కలెక్షన్స్‌ పట్టించుకోకపోతే క్రైమ్‌

We have tried to do give a social awareness perspective with Bharat  - Sakshi

వీలైతే ప్రేమిద్దాం. పోయేదేముంది. తిరిగి ప్రేమిస్తారు. మనకు ఎంతో ఇచ్చిన ఊరికి తిరిగి ఇచ్చేయకపోతే లావయిపోతాం.మొక్కలతో పాటు మనుషులను కూడా కాపాడితే భూమి ఇంకా అందంగా ఉంటుంది.జస్ట్‌ ఒకే వాక్యం. కానీ అర్థం బోలెడు. ‘థాట్‌ ప్రొవోకింగ్‌’ వర్డ్స్‌. మనసుకి ఇట్టే పట్టేసేపదాలు. అందుకే మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్‌ ప్రేక్షకుల మనసుల్లోకి చొచ్చుకువెళ్లాయి. ఇప్పుడు కొరటాల శివ ఇంకో మాట చెప్పారు. ‘ప్రామిస్‌ నిలబెట్టుకోవాలని’. మహేశ్‌బాబు హీరోగా ఆయన తెరకెక్కించిన‘భరత్‌ అనే నేను’ లైన్‌ ఇదే. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా కొరటాల శివతో ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ.

► మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్‌.. హ్యాట్రిక్‌ హిట్స్‌ తర్వాత వస్తున్నారు. ప్రెషర్‌గా ఉందా?
కొరటాల శివ: ప్రతి సినిమా ఓ కొత్త పరిక్షే. అందుకే ప్రతి సినిమాని ఫస్ట్‌ సినిమా అనుకుని వర్క్‌ చేయడమే. ఇవాళ ఉన్న ఎక్స్‌పోజర్‌కు సినిమా హిట్‌ అయితే ఎంత అప్రిసియేషన్‌ వస్తుందో ఫ్లాప్‌ అయితే అదే రేంజ్‌లో క్రిటిసిజమ్‌ కూడా వస్తోంది. అందుకని భయం, ఒత్తిడి ఉంటాయి. అది సహజం. మళ్లీ ‘ది బెస్ట్‌’ ఇచ్చాననే అనుకుంటున్నాను. ప్రతి సినిమాలానే ‘భరత్‌ అనే నేను’ని ఈజీగా తీసుకోలేదు. టీమ్‌ వర్క్‌తో మంచి సినిమా అందించబోతున్నాం. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారోనని చిన్న భయం ఉంది. ఆ భయమే అందం. ఆ భయమే ముందుకు వెళ్లేలా చేస్తుంది.

► మీ సినిమాల్లో మెసేజ్‌ ఫస్ట్‌ సీట్‌ తీసుకుంటుంది. ఈ సినిమాలోనూ ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చా?
సినిమాలో నేనేం చెప్పాలనుకుంటానో అది ఫస్ట్‌ టీజర్‌లోనే చెప్పేస్తాను. మా సినిమా ఇలా ఉండబోతోంది అని. ‘ప్రామిస్‌ చేస్తే మాట తప్పొద్దు నువ్వు’ అని టీజర్‌లో చెప్పాను. అదే ఈ సినిమాలో ఉన్న మెసేజ్‌. మనం చిన్నప్పుడు నేర్చుకున్నవే మనసులో నాటుకుపోతాయి. అలా చిన్నప్పుడు తన మనసులో నాటుకుపోయిన ఓ విషయాన్ని భరత్‌ సీరియస్‌గా తీసుకుంటాడు. లైఫ్‌లో అతను ఓ బిగ్గెస్ట్‌ ప్రామిస్‌ చేయాల్సి వస్తుంది. సీయం అంటేనే ప్రమాణ స్వీకారంతో పదవిలో అడుగుపెడతాడు కదా. ఆ ప్రామిస్‌ నిలబెట్టుకోవటం అన్ని ఫీల్డ్స్‌లో ఉండాలి. పాలిటిక్స్‌లో అయితే ప్రామిస్‌ చేసేది ప్రజలకు కాబట్టి, దాన్ని నిలబెట్టుకోవాలి. ఆ విషయమే ఈ సినిమాలో చెప్పాం.

