కమల్‌ పుట్టిన రోజు; సొంత ఊరులో వేడుకలు

Kamal Haasan birthday Trip To Paramakudi With Shruti Akshara And Charu Haasan - Sakshi

చెన్నై : సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి.. విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌. విభిన్న పాత్రలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. దశావతరంలో పది పాత్రలు పోషించి తను చేయలేని క్యారెక్టర్‌ లేదని నిరూపించుకున్నాడు. మరో చరిత్ర, భారతీయుడు, స్వాతి ముత్యం వంటి చిత్రాల్లో నటించి లెజెండ్‌ అనిపించుకున్నాడు. నవంబర్‌ 7(గురువారం) లోక నాయకుడి పుట్టిన రోజు. 65వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోడానికి కమల్‌ తన స్వగ్రామమైన ‘పరమక్కుడి’ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఆయన 60 ఏళ్ల సినీ ప్రస్థానానికి జ్ఞాపకంగా మూడు రోజుల వేడుకను నిర్వహించనున్నారు. ఈ ట్రిప్‌కి కుటుంబ సభ్యులతోపాటు తన టీం మొత్తం వెళ్లారు. ఈ క్రమంలో ఊరుకు వెళ్లే ముందు ఎయిర్‌పోర్టులో కుటుంబంతో దిగిన ఫోటోలను అక్షర హాసన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేశారు. 

ఇక శ్రుతి హాసన్‌ సైతం తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యపీ బర్త్‌డే బాపూజీ. ఈ పుట్టిన రోజు ఎంతో ప్రత్యేకం మీ 60 ఏళ్ల సినీ ప్రయాణానికి ఓ నిదర్శనం. పుట్టిన రోజుకి మన స్వగ్రామానికి వచ్చాం. అక్కడ వేడుక చేసుకున్నాం. అలాగే మీ జీవితంలో మేము కూడా భాగమయ్యాం. లవ్‌ యూ లాట్స్‌ పప్పా’ అంటూ విషేస్‌ తెలిపారు. కూతుళ్లు శ్రుతి హాసన్‌, అక్షర హాసన్‌తో సహా అన్నయ చారు హాసన్‌ ట్రిప్‌కు వెళ్లగా అక్కడ కమల్ తండ్రి శ్రీనివాసన్‌ విగ్రహన్నిఆవిష్కరించనున్నారు. వృత్తి పరంగా శ్రీనివాసన్‌ న్యాయమూర్తి అలాగే స్వాతంత్య్ర సమర మోధుడు. ఇక ఈ వేడుకల్లో పాల్గొనడానికి లజెండ్‌ శివాజీ గణేశన్‌ కొడుకు నటుడు ప్రభు సైతం పరమక్కుడికి వెళ్లారు. అక్కడ పుట్టినరోజు వేడుకల అనంతరం కమల్‌ నవంబర్‌ 8న తిరిగి చెన్నైకి వచ్చి తన కార్యలయంలో సినీ గురువు, లెజెండరీ ఫిల్మ్‌మేకర్‌ కె.బాల చందర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 

ఇక కమల్‌ హసన్‌ 1954లో తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరమక్కుడిలో జన్మించారు. స్వతహాగా తమిళనటుడైనా తన విలక్షణ నటనతో దేశమంతటికీ సుపరిచితులయ్యారు. బాల నటుడిగా నటించిన(కలకత్తూర్‌ కన్నమ్మ) మొదటి చిత్రానికే కమల్‌ జాతీయ పురస్కరం అందుకున్నారు. అనంతరం మూడు సార్లు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం దక్కించుకున్నారు. నటుడిగానే కాకుండా నృత్యంలోనూ ముఖ్యంగా భారత నాట్యంలోనూ కమల్‌కి మంచి ప్రావీణ్యం ఉంది. 1960లోనే సినిమాల్లో ఆరంగేట్రం చేసిన కమల్‌ 1977లో తెలుగు చిత్రం(అంతులేని కథ)తో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. తెలుగులో నటించిన మరో చరిత్ర, సాగర సంగమం, స్వాతిముత్యం, విచిత్ర సోదరులు, భామనే సత్యభామనే వంటి హిట్‌ సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేగాక సినిమా రంగంలో ఆయన చేసిన కృషికి తమిళనాడు ప్రభుత్వం ఆయన్ను కలైమామణి(కళాకారుల్లో మాణిక్యం) బిరుదుతో సత్కరించింది. ఈయన పద్మశ్రీ గ్రహీత.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top