ఆటకైనా.. వేటకైనా రెడీ

dabang 3 telugu version pre release event - Sakshi

– సల్మాన్‌ ఖాన్‌

సల్మాన్‌ఖాన్‌ హీరోగా ‘దబాంగ్‌’ సిరీస్‌లో తెరకెక్కిన చిత్రం ‘దబాంగ్‌ 3’. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. ఇందులో సోనాక్షీ సిన్హా కథానాయికగా నటించారు. అర్బాజ్‌ ఖాన్, నిఖిల్‌ ద్వివేది, సల్మాన్‌ఖాన్‌ నిర్మించిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రేపు విడుదల కానుంది. సల్మాన్‌ఖాన్‌ ఫిల్మ్స్‌ సౌజన్యంతో సురేష్‌ ప్రొడక్షన్స్, గ్లోబల్‌ సినిమాస్‌ ‘దబాంగ్‌ 3’ తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ–రిలీజ్‌ వేడుక బుధవారం జరిగింది.ఈ వేడుకకు హీరోలు వెంకటేష్, రామ్‌ చరణ్‌ అతిథులుగా హాజరయ్యారు.

సల్మాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ – ‘‘వెంకీమామ.. అంటే వెంకటేష్‌గారు.. నాకు పాతికేళ్లుగా స్నేహితులు. రామ్‌చరణ్‌ నాన్నగారు చిరంజీవి నాకు చాలా క్లోజ్‌. రామ్‌చరణ్‌ నాకు తమ్ముడులాంటివాడు. చరణ్‌ కూడా నాకు క్లోజే. ఈ సినిమాలో హీరోగా నా స్థాయిని పెంచేలా నటించారు కన్నడ నటుడు సుదీప్‌. ‘దబాంగ్‌ 3’ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అంటూ చిత్రంలోని  ‘ఆటకైనా.. వేటకైనా రెడీ’ అనే డైలాగ్‌ చెప్పారు.

వెంకటేష్‌- ‘‘దబాంగ్‌ 3’లో సల్మాన్‌ డైలాగ్స్‌ మామూలుగా లేవు. సల్మాన్‌ను ప్రేమించే అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులు కూడా ఈ సినిమాను హిట్‌ చేయాలని కోరుకుంటున్నాను ’’ అన్నారు వెంకటేష్‌.

రామ్‌చరణ్‌- ‘‘సల్మాన్‌భాయ్‌ నుంచి ఎన్ని నేర్చుకుంటున్నానో వివరించడానికి ఒక వేదిక, కొన్ని మాటలు సరిపోవు. సల్మాన్, సుదీప్, వెంకటేష్‌గారు, చిరంజీవిగారు.. ఇలాంటి సూపర్‌ స్టార్లు అందరిలో ఒక కామన్‌ పాయింట్‌ ఉంది. అది యాక్టింగ్, డైలాగ్‌ డెలివరీ, యాక్షన్‌ కాదు... క్రమశిక్షణ గురించి చెబుతున్నాను. వీరి నుంచి మా తరం క్రమశిక్షణను నేర్చుకుంటాం. నాతో పాటు చాలామందికి స్ఫూర్తిగా నిలిచిన సల్మాన్‌ఖాన్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు రామ్‌చరణ్‌.

‘‘దబాంగ్‌ 3’ మన తెలుగు సినిమాలానే ఉంటుంది. థియేటర్‌లో చూసి ప్రేక్షకులు ఈ సినిమాను హిట్‌ చేయాలి’’ అన్నారు ప్రభుదేవా. ‘‘సల్మాన్‌గారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం గౌరవంగా ఫీల్‌ అవుతున్నాను’’ అన్నారు సుదీప్‌. ‘‘ఇది మా అందరికీ చాలా ప్రత్యేకమైన సినిమా’’ అన్నారు సోనాక్షీ సిన్హా. ‘‘ఈ చిత్రంలో ‘హుడ్‌ హుడ్, గుభాళించనే’ అనే పాటలు రాసే అవకాశం ఇచ్చిన సల్మాన్, ప్రభుదేవాగార్లతో పాటు సంధానకర్తగా వ్యవహరించిన రాజేశ్వరీ సుధాకర్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు రచయిత రామజోగయ్య శాస్త్రి. ‘‘జీవితంలో కండలు పెంచాలనే కోరిక ఉండేది. అది తీరలేదు. కానీ కండల వీరుడికి పాట రాసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇందులో ‘ఊ కొడితే, తొలిగా తొలిగా..’ అనే పాటలు రాశాను. ప్రభుదేవా, వీవీవీ రాయుడుగార్లకు ధన్యవాదాలు’’ అన్నారు రచయిత అనంత శ్రీరామ్‌. సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రతినిధి జగదీష్, ఏషియన్‌ సునీల్‌ నారంగ్, భరత్,  శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top