నాయన మాటలు ఇప్పటికీ గుర్తే!

నాయన మాటలు ఇప్పటికీ గుర్తే!


- బి. వెంకట్రామరెడ్డి, ప్రముఖ నిర్మాత - ‘విజయ’ నాగిరెడ్డి కుమారుడు

 బి. నాగిరెడ్డి... చెన్నైలో ‘విజయ- వాహినీ’ స్టూడియో అధినేతగా, సకుటుంబ చిత్రాల నిర్మాతగా, చందమామ - విజయచిత్ర పత్రికల యజ మానిగా, విజయ హాస్పిటల్ నిర్వాహకుడిగా ఆయనది అద్భుత చరిత్ర. ఆ దార్శనికుడి సినీ వారసత్వం కొనసాగేలా ప్రతి ఏటా ‘సకుటుంబ వినోదా త్మక చిత్రం’ కేటగిరీలో ఒక్కో తెలుగు, తమిళ చిత్రాన్ని ఎంపిక చేసి, ఆ నిర్మాతను గౌరవిస్తున్నారు - నాగిరెడ్డి ఆఖరి కుమారుడు - చిత్ర నిర్మాత బి. వెంకట్రామరెడ్డి (బాబ్జీ). 2014కి తెలుగులో ‘రేసు గుర్రం’ చిత్ర నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్, డాక్టర్ వెంకటేశ్వరరావులకు ‘బి. నాగిరెడ్డి స్మారక పురస్కారం’ ఈ ఆదివారం హైదరాబాద్‌లో అందిస్తున్నారాయన. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన పంచుకున్న మనోభావాలు...

 

  మా ‘విజయా’ వారి చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించిన ఎమ్జీయార్, ఎన్టీఆర్, జయలలిత - ముగ్గురూ రాష్ట్ర ముఖ్యమంత్రులయ్యారు. అది మాకెంతో గర్వకారణమైన విషయం. అలాగే, కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్ సైతం మా సినిమాల్లో నటించారు. కొన్నేళ్ళ క్రితం అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను నేరుగా కలుసుకున్నాం. ‘విజయ సంస్థతో, నాగిరెడ్డి గారితో ఎన్నో తీపి జ్ఞాపకాలున్నాయి’ అని ఆమె గుర్తుచేసుకున్నారు. మా నాయనకూ, మా సంస్థకూ ఇవాళ్టికీ ఉన్న గౌరవానికి అది ఉదాహరణ.

 

  నాయనతో అనుబంధం ఉన్న సినిమా వ్యక్తులు, ఆ తరం క్రమంగా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతుంటే, బాధగా అనిపిస్తోంది. మా ‘విజయా’ సంస్థకు పర్మినెంట్ హీరో ఎన్టీఆర్ గారు. ఆయనతో మాది ప్రత్యేక బంధం. ఏయన్నార్ గారు మా ‘విజయా’ హీరో కాకపోయినా, నాయనతో ఆయన అనుబంధం అంతా ఇంతా కాదు. ఆయన పెళ్ళికి శుభలేఖలు ముద్రించింది మా నాయనే! దానికి, మా నాయన డబ్బు కూడా తీసుకోలేదట. అలాగే, ఏయన్నార్ 60 చిత్రాల పూర్తి వేడుకకు తగిన వేదిక ఏదీ ఆయనకు దొరకలేదు. దాంతో, మా నాయన అప్పటికప్పుడు ‘విజయా గార్డెన్స్’ వేదిక కట్టించారు. హైదరాబాద్‌లో ‘అన్నపూర్ణా స్టూడియో’ కడుతున్నప్పుడు ఆ డిజైనింగ్‌లో నాయన సలహాలిచ్చారు. అందుకే, ఏయన్నార్‌కు నాయనంటే అభిమానం.

