ఎక్కడ గుర్తింపు వస్తే అక్కడే! | Varsha Bollamma Interview At Choosi Chudagane Movie | Sakshi
Sakshi News home page

ఎక్కడ గుర్తింపు వస్తే అక్కడే!

Jan 31 2020 4:20 AM | Updated on Jan 31 2020 4:20 AM

Varsha Bollamma Interview At Choosi Chudagane Movie - Sakshi

వర్ష బొల్లమ్మ

‘‘హీరోయిన్‌గా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేసినప్పుడే నటిగా ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండగలమని నా అభిప్రాయం. యాక్టింగ్‌కు మంచి స్కోప్‌ ఉంటే డీ–గ్లామరస్‌ రోల్‌ చేస్తాను. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్‌లను బ్యాలెన్స్‌ చేస్తూ సినిమాలు చేస్తున్నా. నటిగా నాకు ఎక్కడ గుర్తింపు వస్తే అక్కడ ఎక్కువ సినిమాలు చేస్తాను’’ అన్నారు వర్ష బొల్లమ్మ. శేష సింధు దర్శకత్వంలో శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ అతని తండ్రి రాజ్‌ కందుకూరి నిర్మించిన చిత్రం ‘చూసీ చూడంగానే’. ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వర్ష చెప్పిన విశేషాలు.

► మైక్రోబయాలజీ చదివాను. నాకు చిన్నప్పట్నుంచే నటన అంటే చాలా ఇష్టం. కాలేజీలో స్టేజ్‌పై యాక్టర్‌గా చేయాలనుకున్నాను. కానీ మా కాలేజీ డ్రామా అసోసియేషన్‌వారు నన్ను సెలక్ట్‌ చేయలేదు. తొలిసారి తమిళంలో ‘వెట్రివేలన్‌’ అనే సినిమా చేశాను. ఆ తర్వాత తమిళ హిట్‌ ‘96’లో నటించాను. మలయాళంలో కూడా సినిమాలు చేశాను. ‘96’లో నా నటనను చూసి శేష సింధు, రాజ్‌ కందుకూరి నాకు ‘చూసీ చూడంగానే’ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు.

► ఈ చిత్రంలో డ్రమ్మర్‌ అండ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ పాత్రలో నటించాను. కథ విన్నప్పుడు నా పాత్ర డ్రమ్మర్‌ అని చెప్పగానే నేను చేయగలనా? అని కొంచెం భయపడ్డాను. డ్రమ్మింగ్‌ గురించి అసలు ఏం తెలియకుండా చేయడం చాలా కష్టం. ఓ డ్రమ్‌ బ్యాండ్‌ నుంచి డ్రమ్మర్‌కి కావాల్సిన బేసిక్స్‌ నేర్చుకున్నాను.

► మహిళా దర్శకులు ఉన్న సినిమాల్లో హీరోయిన్‌గా చేయడం కొంతవరకు ప్లస్‌ కావొచ్చు. కానీ శేష సెట్‌లో టామ్‌బాయ్‌లా ఉండేవారు. ఇది ముక్కోణపు ప్రేమకథే. కానీ కాస్త విభిన్నంగా ఉంటుంది. మా చిత్రంలో ఉన్న కొత్తదనం ఏంటో వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

► కథలో నా పాత్ర బాగుంటే పెద్ద హీరోల సినిమాల్లో క్యారెక్టర్‌ రోల్స్‌ చేస్తాను. విజయ్‌ ‘బిగిల్‌’ సినిమాలో గాయత్రి పాత్ర చేసినప్పుడు చాలామంది మెచ్చుకున్నారు. ‘96’ చేసిన తర్వాత ‘జాను’ (తమిళ చిత్రం ‘96’ తెలుగు రీమేక్‌) లో నటించే అవకాశం వచ్చింది. ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో గుంటూరు జిల్లాకు చెందిన అమ్మాయిగా నటిస్తున్నాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement