డీడీ షోలో తల్లీకూతుళ్లు

డీడీ షోలో తల్లీకూతుళ్లు - Sakshi

 మహిళలపై నేరాలను నిరోధించే ప్రయత్నంలో భాగంగా దూరదర్శన్  తాజాగా ‘మై కుచ్ భీ కర్ సక్తీ హూ’ అనే షో రూపొందిస్తోంది. దీనికి సహకరించడానికి అలనాటి అందాలతార షర్మిళా ఠాగూర్, ఆమె ముద్దుల కూతురు సోహా అలీఖాన్ సిద్ధమవుతున్నారు. బాల్యవివాహాలు, లేత వయసు గర్భాలు, లింగ నిర్ధారణ వంటి దురాచారాలను ఎండగడుతుంది కాబట్టే ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నామని తల్లీకూతుళ్లు చెబుతున్నారు. ‘మనదేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఈ షోకు సహకరించడం మన బాధ్యత. ఇందులో పాల్గొనాలని నా కొడుకు-కోడలు సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్‌ను కూడా అడుగుతాను’ అని షర్మిళ అన్నారు. మై కుచ్ భీ కర్ సక్తీ హూను ఫిరోజ్ అబ్బాస్‌ఖాన్ నిర్మించి దర్శకత్వం వహిస్తున్నారు. మహిళలపై నేరాల నిరోధానికి డాక్టర్ స్నేహ చేసిన కృషిని గురించి ఈ కార్యక్రమం వివరిస్తుంది. సోహా మాట్లాడుతూ ‘మేం సంపన్న కుటుంబంలో పుట్టాం. 

 

 ఎటువంటి ఇబ్బందులూ లేకున్నా నేను సినిమాల్లోకి వస్తానంటే మాత్రం ఒప్పుకోలేదు. నేను పట్టువీడకపోవడంతో చివరికి సరే అన్నారు. అందుకు నా కుటుంబానికి కృతజ్ఞురాలిని. అయితే ఇలాంటి ఉన్నతస్థాయి జీవితమంటే ఏంటో చాలా మంది మహిళలకు తెలియదు. కాబట్టే ఇలాంటి మంచి కార్యక్రమానికి సహకరిస్తున్నాను’ అని వివరించింది. సినిమా తారల వంటి ప్రముఖులు ఇలాంటి సామాజిక సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటే వీక్షకుల సంఖ్య బాగా పెరుగుతుందని తెలిపింది. మై కుచ్ భీ కర్ సక్తీ హూ షో ప్రపంచ మహిళల దినోత్సమైన మార్చి 8 నుంచి ప్రసారమవుతుంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్ సైతం సత్యమేవ జయతే పేరుతో సామాజిక అంశాలపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం తెలిసిందే. 

 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top