిక ఆటో నుంచి కిందికి దూకింది. బాలికలిద్దరూ కలిసి ఇంటికి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న తల్లి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.