► కథను రాష్ట్రం విడిపోకముందు అన్నట్లు ఎందుకు ప్లాన్‌ చేశారు?
విడిపోయాక కథ అంటే.. కొన్ని లాజిక్స్‌ మిస్‌ అవుతున్నాయి. రెండూ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలే. కాంట్రవర్శీలు రావడం నాకు ఇష్టం లేదు. ఈ సినిమాలో సీయం పాత్ర ఎవర్నీ ఉద్దేశించకూడదని హోమ్‌వర్క్‌ చేసి రాసుకున్నాను. మొత్తం కల్పితం. కొన్నిసార్లు పొలిటీషియన్స్‌ పాత్రలు తీసుకొని సెటైర్‌ వేస్తుంటారు. అలా కూడా నేను చేయదలుచుకోలేదు. అందుకే రెండు రాష్ట్రాలు విడిపోకముందు జరిగే ఫిక్షనల్‌ స్టోరీగా రూపొందించాం.

► మీ సినిమాలో సామజిక స్పహ, బాధ్యత కనిపిస్తుంటాయి. ఈ సోషల్‌ రెస్పాన్సిబులిటీ అందరి దర్శకులకు ఉండాలనుకుంటారా?
అది పర్సనల్‌ చాయిస్‌. ఇది ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ. చాలా డబ్బు ఇన్వాల్వ్‌ అవుతుంది. అన్ని రకమైన సినిమాలు రావాలి. కె.విశ్వనాథ్‌గారు కళాత్మక సినిమాలు, జంధ్యాలగారు కామెడీ సినిమాలు, టి. కృష్ణగారు విప్లవ సినిమాలు తీశారు. అన్నీ ఎంజాయ్‌ చేశాం. ఆడియన్స్‌ ‘ఇలాంటి సినిమాలే చూస్తాం’ అని థియేటర్స్‌కు రారు. ‘నువ్వేం చూపిస్తున్నావో చెప్పు. చూస్తాం’ అన్నట్లు వస్తారు.  మనం ఎంచుకున్న  పాయింట్‌ను ఇంట్రెస్టింగ్‌గా చెప్పాలే తప్ప సందేశం ఇవ్వాలని పనిగట్టుకుని ట్రై  చేయను. అయితే ఒక మంచి విషయం చెబితే బాగుంటుందనుకుంటాను.

► మహేశ్‌గారికి ఈ సినిమాలో ఏ పాయింట్‌ ఎక్కువగా నచ్చింది?
పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ అనగానే ఆయన నవ్వేశారు. ఎంత గట్టిగా నవ్వారంటే ఈ సినిమా చేయనంటారేమో అనుకున్నా. నేనేంటి? సీయం ఏంటీ? అన్నారు. ఆయన రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి. పెద్దగా ఫాలో అవ్వరు కూడా. అయినా ఈ కథకు ఆయనే యాప్ట్‌ అనిపించింది. ‘మీకే యాప్ట్‌’ అన్నాను. ‘ఓకే’ అన్నారు. ఎందుకంటే యాక్టర్‌గా తనకు కొత్తగా ఉంటుందనుకున్నారు. ఇలాంటి చాలెంజ్‌లు మహేశ్‌గారికి ఇష్టం. కేక్‌వాక్‌లాగా ఉంటే ఆయనకు నచ్చదు.

► ఓత్‌ విన్నప్పుడు సేమ్‌ కృష్ణగారి వాయిస్‌లా అనిపించింది..
నేను డబ్బింగ్‌ చెప్పేటప్పుడే అన్నాను. మహేశ్‌గారు కొంచెం వాయిస్‌ పెంచితే కృష్ణగారి గొంతులా ఉందని. ‘ఏంటి సార్‌ కళ్లు మూసుకుంటే కృష్ణగారే కనిపిస్తున్నారు’ అంటే నవ్వారు. ఓత్‌ రిలీజ్‌ అయ్యాక చాలామంది ఫ్యాన్స్‌ ఫోన్‌ చేసి, సేమ్‌ కృష్ణగారి వాయిస్‌లానే ఉందన్నారు. నాకు అది నైస్‌ మూమెంట్‌. మహేశ్‌గారు కొన్ని కొన్ని రాజకీయ పదాలు ఎప్పుడూ అనలేదట. ‘ఓత్‌’ సీన్‌ డైలాగ్స్‌ చెప్పేటప్పుడు ఆయన ఆ విషయం చెప్పారు. ఆయనది ఎక్స్‌ట్రార్డినరీ మెమరీ. ఇట్టే పట్టేస్తారు.

