ప్రజా పోరాటాలకే రాజకీయాల్లోకి..

Kamal haasan Birthday party in Tamil Nadu - Sakshi

నా కుటుంబానికి ఇష్టం లేదు

సెలూన్‌ షాప్‌లో పనిచేశా

పుట్టినరోజు వేడుకల్లో కమల్‌హాసన్‌

చెన్నై, పెరంబూరు: మరోసారి పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొనడం వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని, అంతేతప్పా తనకు వేరే దారి లేక కాదని నటుడు, మక్కళ్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌ పేర్కొన్నారు. గురువారం ఈయన 65వ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు భారీ ఎత్తన జరిగాయి. సాధారణంగా కమల్‌హాసన్‌ తన పుట్టిన రోజు వేడుకలను దూరంగా ఉంటారు. కానీ ఈ సారి అభిమానులు, పార్టీ కార్యకర్తల మధ్య సొంత ఊరు పరమకుడిలో జరుపుకున్నారు. బుధవారం రాత్రి పరమకుడి చేరుకున్న కమల్‌ తాజ్‌హోటల్‌లో బసచేశారు. గురువారం ఉదయం తెళిచెందూర్‌కు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన తన తండ్రి శ్రీనివాసన్‌ శిలావిగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఉపాధి మైదానంలో పలువురు శిక్షకులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రపోరాటం జరిగినప్పుడు తన తండ్రి ఆ పోరాటంలో పాలు పంచుకున్నారని తెలిపారు. ఆయన అప్పుడే ఇలాంటి పోరాటం మళ్లీ జరిగితే ఏం చేస్తావు అని తనను అడిగారన్నారు. కాగా ఇప్పుడు అలా మళ్లీ పోరాటం చేయాల్సిన పరిస్థితి నరెలకొనడంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చాననీ, వేరే పని లేక కాదనీ అన్నారు.

సెలూన్‌ షాప్‌లో పని చేశా
తాను రాజకీయాల్లోకి రావడం తన కుటుంబానికి ఇష్టం లేదని చెప్పారు. తానిక్కడ నెలకొల్పిన ప్రతిభా ప్రోత్సాహ శిక్షణ కేంద్రం స్థానిక యువత కోసమేనన్నారు. ఇలాంటి శిక్షణా కేంద్రాలను రాష్ట్రంలో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పుడు పీహెచ్‌డీ చేసిన వారు పారిశుద్ధ్య పనికి దరఖాస్తులు పెట్టుకునే పరిస్థితి నెలకొందని అన్నారు. ఉద్యోగాల కోసం వలస పోకూడదన్నది తన భావన అని అన్నారు. 61 లక్షల విద్యార్థులు ప్రాథమిక విద్యను అభ్యసించగా ఆ తరువాత అది 58 లక్షలకు తగ్గిపోయిందన్నారు. అదే ఎస్‌ఎస్‌ఎల్‌సీకి వచ్చే సరికి 11 లక్షలకు పడిపోయిందన్నారు. డిగ్రీకి వచ్చే సరికి ఆ సంఖ్య 5 లక్షలకు పడిపోయిందన్నారు. మరో విషయం ఏమిటంటే తాను గొప్ప కోసం చెపుతున్నానని భావించరాదనీ, ఆరంభంలో తాను నెలన్నర పాటు సెలూన్‌ షాప్‌లో పని చేసినట్లు తెలిపారు. ఆ తరువాత తాను ఉన్నత కుటుంబానికి చెందిన వాడినని తెలిసి ఆ షాప్‌ యజమాని మా ఇంట్లో తన గురించి చెప్పారన్నారు, దీంతో తానాపనిని మానేయాల్సి వచ్చిందనీ చెప్పారు. ప్రస్తుతం సైనికుల దళంలో చేరి ప్రాణాలర్పిస్తున్న వారి సంఖ్య కంటే ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య అధికం అవుతోందని కమలహాసన్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో కమలహాసన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు నటి శ్రుతీహాసన్, అక్షర హాసన్, సోదరి నళిని, సోదరుడు చారుహాసన్, నటి సుహాసిని పాల్గొన్నారు. కాగా కమలహాసన్‌ కుటుంబానికి సన్నిహితుడైన నటుడు ప్రభు తదితర సినీ ప్రముఖులు పాల్గొని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

కమల్‌ను రాష్ట్రపతిగా చూడాలన్నది ఆశ..
ఈ సందర్భంగా నటుడు ప్రభు మాట్లాడుతూ.. తన తండ్రికి కమలహాసన్‌ అంటే ఎనలేని ప్రేమ అని పేర్కొన్నారు. తన సినిమాకు చెందిన సాంకేతిక పరిజ్ఞానానంతా నేర్చుకుని తనను మించిపోయారని నాన్న చెప్పేవారని అన్నారు. తమ కుటుంబ మాదిరిగానే కమలహాసన్‌ కుటుంబం చాలా పెద్దదన్నారు. వారందరిని ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. కమలహాసన్‌ను రాష్ట్రపతిగా చూడాలన్నది తన కోరిక అని నటుడు ప్రభు పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top