‘డేర్‌’ ఆఫ్‌ కంచరపాలెం

Interview with Vijay Praveena and Venkatesh Maha - Sakshi

సినిమా చేయడానికి కథ కావాలి. కథకులు కావాలి.. యాక్టర్లు కావాలి. దర్శకుడు కావాలి.. క్యాష్‌ కావాలి. ఇవన్నీ ఒక ఎత్తు. అసలు కావాల్సింది ‘డేర్‌’. అంటే.. ధైర్యం. ఎత్తులు పొత్తులు కాదు. డేర్‌ అన్న ఎత్తుగడ కావాలి. టాలీవుడ్‌లో ‘కంచరపాలెం’ చిన్న ఊరు. కానీ ఇవాళ అది చాలా పెద్ద పేరు.

కంగ్రాట్స్‌.. ఒక్కసారిగా అందరూ మీ గురించి మాట్లాడుకునేలా చేశారు..
విజయ ప్రవీణ, వెంకటేశ్‌ మహా: థ్యాంక్స్‌. హానెస్ట్‌గా చేసిన ప్రయత్నం సక్సెస్‌ అయినందుకు మేం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం.

ఇంత హిట్‌ ఇచ్చాక క్రేజీ ఆఫర్స్‌ వస్తాయి. మీరు న్యూయార్క్‌లో ఫిల్మ్‌ కోర్స్‌ చేస్తానంటున్నారు?
వెంకటేశ్‌ మహా:  నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా తెలుసుకోవడం ఇంట్రెస్ట్‌. మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి, ఉంటాయి. వీఎఫ్‌ఎక్స్‌ మీద ఆరు నెలలు క్రాష్‌ కోర్స్‌ చేయాలని వెళ్తున్నాను. సినిమా ఇండస్ట్రీ అనేది ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అయ్యే  ఫీల్డ్‌. రోజుకో కొత్త టెక్నాలజీ వస్తూనే ఉంటుంది. సో.. మనల్ని మనం అప్‌డేటెడ్‌గా ఉంచుకోవాలి.

జనరల్‌గా ఆర్థిక కష్టాలుంటే వచ్చిన సినిమాలు ఒప్పేసుకునేవారేమో. న్యూయార్క్‌ వెళ్లాలనుకుంటున్నారంటే మీరు సౌండ్‌ పార్టీయేనా?
వెంకటేశ్‌: (నవ్వేస్తూ) అస్సలు కాదండీ. అసలా సౌండ్‌ కూడా వినిపించనంత దూరం. మాది చాలా మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ. నేను 17 ఏళ్లకే ఇండిపెండెంట్‌గా ఉందాం అని బయటకి వచ్చేశాను. డిగ్రీ డ్రాప్‌ అవుట్‌. చిన్నప్పటి నుంచి జీవితంలో స్ట్రగుల్‌ ఉండబట్టే ఇంత మంచి సినిమా వచ్చిందని నమ్ముతాను.

సినిమా అనేది మీ లైఫ్‌లోకి ఎప్పుడొచ్చింది?
వెంకటేశ్‌: నా చిన్నప్పుడంతా సినిమా మధ్యలోనే పెరిగాను. ఇంట్లో మారాం చేస్తుంటే మా అమ్మ డబ్బులిచ్చి సినిమాకు వెళ్లమని చెప్పేది. అలా నాలుగో తరగతి నుంచి ఒంటరిగా సినిమాలకు వెళ్లడం నేర్చుకున్నాను. నేను పెరిగే కొద్దీ సినిమాల మీద ప్రేమ కూడా పెరుగుతూ వచ్చింది.

డిగ్రీ కూడా కంప్లీట్‌ చేయలేదు కాబట్టి వేరే దాంట్లో అవకాశం లేక సినిమాల్లోకి వచ్చారా?
వెంకటేశ్‌: అలా ఏమీ కాదండీ. ఒకవేళ నేను సినిమాల్లో రాకపోయుంటే ఓ కంపెనీలో ఫ్లోర్‌ మేనేజర్‌గా ఉండేవాడ్ని, లేదా బీపీఓ కంపెనీలో డీసెంట్‌గా సంపాదిస్తూ ఉండేవాడ్ని. ఏదో ఓ పని మాత్రం చేసేవాడ్ని. సినిమా అంటే ప్యాషన్ . అందుకే వచ్చాను.