► ‘భరత్‌ అనే నేను’ ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌కి ఎన్టీఆర్‌గారిని ఆహ్వానించడం ఓ హైలైట్‌. ఇద్దరు స్టార్స్‌ (మహేశ్‌–ఎన్టీఆర్‌) ఒకే వేదిక మీద కనిపించేలా చేయాలన్నది మీ ప్రయత్నమే అనుకోవచ్చా?
అస్సలు కాదు. ఇంకో వారంలో ఆడియో రిలీజ్‌ చేద్దాం, ఎక్కడ చేయాలి.. హైదరాబాద్‌ కాకుండా వేరే ఎక్కడైనా చేద్దామా అనుకుంటున్నప్పుడు షూటింగ్‌ కొంచెం లేట్‌ అయింది. దాంతో  హైదరాబాద్‌ బెస్ట్‌ అనుకున్నాం. మాటల సందర్భంలో ‘ఫంక్షన్‌ అంటే బోర్‌ కొడుతుంది. సంవత్సరం అంతా మన ఫేస్‌లే చూసుకొని ఫంక్షన్‌లోనూ మనమేనా? ఎవరైనా గెస్ట్‌ వస్తే బావుంటుంది కదా’ అని మహేశ్‌గారు అన్నారు. ఆయన అన్నట్లు నాక్కూడా ఎవరినైనా పిలిస్తే బాగుంటుందనిపించింది. ఆ ఆలోచనలో ఉండగానే ‘తారక్‌ (ఎన్టీఆర్‌)ని పిలుద్దామా’ అని మహేశ్‌గారే అన్నారు. వెంటనే నేను తారక్‌కి ఫోన్‌ చేసి, ‘ఫంక్షన్‌కి రావాలి’ అంటే ‘ఊరుకోండి.. జోక్‌ చేస్తున్నారా’ అన్నారు. ‘లేదు.. నిజంగా రావాలి’ అని విషయం చెబితే, ‘వస్తాను. రెండు గంటలసేపు నేనూ ఎంజాయ్‌ చేస్తా’ అన్నారు. అలా ఆ  ఫంక్షన్‌ మాకు స్పెషల్‌ అయింది.
   
► ఇప్పుడు చాలామందిలా 100, 150 కోట్ల క్లబ్‌ మీద మీరూ దృష్టి పెడతారా? కలెక్షన్స్‌ గురించి దర్శకుడు పట్టించుకోవాలా?

అదంతా ఫ్యాన్స్‌ థింగ్‌. మనం దేన్నీ ఆపలేం. మా సినిమాను ఇంకొకరు దాటితే మాకు హ్యాపీ. మా బడ్జెట్స్‌ పెరుగుతాయి. ఇంకా గ్రాండ్‌ కాన్‌వాస్‌ మీద కథ చెప్పొచ్చు. కలెక్షన్‌ అనేది సినిమాలో భాగం. ఎంత పెట్టాం. ఎంత తిరిగొస్తోంది అని తెలియాలి. ప్రొడ్యూసర్‌ 50 కోట్లు పెట్టి తీసిన సినిమా 60 కోట్లకు అమ్ముడైతే ఆయన సేఫ్‌. తర్వాత కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్‌కి మిగిలిందా? లేదా అనే టెన్షన్‌. వాళ్లు కూడా సేఫ్‌ అంటే ఫుల్‌ హ్యాపీ. డైరెక్టర్‌గా ఈ కలెక్షన్స్‌ని ఫాలో అవ్వడం నా బాధ్యత. పెట్టినదానికి లాభం వచ్చిందా? లేదా? అని తెలుసుకోకపోవడం నా దృష్టిలో క్రైమ్‌. మన ఇంట్లో అన్నింటికీ లెక్కలు వేసుకుంటాం. సినిమా కూడా అంతే. నా పారితోషికం నాకు వచ్చేస్తుంది కాబట్టి, మిగతావాళ్లకు వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? అన్నట్లు ఉండటం సరికాదు. అందుకే  సినిమా లాస్ట్‌ ఎవరి దగ్గరకు చేరుతుందో వాళ్లు సేఫ్‌ అయితే అప్పుడు హాలిడే మూడ్‌లోకి వెళతాను.
 
