
గాయత్రి పరివార్ చీఫ్ ప్రణవ్ పాండ్యా
డెహ్రాడున్ : ధ్యాన సాధన ధార్మిక సంస్థ గాయత్రి పరివార్ చీఫ్ ప్రణవ్ పాండ్యా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ముఖం తనకు అస్సలు నచ్చదంటూ ఆయన వ్యాఖ్యానించారు. తమ సంస్థను రాహుల్ సందర్శించడానికి వస్తే సంతోషమే గానీ అమిత్ షా లాగా ఆయనకు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇవ్వలేమని ఆయన పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వివిధ సంస్థల మద్దతు కూడగట్టడంలో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆదివారం ప్రణవ్ పాండ్యా, స్వామి అద్వేశానంద్, స్వామి సత్యమిత్రానంద్ తదితరులతో సమావేశమయ్యారు.
కాగా ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది అనుచరులు కలిగి ఉన్నామని చెప్పుకునే గాయత్రి పరివార్ మద్దతు కోసం వివిధ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గాయత్రి పరివార్ ప్రణవ్ పాండ్యాతో బుధవారం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ సమావేశమైన అనంతరం.. తాము బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్లు ప్రణవ్ పాండ్యా ప్రకటించారు.