సినిమా ప్రయత్నాలు.. ఆ ఎక్స్‌పీరియన్స్?
వెంకటేశ్‌: నిజానికి యాక్టర్‌ అవుదాం అని హైదరాబాద్‌ వచ్చి అవకాశాల కోసం ప్రయత్నించా. ‘గడ్డం పెంచు తమ్ముడూ.. అవకాశం ఇచ్చేస్తాం’ అనేవారు. అలా గడ్డం పెంచుతూనే ఉండేవాడ్ని. ఈలోపు ఆ సినిమాలు రిలీజ్‌ అయ్యేవి. అవకాశాలు చాలా అరుదుగా వచ్చేవి. ఈలోపు ‘నాన్న’ పేరుతో ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశాను.

అది చేసినది యు ట్యూబ్‌లో వ్యూస్‌ కోసం కాదు... నన్ను నేను ‘సెల్ఫ్‌ చెక్‌’ చేసుకోవడానికే. మంచి పేరు  వచ్చింది. ఆ షార్ట్‌ ఫిల్మ్‌ అప్‌లోడ్‌ చేసిన యు ట్యూబ్‌ చానల్‌ వాళ్లు నన్ను ప్రొడక్షన్ డిజైనర్‌గా ఉండమన్నారు. అసలు ప్రొడక్షన్ డిజైన్  అంటే ఏంటీ? అని గూగుల్‌లో తెలుసుకున్నాను. ఓ ఆరు నెలలు చేశాను. ఆ తర్వాత  ‘రంగం’ అనే డ్యాన్స్   స షోకి కో డైరెక్టర్‌గా చేశాను. నా లైఫ్‌లో నాకు వచ్చిన ప్రతీ చాన్స్‌ని కాదనుకుండా అంది పుచ్చుకున్నాను.

వెంకట్‌లానే మీకూ ఫిల్మీ బ్యాగ్రౌండ్‌ లేదా?
విజయ ప్రవీణ: ఇండస్ట్రీలో నాకు పరిచయాలు ఏమీ లేవు. నాకు సినిమాలంటే చాలా ఇష్టం. కానీ స్క్రీన్‌ మీద కనిపించాలనో, ఆఫ్‌ స్క్రీన్  ఏదైనా చేయాలనో.. ఇలా ఏదీ అనుకోలేదు. ఇండస్ట్రీలో ఉండాలి.. పెద్ద పొజిషన్‌లో ఉండాలి అనుకున్నాను. కానీ ఇంట్లో ఎంకరేజ్‌ చేయలేదు. మెడిసిన్  చదివాను. కార్డియాలజిస్ట్‌గా చేస్తున్నాను. నాకు ఒకరు అవకాశం ఇచ్చే బదులు ఇండస్ట్రీలో నాకు అవకాశం నేనే ఇచ్చుకోవాలనుకున్నాను. సినిమా నిర్మించాలనుకున్నాను. నా సంపాదనతో సినిమా తీస్తే నాకు నచ్చింది తీసుకోవచ్చు అని అనుకున్నాను. అలానే తీశాను.

‘కంచరపాలెం’లాంటి సినిమాలు బ్యాకింగ్‌ ఉంటేనే వెలుగులోకి వస్తాయి. సురేశ్‌బాబుగారు ఆ స్టెప్‌ తీసుకోవడానికి మీరు కారణం.. దాని గురించి?
వెంకట్‌ సిద్దారెడ్డి: ఈ సినిమాను గతేడాది డిసెంబర్‌ 26న చూశాను. ఫస్ట్‌ 15 నిమిషాలు చూడగానే ఈ సినిమాలో ఏదో ఉందని డిసైడ్‌ అయ్యాను. వెంటనే సురేశ్‌బాబుగారికి ఫోన్  చేశాను. ‘ఈ సినిమాను ప్రమోట్‌ చేస్తున్నట్లు ఇంటర్వెల్‌లో మీరు అనౌన్స్    చేయాలి సార్‌’ అన్నాను. ఆయన ఏదో పనిలో ఉండి క్లైమాక్స్‌లో వచ్చి ‘ఈ సినిమాను సురేశ్‌ ప్రొడక్షన్ ప్రజెంట్‌ చేస్తుంది’ అని చెప్పారు. రానా తన భుజాల మీద వేసుకొని ప్రివ్యూ షోలు వేశారు.

