స్టార్లు పాడితే... లోకమే ఆడదా..!

స్టార్లు పాడితే... లోకమే ఆడదా..!


సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. ప్రెజెంట్ ట్రెండ్ ఏమిటంటే...

హీరోలూ, హీరోయిన్లూ గొంతు విప్పి పాటలు పాడడం.

తెలుగు చిత్రసీమలోనూ, హిందీ చిత్రసీమలోనూ ఈ కల్చర్ ఎక్కువైపోయింది.

లేటెస్ట్‌గా ఈ వారంలో... సింగర్స్ అవతారమెత్తిన ఓ ముగ్గురు స్టార్స్ గురించి డీటైల్స్...


 

గొంతు సవరించిన బన్నీ

అల్లు అర్జున్ డ్యాన్సులు బాగా చేస్తారు. ఫైట్లు ఇరగదీస్తారు. మరి... ఆయన సాంగ్ సింగితే ఎలా ఉంటుంది? నిజంగానే మరికొన్ని రోజుల్లో ఆయన పాడిన పాటను  మనం వినబోతున్నాం. యస్.. ఈ స్టయిలిష్ స్టార్ పాట పాడేశారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ‘సరైనోడు’ చిత్రం రూపొందు తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఎస్. ఎస్. తమన్ స్వరాలందిస్తున్నారు. మామూలుగా తాను ఏ సినిమాకి పాటలందించినా ఆ సినిమాలో నటించే హీరోతోనో, హీరోయిన్‌తోనో పాట పాడించడానికి ట్రై చేస్తారు తమన్.చిన్న ఎన్టీఆర్, రవితేజ, శ్రుతీహాసన్ వంటి తారలు తమన్ ట్యూన్స్‌కు పాడారు. ఇప్పుడు అల్లు అర్జున్‌తో పాడించడంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారు. ‘‘బన్నీ లాంటి బెస్ట్ డ్యాన్సర్‌కి ట్యూన్స్ తయారు చేయడం సవాల్‌గా అనిపించింది’’ అని ఈ సందర్భంగా తమన్ పేర్కొన్నారు. చెన్నైలోని రికార్డింగ్ థియేటర్‌లో అల్లు అర్జున్ పాడగా ఓ పాటను రికార్డ్ చేశారు. బన్నీ భలేగా పాడారట. మార్చిలో ఆడియోను విడుదల చేయాలనుకుంటున్నారు. సో... సింగర్‌గా బన్నీ గొంతు వినడానికి మరెన్నో రోజులు లేదన్నమాట.

 

పరిణీతి పాడుతుందోచ్!

బాలీవుడ్‌లో సింగర్స్‌గా ఆకట్టుకున్న కథానాయికలు చాలామందే ఉన్నారు. సోనాక్షీ సిన్హా, శ్రద్ధాకపూర్, ఆలియా భట్‌లతో పాటు మన దక్షిణాది బ్యూటీ శ్రుతి కూడా హిందీలో పాడి, భేష్ అనిపించుకున్నారు. ప్రియాంకా చోప్రా ఏకంగా ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఆల్బమ్స్‌తో గాయనిగా ఫేమస్ అయిపోయారు. సింగర్స్ అవతారమెత్తిన కథానాయికల జాబితాలో ఇప్పుడు పరిణీతి చోప్రా చేరిపోయారు. ప్రస్తుతం ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘మేరీ ప్యారీ బిందు’.సంగీత దర్శక ద్వయం సచిన్- జిగర్ ఈ చిత్రానికి పాటలు స్వరపరుస్తున్నారు. ఈ చిత్రంలోని ‘మనా కీ హమ్ యార్ నహీ...’ అనే పాటను పరిణీతితో పాడించాలనుకున్నారట. ఈ బ్యూటీని అడగ్గానే.. ఓకే చెప్పేశారు. వాస్తవానికి పరిణీతి గాయకురాలిగా శిక్షణ కూడా పొందారు. అయితే, ఇప్పటివరకూ ఆమె సినిమాలకు పాడలేదు. ‘‘పాడాలని చాలామంది దర్శకులు, సంగీత దర్శకులు అన్నారు. కానీ, ఎందుకనో కుదరలేదు. ఇప్పుడు కుదిరింది’’ అని పరిణీతి పేర్కొన్నారు. త్వరలో ఆమె పాడగా ఈ పాటను రికార్డ్ చేయనున్నారు.

 

అంజలి నోట... తమిళ పాట...


పదహారణాల తెలుగమ్మాయి అంజలి ఒకవైపు గ్లామరస్ రోల్స్ చేయడంతో పాటు మరోవైపు నటనకు అవకాశం ఉన్న ట్రెడిషనల్ రోల్స్ చేస్తూ దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రాల్లో ‘చిత్రాంగద’ ఒకటి. ‘పిల్ల జమీందార్’ ఫేమ్ అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో గంగపట్నం శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ వెర్షన్‌కి ‘యార్ నీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి స్వామినాథన్ పాటలు స్వరపరుస్తున్నారు.ఓ పాటను అంజలితో పాడించాలనుకుంటున్నారట. అంజలి వాయిస్ ముద్దు ముద్దుగా ఉంటుంది. ఇక, పాడితే ఎంత ముద్దుగా ఉంటుందో? అంజలి పాడనున్న తొలి పాట ఇదే అవుతుంది. ఇది ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ. వివిధ ప్రాంతాలతో పాటు అమెరికాలోని ఎనిమిది నగరాల్లో కూడా ఈ సినిమా చిత్రీకరణ జరిపారట. హారర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అంజలి పాట కచ్చితంగా స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని చిత్ర యూనిట్ భావన.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top