ఆ చిత్రాలను చూడటం మానేశా : ఎంపీ

Boycott Nepotism Movies Says Roopa Ganguly - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం​ చిత్రపరిశ్రమలో కొత్త చర్చకు దారితీసింది. ఇండ్రస్ట్రీలో బంధుప్రీతి (నెపొటిజం) మూలంగానే యువ నటులకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని పలువురు బాధితులు గొంతెత్తున్నారు. తామూ ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్ని మానసికంగా ఎంతో కుంగుబాటుకు గురయ్యామంటూ నాటి పరిస్థితులను గుర్తుచేసుకుంటున్నారు. సుశాంత్‌ మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పెను దుమారాన్ని రాజేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ, బెంగాల్‌కు చెందిన ప్రముఖ నటి రూపా గంగూలీ ఘాటుగా స్పందించారు. చిత్రపరిశ్రమలో బంధీప్రతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది వ్యక్తుల మూలంగా ఫిల్మ్‌ ఇండ్రస్ట్రీలో బంధుప్రీతి తారాస్థాయికి చేరిందని ఆవేదన చెందారు. (నేనూ నెపోటిజమ్‌ బాధితుడినే)

అన్ని రంగాల్లోనూ ఆ జాడ్యం వేళ్లూనుకుందని ఆమె అభిప్రాయడపడ్డారు. బంధుప్రీతి గలవారంటే తనకు అస్సలు గిట్టదని, ఆయా వర్గాలకు చెందిన వ్యక్తుల సినిమాలను చూడటం ఎప్పుడో మానేశానని చెప్పారు. చిత్రపరిశ్రమపై పట్టుకోసం కొందరు చేసే దుర్మార్గానికి ఎంతో మంది నటులు బలైపోతున్నారని ఆవేదన చెందారు. మరోవైపు సుశాంత్‌ మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని రూపా ఇప్పటికే డిమాండ్‌ చేశారు. చిత్ర పరిశ్రమలో ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా ఉండాలంటే  నెపోటిజాన్ని వెనకేసుకొస్తున్న వాళ్ల సినిమాలను బాయ్‌కాట్‌ చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఇక గత నెలలో ఆత్మహత్యకు పాల్పడిన సుశాంత్‌ సింగ్‌ మృతిపై ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురుని విచారించిన పోలీసులు.. మరికొంత మందిని సైతం ప్రశ్నించే అవకాశం ఉంది. (ఆలియా, మ‌హేష్ భ‌ట్‌పై కేసు న‌మోదు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top