ఫస్ట్‌ సినిమాను ఎడిట్‌ చేద్దాం.. కొన్నిచోట్ల స్లోగా ఉందనుకున్నాం. కానీ మన రోజువారి జీవితాల్లో ఇలానే కదా ఉండేది. అన్నీ చకచకా జరిగిపోవు కదా. ఇది సినిమా కాదు జీవితం. వెంకటేశ్‌ మహా చక్కగా క్యాప్చర్‌ చేశాడు. ఈ సినిమా క్రెడిట్‌ అంతా వెంకటేశ్‌కే. ఇంతకు ముందు తమిళం, మలయాళ భాషల్లో ఇలాంటి సినిమాలు వచ్చేవి అని మాట్లాడుకునే వాళ్లం. కానీ ఇప్పుడు మనం కూడా వాటికి పోటీగా.. కాదు.. కాదు వాటి కంటే మంచి సినిమా తీశాం అని కాలర్‌ ఎగరేసుకొని తిరగొచ్చు.


(‘కేరాఫ్‌ కంచరపాలెం’ పోస్టర్‌)

విజయగారూ.. ఆపరేషన్  థియేటర్‌ నుంచి సినిమా థియేటర్‌కి రావడం ఎలా ఉంది?
విజయ: అక్కడంతా (ఆపరేషన్  థియేటర్‌) నిశబ్దంగా ఉంటుంది. ఇక్కడేమో ఈలలు, గోల, చప్పట్లు. కొత్త ఎక్స్‌పీరియన్స్‌. నన్ను నేను స్క్రీన్‌ మీద చూసుకున్నప్పుడు ఓ మంచి అనుభూతి కలిగింది. నేను కావాలనుకున్న అనుభూతి ఇది. చాలా డిఫరెంట్‌గా అనిపించింది.

కార్డియాలజిస్ట్‌గా గుండె జబ్బులు నయం చేసేవారు. ఇప్పుడేమో సినిమా ద్వారా హృదయాలను ఆహ్లాదంగా మార్చారు. మొత్తానికి ఎక్కడున్నా ఆరోగ్యాన్ని వదలరు.
విజయ: (నవ్వుతూ). వినడానికి చాలా బాగుంది. అయితే ఇక్కడ అడ్జెస్ట్‌ అవ్వడానికి టైమ్‌ పట్టేలా ఉంది. 2 ఏళ్లుగా ఈ సినిమా కోసం కష్టపడ్డాం. ఇంత కష్టపడ్డాక వచ్చిన సక్సెస్‌ రుచి చాలా స్పెషల్‌గా ఉంటుంది కదా. (నవ్వుతూ) మల్టీప్లెక్స్‌లు సందర్శించాం. అక్కడ అంతా హౌస్‌ఫుల్‌ (చెమర్చిన కళ్లతో). నాకు చాలా స్పెషల్‌గా అనిపిస్తోంది.
వెంకటేశ్‌: (మధ్యలో అందుకుంటూ) హలో మా ఇండియన్స్   కి ఎమోషన్స్    ఉన్నాయి. ఏదైనా డీప్‌గా అర్థం చేసుకుంటాం. మీరు అమెరికాలో పెరిగిన ఇండియన్  కదా.. మా అంతగా మీకు ఎమోషన్స్    ఉండవేమో (నవ్వులు).

‘ఇలాంటి సినిమా కావాలి’ అని ఓ ప్రొడ్యూసర్‌గా మీక్కావల్సింది కోరుకున్నారా?
విజయ: ఈ సినిమా స్టార్టింగ్‌ అప్పుడు 3000 రూపాయలు అడ్వాన్స్‌ ఇచ్చాను. నీ ఆర్టిస్టిక్‌ ఫ్రీడమ్‌కి ఎప్పుడూ నో చెప్పను. వేరే ఎవరి కోసమో కాదు. ఇది నా కోసం నేను తీసుకుంటున్న సినిమా. ముందు నాకు నచ్చాలన్నాను. నేను వెంకటేశ్‌ నుంచి ఎదురు చూసింది రెగ్యులర్‌ సినిమా కాదు. ‘హానెస్ట్‌ సినిమా’.
వెంకటేశ్‌: ఈవిడ మాత్రం తన కోసం సినిమా చేయ మంది. నేను మాత్రం జనాల కోసమే తీశానండి.