  ► సినిమాలో మూడు గంటల్లో హీరో పాలిటిక్స్‌లో పెను మార్పు తెస్తాడు. బయట అలా కాదు. రాజకీయాల పై మీ అభిప్రాయం?

పొలిటికల్‌ పవర్‌ అంటే ఆషామాషీ పవర్‌ కాదు. రాజులు కూడా తాము అనుకున్నది చేయలేరు. ఎందుకంటే అది అధికారం కాదు. రాజు తర్వాత వాళ్ల అబ్బాయి.. ఆ తర్వాత వాళ్ల అబ్బాయి. కానీ ఇక్కడ డెమోక్రసీలో జనమే అధికారం ఇస్తున్నారు. ‘మమల్ని నువ్వు పరిపాలించు’ అని. దీనికి మించిన సుప్రీమ్‌ పవర్‌ ఏదీ లేదు. అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు చేయలేనిది ఏదీ ఉండదు. కానీ చేయాలని వాళ్లు అనుకోవాలంతే. వాళ్లకు ఎదురు చెప్పేవాళ్లు లేరు. వాళ్లు చేయలేంది ఏదీ లేదు. చేతిలో పవర్‌ ఉంటే అలా చేసేయొచ్చు పనులు. ఆ పని అవ్వడం లేదంటే చేయాలనే ఉద్దేశం లేదని అర్థం. పవర్‌ అంటే జస్ట్‌ వన్‌ వర్డ్‌ కాదు. పవర్‌ టు సర్వ్, పవర్‌ టు రూల్‌. పవర్‌ టు డూ అని అర్థం. చేతిలో అధికారం ఉంటే మిరాకిల్స్‌ చేయొచ్చు. అది అవ్వదంటారు. ఎందుకు అవ్వదు? నీకు చేయాలని లేదు.
 
► నెక్స్‌›్ట ప్రాజెక్ట్‌ ?

ఈసారి బాగా అలసిపోయాను. ఏమీ ఆలోచించకుండా... సినిమా అనే ఆలోచనే లేకుండా 2 నెలలు బ్రేక్‌ తీసుకుంటా.

► ఎవరైనా హీరో నుంచి కాల్‌ వస్తే?
ఆ హీరో ఇంటికి వెళ్లి భోజనం చేస్తా (నవ్వుతూ). ఈ రెండు నెలలు తర్వాత పుస్తకాలు చదువుతా. బుక్స్‌ చదివి చాలా రోజులైంది. రీచార్జ్‌ అయి మళ్లీ తిరిగొస్తాను.
 

►  మిమ్మల్ని మోటివేట్‌ చేసిన బుక్, రైటర్‌?
ఒక్క పుస్తకం అని కాదు. శ్రీశ్రీగారి ఎక్స్‌ప్రెషన్‌ ఇష్టం. ఎన్నిసార్లు చదివినా అదే హై వస్తుంది. అందరికీ ఉండే ఎక్స్‌ప్రెషనే కానీ అయన డెలివర్‌ చేసే విధానం చాలా బావుంటుంది. ఎంత పెద్ద మాటని అయినా షార్ప్‌గా, షార్ట్‌గా చెప్పటం ఆయన ప్రత్యేకత. ఆయన్నుంచి ఇన్‌ఫ్లుయన్స్‌ అయ్యాను. అందుకే నా సినిమా స్టోరీ లైన్‌ని ఒక్క లైన్‌లో అర్థం అయ్యేట్లు చెప్పేస్తాను. ‘మిర్చి’లో ‘వీలైతే ప్రేమిద్దాం..’, ‘శ్రీమంతుడు’లో ‘తిరిగి ఇచ్చేయాలి’, ఇప్పుడు ‘భరత్‌ అనే నేను’లో ‘ప్రామిస్‌’ అయినా.. ఏదైనా.

