24 గంటల్లో 4,213 పాజిటివ్‌ కేసులు | 4,213 New Coronavirus Cases In 24 hours In India | Sakshi
Sakshi News home page

24 గంటల్లో 4,213 పాజిటివ్‌ కేసులు

May 11 2020 9:48 AM | Updated on May 11 2020 2:32 PM

4,213 New Coronavirus Cases In 24 hours In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల  సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. నియంత్రణ మాత్రం సాధ్యం కావడంలేదు. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 4,213 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 97 మంది మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య  67,152కి, మృతుల సంఖ్య  2206కి చేరింది. అలాగే ఇప్పటివరకు 20,917 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 44,029 యాక్టివ్ కేసులు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 

వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 22171కి చేరింది. వైరస్‌ కారణంగా 832 మంది మరణించారు. గుజరాత్‌లో మొత్తం 8194 కరోనా కేసులు నమోదవగా, 493 మంది మృతిచెందారు. తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 7200కు చెరింది.  ఇక దేశ రాజధాని ఢిల్లీలో 6923కు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 3614 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 214 మంది మృతిచెందారు. (కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న ప్రాంతాలివే)

ఈ నేపథ్యంలోనే సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్పరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారు. వైరస్‌ను కట్టడి చేయడం, లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు వంటి అంశాలపై మోదీ చర్చించనున్నారు. మరోవైపు కోవిడ్‌ కేసుల తీవ్రత దృష్ట్యా ప్రస్తుతం రెడ్‌ జోన్లుగా ఉన్న వాటిని ఆరెంజ్, గ్రీన్‌ జోన్లుగా మార్పుచెందేలా చూడటం, ఆర్థిక కార్యకలాపాలకు ఊతమివ్వడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. (లాక్‌డౌన్‌ ఇప్పట్లో ముగిసేలా లేదు!)

Advertisement
 
Advertisement
Advertisement