వెంకటేశ్‌కి, మీకు పరిచయం ఎలా ఏర్పడింది?
విజయ: సినిమా తీయాలనుకున్నప్పుడు ఇండియాలో అపర్ణా మల్లాది అనే ఫ్రెండ్‌ ద్వారా సినిమా ప్రొడ్యూసర్‌ అవ్వాలంటే ఏం ఫార్మాలిటీలు ఉంటాయి? అనే విషయం తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను. ఆమె ద్వారానే మహాని కలిశాను. మేం ముగ్గురం ఆ రోజంతా.. దాదాపు 8 గంటలు సినిమాల గురించి మాట్లాడుకున్నాం. ముగ్గురు అనే కన్నా ఇద్దరు అంటే కరెక్ట్‌. ఎందుకంటే నేను వెంకట్‌ని అసలు పట్టించుకోలేదు. సరిగ్గా ఆ రోజు  నా ఫోన్  పోయింది. ఎక్కడెక్కడికి వెళ్లామో ఫోన్ వెతుక్కుంటూ మళ్లీ ఆ ఏరియాలకి వెళ్లాం. దొరకలేదు. సరే.. సాయంత్రం స్టార్‌బక్స్‌లో కూర్చున్నాం.

అప్పటి వరకు మహాతో మూడు ముక్కలు కూడా మాట్లాడలేదు. అప్పుడు మహాతో అపర్ణ ‘నీ స్టోరీ ఐడియా వీడియో విజయకి ఎందుకు చూపించకూడదు’ అన్నారు. మహా వీడియో చూపించాడు. నాకు విపరీతంగా నచ్చేసింది. ఆ షాట్‌ చూడగానే లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌.  వెంటనే నేను తనని అడిగిన క్వశ్చన్‘స్క్రిప్ట్‌ రెడీయా?’ అని. రెడీ అన్నాడు. రెండో ప్రశ్న బడ్జెట్‌ ఎంత? అని అడిగితే.. ఇంత అని చెప్పాడు. వెంటనే సినిమా చేసేద్దాం అన్నాను.
వెంకటేశ్‌: విజయ అలా చెప్పిన మరుసటి రోజు మార్నింగే కంచరపాలెం బస్‌ ఎక్కాను.

ముందు నిర్మాతగా మాత్రమే చేయాలనుకున్నారు. తర్వాత ఈ సినిమాలో ‘సలీమా’ క్యారెక్టర్‌ కూడా చేశారు. ఆ నిర్ణయం ఎవరిది?
విజయ: సినిమా తీసే ప్రాసెస్‌లో ఓసారి ఆడిషన్స్    చాలా కష్టం అని అంటే నేను ఆడిషన్  ఇస్తాను అని చెప్పాను. నన్ను యాక్ట్‌ చేయమన్నారు. కొన్ని సీన్స్    ఇచ్చారు.. చేశాను. ఆ తర్వాత పాటలు పాడమన్నారు. ‘ఇప్పటికింకా నా వయసు’ పాటకు డ్యాన్స్    చేయమన్నారు. చేశా. బట్‌.. అదంతా సరదాగా చేసినదే. సినిమాలో క్యారెక్టర్‌ చేస్తానని అప్పుడు అనుకోలేదు.
వెంకటేశ్‌: ముందు సలీమా పాత్రకు  వేరే అమ్మాయిని అనుకున్నాం. తన కాలు విరిగిపోయింది. అప్పుడు ప్రవీణ ఇచ్చిన ఆడిషన్స్    గురించి మా  అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గుర్తు చేశాడు. మళ్లీ ఆ వీడియో చూశాను. సలీమా క్యారెక్టర్‌కి విజయ సరిపోతుందనిపించింది.
విజయ: మహా ఫోన్  చేసి, క్యారెక్టర్‌ చేయమని అడిగితే అర్థం కాలేదు. ‘నాకైతే చేయడానికి ఇష్టమే. నీకు నమ్మకం ఉందా’ అంటే, ఉందన్నాడు. చేసేశాను.
వెంకటేశ్‌: స్కైప్‌ కాల్స్‌లో ఓ నెల రోజులు వర్క్‌షాప్‌ చేయాలనుకున్నాం. ప్రవీణ ఆ యాసను 15 రోజుల్లోనే పట్టేసింది.

