స్త్రీల పట్ల ద్వేషం మానుకో: మహీర ఖాన్‌

Mahira Khan Responds To The Senior Actor & Without Mentioning His Name Writes An Open Letter - Sakshi

‘మహీర ఖాన్‌ వయసైపోయింది, హీరోయిన్‌గా పనికి రాదు’ అంటూ పాకిస్తాన్‌ ప్రముఖ నటుడు ఫిర్దోస్ జమాల్ ఓ టెలివిజన్‌ షోలో చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. జమాల్‌ వ్యాఖ్యలకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ లేఖ ద్వారా సమాధానమిచ్చారు. స్త్రీల పట్ల ద్వేషం మానుకోవాలని ఫిర్దోస్‌కు హితవు పలికారు. మహీర రాసిన ఈ లేఖకు అభిమానుల నుంచి భారీ స్పందన వస్తుంది. 

వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్ ప్రముఖ నటుడు ఫిర్దోస్ జమాల్, రయూస్‌ నటి మహీర ఖాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘మహీర ఓ మామూలు మోడల్. వృద్ధ నటి. కేవలం తల్లి పాత్రలకు మాత్రమే సరిపోతుంది’ అని ఇటీవల ఓ టీవీ షోలో వ్యాఖ్యానించారు. ఫైజల్‌ ఖురేషీ నిర్వహించిన పాకిస్తాని షో ‘సలామ్‌ జిందగీ’లో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నటి మహీర ఖాన్‌ తనదైన రీతిలో విమర్శలను తిప్పి కొట్టారు. తన లేఖలో ఎవరి పేరును ప్రస్తావించక పోయిన​ప్పటికి, పరోక్షంగా నటుడు జమాల్‌ వ్యాఖ్యలను ఉద్దేశించి రాసినట్లుగా స్పష్టమవుతుంది.

‘మనం వర్తమానంలో ఉన్నాము. మనం ఏమి చేస్తున్నాం, ఎలా చేస్తున్నామనేది మన భవిష్యత్తు. నేను అడగకపోయినా.. నాకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు’ అని తన లేఖలో పేర్కొన్నారు. ‘ఒక ఆర్టిస్టుగా చిత్ర పరిశ్రమను, నన్ను చూసి నేను గర్వపడుతాను. నా ఈ ప్రయాణంలో నేను ఏదైతే సరైనది అనుకున్నానో అదే చేశాను. ఇతరుల ఆలోచనలకు ఎప్పుడూ లొంగలేదు, లొంగను కూడా’ అని తన భావాలను వ్యక్తపరిచారు.

అంతేకాకుండా ‘ద్వేషంతో నిండిన ప్రపంచంలో, ప్రేమను పంచుదాం. ఇతరుల అభిప్రాయాలను గౌరవిద్దాం. వ్యతిరేకులపై సహనంతో పోరాడుదాం. మనలాంటి చిత్ర పరిశ్రమ, దేశం మరొకటి లేదనే విధంగా అభివృద్ధి చెందడానికి ఒకరినొకరం నిందించుకోవడం మానేద్దాం’ అన్నారు. నేను ఎక్కడో చదివాను లాటిన్‌ భాషలో ‘స్టార్‌డమ్’ అంటే ఒంటరిగా ఉన్నప్పుడు వెంట నిలిచే అభిమానులకు ధన్యవాదాలని అర్థం అని చెబుతూ తన లేఖను మహీరా ముగించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top