వాళ్లకు కుటుంబం ఉండదా..?

Nandita Swetha Fired on Instagram Followers - Sakshi

సినిమా: నిన్నటి వరకు మీటూ వేధింపులంటూ నార్త్, సౌత్‌ అని తేడా లేకుండా చిత్ర పరిశ్రమలో వాతావరణం వేడెక్కింది. అది కాస్త చల్లారిందనుకుంటున్న సమయంలో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో నటీమణులకు వేధింపుల  బెడద తలెత్తుతోంది. నిజానికి ఈ తరహా వేధింపులు చాలా కాలం నుంచే తలెత్తుతున్నాయి. అయితే కోలీవుడ్‌లో ప్రముఖ కథానాయికలకు ఇలాంటివి అరుదే. తాజాగా  నటి నందిత శ్వేత అసభ్య ఎస్‌ఎంఎస్‌ బెడదను ఎదుర్కొంంటోంది. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. తమిళంలో అట్టకత్తి చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయిన నందితాశ్వేత ఇక్కడ ఇదర్కు దానే, ఆశైపడ్డాయ్‌ బాలకుమారా తదితర చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది. అంతే కాదు తెలుగు, కన్నడం భాషల్లోనూ నటిస్తూ దక్షిణాది హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

కాగా  ఈ చిన్నది చాలా మంది హీరోయిన్ల మాదిరిగానే ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో తన చిత్రాల వివరాలను, విశేషాలను పంచుకుంటుంది. అలా నందితాశ్వేతను ఇన్‌స్ట్రాగామ్‌లో చాలా మంది అభిమానులు ఫాలో అవుతున్నారు. అలా ఫాలో అయిన వారిలో వాంజి సెలియన్‌ అనే యువకుడు అసభ్య ఎస్‌ఎంఎస్‌లతో  వేధింపులకు గురి చేస్తున్నాడట. దీని గురించి నందితాశ్వేత స్పందిస్తూ.. ఆ వ్యక్తి  అసభ్య ఎస్‌ఎంఎస్‌లతో తనను వేధింపులకు గురి చేస్తున్నాడని సామాజిక మాధ్యమం ద్వారా  పేర్కొంది. ఇలాంటి వారికి కుటుంబం అంటూ ఉండదా? ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి అని వాపోయింది. అయితే ఈ వ్యవహారంలో పోలీస్‌లకు ఫిర్యాదు చేసే ఆలోచన తనకు లేదని చెప్పికొచ్చింది. ఈ వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసి మరింత రచ్చ చేయడం నందితాశ్వేతకు ఇష్టం లేనట్టుంది. సామాజక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న ఈ వ్యవహారం ఇంతటితో సద్దుమణిగితే ఫర్వాలేదు. లేకుంటే పోలీసుల వరకూ వెళ్లే అవకాశం ఉంటుంది. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో తానా చిత్రంలోనూ.. తెలుగులో అక్షర, ఐపీసీ 376 చిత్రాల్లోనూ నటిస్తోంది. వీటితో పాటు కన్నడంలో మైనేమ్‌ ఈజ్‌ కిరాతక అనే చిత్రంలోనూ నటిస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top