మరి యాక్టింగ్‌లో కంటిన్యూ అవుతారా?
విజయ: అవ్వాలి. ఒకవేళ మహా మళ్లీ సినిమా తీస్తా అంటే తప్పకుండా. తను చాలా గ్రేట్‌ డైరెక్టర్‌. యాక్టింగ్‌ ఈజ్‌ పర్సనల్‌ అని ఫీల్‌ అవుతాను. మనం.. మనం అనే విషయం మరచిపోయి వేరే వాళ్లలా ట్రాన్ ఫార్మ్‌ అవ్వగలగాలి. సినిమాలైతే కచ్చితంగా నిర్మిస్తా. ఎందుకంటే అది చేయకపోతే చచ్చిపోతా కాబట్టి. సినిమా పరంగా ప్రస్తుతానికి బాగున్నా. అమెరికాలో నా ఆఫీస్‌లో మాత్రం హ్యాపీగా లేరు (నవ్వుతూ). ప్రాజెక్ట్‌ కోసం అటూ ఇటూ తిరుగుతున్నాను కదా.

అమెరికాలో ఫ్రెండ్స్‌కి ఈ సినిమా చూపించారా?
విజయ: చూపించాను. సబ్‌ టైటిల్స్‌తో చూస్తూ  ఏదైనా ఫీల్‌ మిస్‌ అవుతారేమో అనుకున్నాను కానీ బాగా ఎంజాయ్‌ చేశారు. ఎక్కడ నవ్వాలో అక్కడే నవ్వారు. ఎక్కడ ఏడవాలో అక్కడే కనెక్ట్‌ అయ్యారు. వాళ్లందరికీ రాజు అనే క్యారెక్టర్‌ తెగ నచ్చాడు. మా ఫ్రెండ్‌ ఒక అమ్మాయికి అయితే రాజు కలలోకి వచ్చాడట. ఎంత గొప్ప క్యారెక్టర్‌ అని అభినందించింది.

దర్శకుడికి సోషల్‌ రెస్పాన్సిబులిటీ ఉండాలా?
వెంకటేశ్‌: దర్శకుడికి అని కాదు. ఆర్టిస్ట్‌కి. అది చిత్రకారుడికి కావచ్చు. రచయితకు, నటుడికి ఎవ్వరికైనా ఉండాలి. ఎందుకంటే ఆర్టిస్ట్‌ల పని వాళ్ల కాలంలో జరిగిన సంఘటనలు, మన కల్చర్‌ భవిష్యత్‌ తరాల వారికి అందజేయడం. మన పూర్వీకులు రాయబట్టే మనం  చరిత్ర చదువుకుంటున్నాం. మన సినిమాల గురించి మాట్లాడుకుంటే అప్పట్లో ‘ఆకలి రాజ్యం’ సినిమా తీసుకుందాం. అందులోని నిరుద్యోగ సమస్య అయినా, కమ్యూనిజం భావాలైనా చూస్తే రక్తం ఉడుకుతుంది. ఇప్పుడు తీసే సినిమాలు నెక్ట్స్‌ జనరేషన్‌కి ఎంతో కొంత నేర్పించాలని నమ్ముతాను.
విజయ: మాస్‌ సినిమా, కమర్షియల్‌ సినిమా, ఆర్ట్‌ సినిమా అని కాదు. గుడ్‌ సినిమా. ‘గుడ్‌ ఫిల్మ్‌ ఈజ్‌ ఏ గుడ్‌ ఫిల్మ్‌’. జానర్‌ ఏదైనా సరే. నేను ఐటమ్‌ సాంగ్స్‌ ఎంజాయ్‌ చేస్తాను. మన సినిమాల్లో చాలా మంది క్యారెక్టర్స్‌కి ఏ పనీ ఉండదు. అలా ఫ్రేమ్‌ నిండుగా ఉండటం కోసం ఉంటారు. అది మారాలి. ప్రతి క్యారెక్టరైజేషన్ కీ సినిమాలో పని ఉండాలి.

