సినిమాలోకం చాలా విచిత్రమైంది | Sakshi
Sakshi News home page

ఇక లాభం లేదు!

Published Tue, May 15 2018 8:44 AM

Sri Divya Ready for glamour roles  - Sakshi

తమిళసినిమా: సినిమాలోకం చాలా విత్రమైంది. ఎవరిని ఎప్పుడు అందలం ఎక్కిస్తుందో..? ఎవరిని ఎలా ఢమాల్‌ అని కిందకు పడేస్తుందో ఊహించడం కష్టం. ఇంతకు ముందు వరుస విజయాలతో దూచుకుపోయిన వారు తరువాత అనూహ్యంగా వెనుకపడిపోతున్నారు. అలాంటి వారిలో నటి శ్రీదివ్య ఒకరని చెప్పాలి. ‘వరుత్తపడాద వాలిభన్‌’చిత్రంలో శివకార్తికేయన్‌తో రొమాన్స్‌ చేసి హిట్‌ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిన తెలుగమ్మాయి శ్రీదివ్య. తరువాత జీవా, కాక్కీసట్టై, ఈటీ, సంగిలి బుంగిలి వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మపై పక్కింటి అమ్మాయి అనే మంచి ఇమేజ్‌ పడింది. అలాంటిది ఇటీవల ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి. అంతే కాదు ఇళయదళపతితో ‘మెర్శల్‌’చిత్రంలో నటించే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయింది ఈ బ్యూటీ.

కాల్‌షీట్స్‌ సమస్యతో శ్రీదివ్య వదులుకున్న ఆ అవకాశం నటి నిత్యామీనన్‌ను వరించిందట. మెర్శల్‌ చిత్రంలో సమంత, కాజల్‌ అగర్వాల్‌ ఉన్నా, ఎక్కువ క్రెడిట్‌ నటి నిత్యామీనన్‌కే దక్కిందన్నది గమనార్హం. కారణాలేమైనా ప్రస్తుతం కోలీవుడ్‌లో అధర్వకు జంటగా నటిస్తున్న ‘ఒల్తైకు ఒల్తై’ చిత్రం ఒక్కటే చేతిలో ఉంది. దీంతో అంతకు ముందు మాతృభాషలో నటించిన శ్రీదివ్య ఇప్పుడు మళ్లీ అక్కడ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ కారణంగానే అవకాశాలు దగ్గరకు రావడం లేదన్న అభిప్రాయానికి వచ్చింది శ్రీదివ్య. తను ఇక లాభం లేదు ఆ ఇమేజ్‌ను బ్రేక్‌చేసి అందాలారబోతలో విజృంభించాల్సిందేనని నిర్ణయించుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. మొత్తం మీద ఇకపై గ్లామర్‌నే నమ్ముకోవడానికి సిద్ధం అవుతున్నారన్నమాట. మరి ఈ కొత్త రూటు శ్రీదివ్యను మళ్లీ బిజీ చేస్తుందేమో చూడాలి.

 
Advertisement
 
Advertisement