ఇక నిరవధిక సమ్మె : హీరో విశాల్‌ | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 30 2018 7:47 PM

Vishal Confirms Indefinitely Strike of TFF - Sakshi

సాక్షి, చెన్నై: క్యూబ్, వీపీఎఫ్‌ చార్జీలు చెల్లింపు విషయంలో సమ్మె చేపట్టిన తమిళ చలన చిత్ర నిర్మాత మండలి.. శుక్రవారం సాయంత్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సమ్మెను నిరవధికంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు హీరో-నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ వెల్లడించారు.

‘ఇది డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల డిమాండ్లకు సంబంధించిన అంశం కాదు. థియేటర్లకు వెళ్లి సినిమా చూసే ప్రేక్షకులపై అదనపు భారం పడకూడదనే మా ప్రయత్నం. టికెట్‌ ఛార్జీల మొదలు ఆన్‌లైన్‌ బుకింగ్‌, పార్కింగ్‌ ఛార్జీలు ఇలా ఏది కూడా ప్రేక్షకుడిపై మోపకుండా ఈ సమస్యను పరిష్కరించేందుకు మార్గాలున్నాయి. నిర్మాతల మండలి డిమాండ్లకు ప్రొవైడర్లు తలొగ్గేదాకా ఈ సమ్మె కొనసాగుతుంది. అందుకోసం ఎన్నాళ్లైనా మా పోరాటం ఆగదు’ అని విశాల్‌ మీడియా సమావేశంలో తెలిపారు. 

ఈ సమావేశంలో నిర్మాత మండలి తరపున విశాల్‌, నడిగర్‌ సంఘం తరపున హీరో కార్తీ, డైరెక్టర్‌ యూనియన్స్‌ తరపున విక్రమన్‌, సినిమాటోగ్రఫర్‌ అసోషియేషన్‌ తరపున పీసీ శ్రీరాం, ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి పాల్గొన్నారు. కాగా, ఏప్రిల్‌ 4న ముఖ్యమంత్రి పళని స్వామి, మంత్రి కాదంబూర్‌ రాజుతో కోలీవుడ్‌ ప్రతినిధులు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పెద్ద చిన్నా అన్న తేడా లేకుండా అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి.

Advertisement
 
Advertisement