‘ఎన్నికల వేళ ఆ అంశాలను తెరపైకి తెచ్చారు’

Amartya Sen Asks  Should Ram Mandir Or Sabarimala Be Central Issues   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల ఏడాది రామ మందిర నిర్మాణం, శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం వంటి అంశాలు కీలకంగా ముందుకొచ్చాయని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత అమర్త్య సేన్‌ నరేంద్ర మోదీ సర్కార్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పక్కదారిపట్టి ఇలాంటి అంశాలను తెరపైకి తెచ్చారని వ్యాఖ్యానించారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించకపోవడం, ప్రజలను వేధించడం ఆమోదయోగ్యం కాదని, దేశంలో ప్రస్తుత పరిస్థితిలో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు.

దేశంలో పలు విశ్వవిద్యాలయాలు వాటి స్వేచ్ఛను, స్వతంత్రతను కాపాడుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఇతర సంస్థల పరిస్థితీ అలాగే ఉందని, చివరికి పాత్రికేయులు సైతం తమ స్వేచ్ఛను కోల్పోవడం ఆమోదయోగ్యం కాదన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీయేతర లౌకిక పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన గతంలో పిలుపుఇచ్చిన సంగతి తెలిసిందే.

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన క్రమంలో బీజేపీయేతర పార్టీల కూటమిలో చేరేందుకు వామపక్షాలు వెనుకాడరాదని సూచించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 31 శాతం ఓట్లు పొందిన పార్టీ రాజకీయాల్లో పెడపోకడలను ప్రోత్సహిస్తోందని అమర్త్య సేన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని ప్రజలు కాపాడుకోవాలని పిలుపు ఇచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top