మనతో పాటు ఇంటికి వచ్చే చిత్రం జాను

Dill Raju Speech at Jaanu pre release event - Sakshi

– నాని

‘‘96’ సినిమాను రీమేక్‌ చేయొద్దు అని’ రాజుగారికి నా అభిప్రాయం చెప్పాను. శర్వానంద్, సమంత చేస్తున్నారని తెలిసిన తర్వాత ఎప్పుడెప్పుడు చూస్తానా? అని ఎదురుచూస్తున్నా’’ అని నాని అన్నారు. శర్వానంద్, సమంత జంటగా సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాను’. తమిళ చిత్రం ‘96’కి ఇది తెలుగు రీమేక్‌. ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ–రిలీజ్‌ వేడుకలో ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ – ‘‘జాను’ పాత్రలో సమంతను తప్ప ఎవర్నీ ఊహించుకోలేకపోయాను.

శర్వా కూడా ‘96’ చూసి సూపర్‌ అన్నాడు. ఒరిజినల్‌ ‘96’ చేసిన ప్రేమ్‌కుమార్, టెక్నీషియన్స్‌ అందరూ ఈ సినిమాకు పని చేశారు. షూటింగ్‌ సమయంలో శర్వా ప్రయాణిస్తున్న జీపు బోల్తా పడింది.  దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు. ఆ తర్వాత మరో ఇబ్బంది. ఒక్కో అడ్డంకి దాటుకొని సినిమా పూర్తి చేశాం. ఈ సినిమా చూసి ప్రేక్షకులు ఎన్నో జ్ఞాపకాల్ని ఇంటికి తీసుకెళ్తారు’’ అన్నారు. ‘‘ఫ్యాన్స్‌ని నిరుత్సాపరచకూడదని ప్రతి సినిమాకు భయపడుతుంటా. ప్రతిరోజు మొదటి సినిమా షూటింగ్‌లానే భావిస్తాను. ప్రతిరోజూ షూటింగ్‌లో  మ్యాజిక్‌ జరుగుతుండేది.

ప్రేమ్‌కుమార్‌ మ్యాజిక్‌ని రిపీట్‌ చేశారు. ఫ్యాన్స్‌ అందరూ గర్వంగా ఫీలయ్యేలా చేస్తాననే అనుకుంటున్నాను’’ అన్నారు సమంత. ‘‘నిత్యామీనన్, సాయి పల్లవి, సమంత వంటి హీరోయిన్స్‌తో నటించేటప్పుడు చాలా అలర్ట్‌గా ఉండాలి. లేకపోతే సన్నివేశాలను తినేస్తారు.  ప్రతీ సినిమా వంద శాతం చెక్‌ చేసుకుంటుంది సమంత. అందుకే సూపర్‌స్టార్‌ అయింది. ఆరు నుండి తొంభై ఏళ్ల వరకూ అందరికీ ‘జాను’ సినిమా కనెక్ట్‌ అవుతుంది. ఇంత మంచి సినిమా నాకు ఇచ్చిన టీమ్‌ అందరికీ థ్యాంక్స్‌.

నానితో నా స్నేహం సారథి స్టూడియోస్‌లో ప్రారంభం అయింది. నేను, నరేశ్, నాని చాలా ట్రిప్స్‌కి వెళ్లే వాళ్లం’’ అన్నారు శర్వానంద్‌.  ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో శర్వా నా తొలి ఫ్రెండ్‌. శర్వానంద్, సమంత ఇద్దరూ బెస్ట్‌ పెర్ఫార్మర్స్‌. పోటీ పడి నటించారు. శర్వానంద్‌ చేసే ప్రతి సినిమాలో తనకు మంచి పేరు వస్తుంది. స్యామ్‌ ఎంచుకుంటున్న సినిమాలు చూసి గర్వపడుతున్నాను. రాజుగారికి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవ్వాలి. కొన్ని సినిమాలు ఎంజాయ్‌ చేస్తాం. కొన్ని సినిమాలను ఇంటికి తీసుకెళ్తాం. ‘జాను’ మీతో పాటు ఇంటికి తీసుకువెళ్లే సినిమా’’ అన్నారు నాని. దర్శకుడు వంశీ పైడిపల్లి, నటీనటులు  సాయి కిరణ్, గౌరి మాట్లాడారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top