    ►  మహేశ్‌గారు ఆడియోలో ‘మేం మేం బావున్నాం, ఫ్యాన్స్‌ ఇంకా బావుండాలి’ అన్నారు. మహేశ్, ఎన్టీఆర్, ప్రభాస్‌.. వంటి స్టార్స్‌తో సినిమాలు చేస్తున్న మీరు ఫ్యాన్స్‌కి ఏం చెబుతారు?
జనరల్లీ అందరి ఫ్యాన్స్‌ మూవీ లవర్స్‌. మహేశ్, ఎన్టీఆర్, చరణ్‌ సినిమాలను ఏ ఫ్యాన్స్‌ అయినా ఫస్ట్‌ డే మార్నింగ్‌ షోనే చూస్తారు. ఒక 5 శాతం మంది హార్డ్‌కోర్‌ ఫ్యాన్స్‌ ఉంటారు. వాళ్లకు స్పెషల్‌ అభిమానం ఉంటుంది. ఒక్కోసారి ఉద్రేకం పెరుగుతుంది. వాటిలో నుంచి చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. ఇది తరతరాలుగా వస్తోంది. దాన్ని కంట్రోల్‌ చేయాలి. హీరోలంతా బాగున్నప్పుడు ఫ్యాన్స్‌ కూడా బాగుంటే బాగుంటుంది.
  
  ►  ‘భరత్‌’ మాటిస్తే మాట తప్పడు. ‘కొరటాల శివ’ మాటిస్తే ?

అంత పెద్ద మాటలేమీ ఇవ్వలేదు. నా పరిధిలో నిలబడగలిగేవి మాత్రమే ఇచ్చాను. వాటిని నిలబెట్టుకుంటాను. ఎందుకంటే మాట మీద నిలబడటం గొప్ప విషయం.
   
►  మాట మీద నిలబడటం గొప్ప విషయం అన్నారు. ఇండస్ట్రీ బిగినింగ్‌ డేస్‌లో మీకు ప్రామిస్‌ చేసి మాట తప్పినవాళ్లు ఎవరైనా ఉన్నారా?

ఇది మోస్ట్‌ గ్లామరస్‌ ఫీల్డ్‌. అందుకే ఇక్కడ ప్రామిస్‌ చేసినవాళ్ల గురించి, అది నిలబెట్టుకోని వాళ్ల గురించి తెలుసుకోవాలనుకుంటారు. ప్రామిస్‌ బ్రేక్‌ చేయడం అనేది వేరే రంగాల్లోనూ ఉంటుంది. బిజినెస్‌లో చూడండి. నీకు ఆ స్థలం అమ్ముతాం అంటారు. ఆ తర్వాత లేదంటారు. అన్నింట్లో ప్రామిస్‌ బ్రేక్‌ చేయడం ఉంది. హాస్పిటల్, రాజకీయాల్లోనూ ఉన్నాయి. మా సినిమా ఇండస్ట్రీ ఎంత?  గట్టిగా మాట్లాడితే రెండు కిలోమీటర్ల రేడియస్‌లో ఉంది ఈ ఇండస్ట్రీ. 500–1000 కోట్ల ఇండస్ట్రీ. మీకు ప్రామిస్‌ వేసి చెబుతున్నా.. మిగతా ఇండస్ట్రీల్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి.
   
►  ‘శ్రీమంతుడు’ తర్వాత తక్కువ సమయంలోనే మహేశ్‌గారు మీతో మళ్లీ సినిమా చేశారు. మీ ఇద్దరి మధ్య వేవ్‌లెంగ్త్‌ కేవలం ఓ హిట్‌ వల్లే కుదిరిందా?

మహేశ్‌గారికి ఓ వ్యక్తి మీద నమ్మకం కుదరాలి. కుదిరితే కనెక్ట్‌ అవుతారు. ఆయన డైరెక్టర్స్‌ యాక్టర్‌. షూటింగ్‌కి వచ్చే ముందు తన బ్రెయిన్‌ స్విచాఫ్‌ చేసేస్తారు. డైరెక్టర్‌ ఎలా చెబితే అలా చేస్తారు. డైరెక్టర్‌ మీద ఆయనకు నమ్మకం కుదరాలి. కుదిరితే సినిమా చేసేస్తారు. ‘నేను డైరెక్టర్స్‌ని నమ్మే సక్సీడ్‌ అయ్యాను. ఇదే ఫిలాసఫీ ఫాలో అవుతా’ అంటుంటారు. నమ్మిన డైరెక్టర్‌తో ఫ్లాప్‌ వచ్చినా ఆయన షేక్‌ అవ్వరు

– గౌతమ్‌ మల్లాది

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top