ఈ సినిమా మంచి రిజల్ట్‌ ఇవ్వకపోయుంటే?
వెంకటేశ్‌: సినిమా స్టార్ట్‌ చేసినప్పుడే చాలా పెద్ద రిస్క్‌ చేస్తున్నాం అని మాకు తెలుసు. ‘నేనింతే’ సినిమా క్లైమాక్స్‌లో రవితేజ ఓ మాట చెబుతాడు. ‘సినిమా ఫ్లాప్‌ అయినా ఇంకో సినిమా చేస్తాం. హిట్‌ అయినా ఇంకోటి చేస్తాం. హిట్‌ అయిపోయింది అని మూట కట్టుకొని వెళ్ళిపోం కదా’. రిజల్ట్‌తో సంబంధం లేకుండా మా కథలు చెబుతూనే ఉంటాం.
విజయ: ఏమో.. నా కేస్‌లో వేరేలా ఉండేదేమో. ఈ సినిమా చేయాలి అనుకున్నప్పుడే కొన్ని హద్దులు పెట్టుకొని వచ్చాను. డాక్టర్‌ని కదా. చిన్న ఆల్గోరిథమ్‌ గీసుకొని వచ్చాను. సినిమా నాకు నచ్చినట్టు రావాలనుకున్నాను. అలా కాకుండా వేరేలా జరిగి ఉంటే ఆల్రెడీ నా జాబ్, దాని టెన్షన్స్    ఉండనే ఉన్నాయి. మళ్లీ తలనొప్పి అవసరమా? అనుకునేదాన్నేమో. కానీ ఒకసారి సినిమా సెట్‌ ఎక్స్‌పీరియన్స్    చేశాక ఫ్లాప్‌ అయినా సినిమాలు తీస్తూనే ఉండాలని ఫిక్స్‌ అయిపోయాను. ఫిల్మ్‌ మేకింగ్‌ అనేది మాటల్లో చెప్పలేని అనుభూతినిస్తుంది.

విజయగారు అంత నమ్మారని ప్రెషర్‌ ఏమైనా?
వెంకటేశ్‌: తను ఈ సినిమా ఓకే అనేప్పుడు రిటర్న్‌ ఏం ఆశించలేదు. వండర్‌ఫుల్‌ సినిమా కావాలనుకుంది. మంచి సినిమా తీయాలంటే మనం సక్రమంగా పని చేస్తే ఆటోమేటిక్‌గా సినిమా రిలీజ్‌ తర్వాత  దాని పని అది సక్రమంగా చేసుకుంటుంది. (నవ్వుతూ)
విజయ: సినిమా నిర్మాణం అంటేనే గ్యాంబ్లింగ్‌.  ఎక్కడ వస్తుందో.. ఎక్కడ పోతుందో తెలియదు. అందుకే నేను ఎవరి డబ్బుతోనూ రిస్క్‌ చేయదలచుకోలేదు. నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో సినిమా తీయాలనుకున్నాను. ఫస్ట్‌ అటెమ్ట్‌లో పోయినా ఓకే అనుకునే వచ్చాను.

ఓ భారతీయురాలిగా అమెరికాలో మీ ఎక్స్‌పీరియన్స్‌?
విజయ: మా ఏరియాలో, మా స్కూల్‌లో అన్ని చోట్లా నేనొక్కదాన్నే ఇండియన్  రూట్స్‌ ఉన్న అమ్మాయిని. మా అమ్మ రెండు జడలు వేసి పంపించేది.  స్కూల్‌లో ఏడిపించేవారు. జడలు లాగేవాళ్లు. ఎగతాళి చేసేవాళ్లు. నేను చాలా సీరియస్‌గా గొడవలు పడిన సందర్భాలున్నాయి. భారతీయులంటే చిన్న చూపు.

