ట్రైలర్‌ చూశాక ఇంకా ఆసక్తి పెరిగింది

Nani Speech at Evaru Trailer Launch - Sakshi

– నాని

‘‘గూఢచారి’ చిత్రం ట్రైలర్‌ను ఇదే అన్నపూర్ణ స్టూడియోలో విడుదల చేశాం.. ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో మనకు తెలుసు. ‘ఎవరు’ సినిమా కూడా పెద్ద హిట్‌ అయిపోతే శేష్‌ ప్రతి సినిమా ట్రైలర్‌ని నేనే విడుదల చేయాల్సి వస్తుందనే ప్రమాదం ఉన్నప్పటికీ, మనస్ఫూర్తిగా ఈ సినిమా హిట్‌ కావాలని కోరుకుంటున్నా’’ అని హీరో నాని అన్నారు. అడివి శేష్, రెజీనా జంటగా, నవీన్‌ చంద్ర కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఎవరు’. వెంకట్‌ రామ్‌జీని దర్శకుడిగా పరిచయం చేస్తూ పీవీపీ సినిమా బ్యానర్‌పై పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కెవిన్‌ అన్నె నిర్మించిన ఈ సినిమాని ఈ నెల 15న విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసిన అనంతరం నాని మాట్లాడుతూ– ‘‘శేష్, రెజీనా, పీవీపీగారు సహా అందరూ నా కుటుంబ సభ్యులతో సమానం. ట్రైలర్‌ నేరుగా మనల్ని కథలోకి తీసుకెళ్లిపోయింది. అసలు తెలుగు సినిమానా? ఇంగ్లీష్‌ సినిమానా? అనిపిస్తోంది.. సినిమాను అంత బాగా చేశారు. టీజర్‌ చూసినప్పుడే సినిమాపై ఇంట్రెస్ట్‌ కలిగింది. ఇప్పుడు ట్రైలర్‌ చూసిన తర్వాత ఇంకా సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అనే ఆసక్తి పెరిగిపోయింది’’ అన్నారు. ‘‘మా సినిమా గురించి ఇప్పుడే మాట్లాడాలనుకోవడం లేదు. ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ రోజున మాట్లాడతాను’’ అన్నారు వెంకట్‌ రామ్‌జీ.

‘‘సినిమాలంటే ప్యాషన్‌ ఉన్న టీమ్‌ ఇది. రెండేళ్ల ముందు అనుకున్న ఆలోచనతో చేశాం. మంచి సినిమా అని గర్వంగా ఫీల్‌ అవుతున్నాం. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అని నిర్మాత పీవీపీ అన్నారు. ‘‘ఎవరు’ సినిమాలో పనిచేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు నవీన్‌ చంద్ర. ‘‘నేను నమ్మిన సినిమా.. నాకు నచ్చిన సినిమా ‘ఎవరు’. ఈ సినిమాలో అందరూ రెండు ముఖాలను కలిగి ఉంటారు. ఈ మనిషి ఇలా ఉంటారని ప్రేక్షకుడు అనుకున్న పది నిమిషాలకు ఆ మనిషి మారిపోతుంటాడు. ఇలాంటి కథతో సినిమా చేయబోతున్నానని రామ్‌జీ చెప్పగానే ట్విస్ట్‌ను బ్రేక్‌ చేయలేకపోయాను. నన్ను హీరోగా ఏ ప్రొడ్యూసర్‌ నమ్మని టైమ్‌లో పీవీపీగారు నమ్మారు. అందుకే ఆయనతో ‘క్షణం’ తర్వాత ‘ఎవరు’ చేశా’’ అని అడివి శేష్‌ చెప్పారు. రచయిత అబ్బూరి రవి పాల్గొన్నారు.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top