అమెరికన్స్  కు ఇండియన్‌ సినిమాలంటే ఎలాంటి అభిప్రాయం ఉంది?
విజయ: అమెరికన్స్‌కు ఇండియన్ సినిమాలంటే హిందీ సినిమాలే. ఆ పాటలు, ఆ డ్రీమ్‌ సీక్వెన్స్‌ చూసి వెటకారం చేస్తారు. ఇండియన్ యాక్టర్స్‌ పాపులర్‌ అవుతున్నారు. కానీ మన తెలుగు సినిమాకు ఆ స్థాయి గుర్తింపు రావడం లేదని ఎప్పుడూ ఓ చిన్న బాధ అయితే ఉండేది. నాకు ఇష్టం అయినదాన్ని హేళన చేయడం తట్టుకోలేకపోయా. అయితే కొన్ని సంవత్సరాలు మన తెలుగు సినిమాలు ఫ్లాట్‌ అయ్యాయని ఒప్పుకుంటాను. అప్పుడు కోపం వచ్చింది. కొన్నేళ్లు తెలుగు సినిమాలు చూడటం మానేశాను. నా జాబ్‌తో సగం టైమ్‌ సరిపోయేది. అంత బిజీలో రెండు గంటలు కేటాయించాలంటే న్యాయం అనిపించేది కాదు. అప్పట్లో కచ్చితంగా ఓ రేప్‌ సీన్  ఉండాలని ఫిక్స్‌ అయ్యేవారు. అవసరం లేకపోయినా అవి వచ్చేవి. వయలెన్స్    విపరీతంగా ఉండేది. సినిమాల్లో అంత వయలెన్స్    చూసి మన నార్మల్‌ లైఫ్‌లో కూడా అది కామన్  అనుకుంటున్నాం.
వెంకటేశ్‌: ఈ విషయంలో నేను నీతో ఏకీభవించడం లేదు. హింస అనేది కొత్తగా మనం పుట్టించలేదు. సొసైటీలో ఉన్నదాన్ని తీసుకున్నాం. కానీ మనం చేసిన పొరపాటేంటే దాన్ని హైలైట్‌ చేయడం. మనం ఏదైనా ఎక్కువే చేస్తాం.

ఈ జర్నీలో మీరు పర్సనల్‌గా ఫీల్‌ అయిన బెస్ట్‌ మూమెంట్స్‌
విజయ: నాకు ఈ జర్నీలో రెండు పీక్‌ మూమెంట్స్‌ ఉన్నాయి. ఒకటి మహా నాకీ ఐడియాని చూపించినప్పుడు. ఆ తర్వాత డిసెంబర్‌ 26. సురేశ్‌బాబుగారు ఈ సినిమాను ప్రజెంట్‌ చేస్తున్నాం అని చెప్పినప్పుడు.

కెరీర్‌ గోల్స్‌ ఏంటీ?
వెంకటేశ్‌: గర్వం, పొగరు అని అనుకోండి కానీ నా వరకూ నేను అనుకునేది ఏంటంటే తెలుగు సినిమా అనగానే మనకు కొంతమంది గుర్తొస్తారు కదా. ఎల్వీ ప్రసాద్, కేవీ రెడ్డి, ఎన్టీఆర్, నాగేశ్వరరావు.. ఇలా నా పేరు కూడా ఆ వంద మందిలో ఉండాలని ఆకాంక్ష. ఈ రోజుల్లో ఐడెంటిఫికేషన్  రావడం చాలా కష్టం. ప్రతి వారం ఓ పది సినిమాలు రిలీజవుతున్నాయి. అందులో మనకంటూ ఓ ప్రత్యేక స్థానం తెచ్చుకోవడం కష్టం. నా వల్ల ఇండస్ట్రీ మారిపోవాలనడంలేదు. కొత్త జనరేషన్, న్యూ వేవ్‌ సినిమాలు కూడా ఇంకా రావాలనుకుంటున్నాను.

ఫైనల్లీ నెక్ట్స్‌ ప్లాన్‌?
విజయ: సినిమాలు కంటిన్యూ చేస్తాను. నిర్మించడమే కాదు.. మంచి క్యారెక్టర్‌ అనిపిస్తే నటిస్తాను కూడా. వెంకటేశ్‌ ఓ మంచి ఐడియా చెప్పాడు. దాని మీద వర్కవుట్‌ చేయాలనుకుంటున్నాను.
వెంకటేశ్‌: ఆరు నెలలు కోర్స్‌ చేసే ప్లాన్‌ ఉంది. మంచి మంచి ఆఫర్స్‌ వచ్చాయి. ఇంకా ఏమీ సైన్‌ చేయలేదు. ‘కంచరపాలెం’ వైపు లైఫ్‌ టర్న్‌ అయింది. నెక్ట్స్‌ టర్న్‌ గురించి మళ్లీ చెబుతాను.

– డి.జి.భవాని

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top