 

  అలాగే, రామానాయుడు గారితో ప్రత్యేక అనుబంధం. నిజానికి, నాయన ఎప్పుడూ పార్ట్‌నర్‌షిప్‌లకు పోడు. ఆయనకు పెద్దగా ఇష్టం లేకపోయినా - నాగిరెడ్డి గారి పిల్లలమైన మేము, రామానాయుడి గారు కలసి ‘విజయా - సురేశ్ కంబైన్స్’ స్థాపించాం. అలా ‘పాప కోసం’తో మొదలుపెట్టి ‘సురేశ్ మూవీస్’, ‘సురేశ్ ఇంటర్నేషనల్’ లాంటి బ్యానర్లపై 20 చిత్రాలు నిర్మించాం. తెలుగు, తమిళ, హిందీల్లో ‘ప్రేమ్‌నగర్’ కూడా మేము కలసి తీసినదే.    మా నాయనదీ, చక్రపాణి గారిదీ అపురూపమైన స్నేహబంధం. మా నాయన ఎప్పుడూ సకుటుంబంగా చూడదగ్గ, సందేశాత్మక చిత్రాలు తీయాలనేవారు.



చక్రపాణి గారేమో ‘మెసేజ్ ఇవ్వడానికి సినిమా తీసే కన్నా, టెలిగ్రామ్ పంపితే చౌక కదా!’ అని ఛలోక్తి విసిరేవారు. అయితే, మూడో వ్యక్తి మాటల్లో ఈగ వాలనిచ్చేవారు కాదు.  నాయనంటే చక్రపాణి గారికంత ప్రేమ. చక్రపాణి గారు పోయాక నాయనలో చిత్ర నిర్మాణంపై ఉత్సాహం తగ్గింది.    నాయనను చూసి పెరిగిన నాకు, ఆయన  లాగానే చిత్ర, భవన నిర్మాణాల మీద ఆసక్తి.ఆ పను ల్లోనే ఉన్నా. 1991లో ‘చందమామ - విజయా కంబైన్స్’పై చిత్రాలు తీయడం ప్రారంభించా. తెలుగులో రాజేంద్రప్రసాద్‌తో ‘బృందావనం’, బాలకృష్ణతో ‘భైరవద్వీపం’, ‘శ్రీకృష్ణార్జున విజయము’, తమిళంలో రజనీకాంత్‌తో ‘ఉళైప్పాళి’, కమలహాసన్‌తో ‘నమ్మవర్’, అలాగే ‘కరుప్పు వెల్లై’ లాంటి చిత్రాలు తీశాను.

 

  నాయన ఉండగా, నిర్మాతగా నా పేరు పడడం నాకిష్టం లేదు. అయితే, 2004లో నాయన చనిపోవడంతో, ఆయన ఆశయాలకు కొనసాగింపుగా ‘విజయా ప్రొడక్షన్‌‌స’ పేరు పెట్టి, తమిళంలో విశాల్‌తో ‘తామ్రపరణి’, ధనుష్‌తో ‘పడిక్కాదవన్’, ‘వేంగై’, ఇటీవలే అజిత్‌తో ‘వీరవ్‌ు’ చిత్రాలు తీశా. తెలుగులోనూ సినిమాలు తీయాలని ఉంది. కానీ, పెరుగుతున్న వ్యయం, పారితోషికాలు, మారుతున్న పరిస్థితుల మధ్య ఆలోచించాల్సి వస్తోంది.  మద్రాసులో ప్రారంభించిన మొట్టమొదటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మాదే. 1972లోనే మా ‘విజయా హాస్పిటల్ ట్రస్ట్’ ప్రారంభించాం. తరువాత రెండేళ్ళకు ’74లో కేవలం 30 పడకలతో ప్రారంభమైన మా ఆస్పత్రి ఇవాళ 750 పడకలతో, దాదాపు 1800 మంది ఉద్యోగులతో నడుస్తోంది. ప్రతి ఏటా నాయన జయంతికి ఉచిత వైద్యశిబిరం ద్వారా వందలమందికి సేవలందిస్తున్నాం. మా ఆవిడ భారతీరెడ్డి ఆస్పత్రికి సి.ఇ.ఒ.గా బాధ్యతలు చూస్తోంది.

 

  మా నాయన నాగిరెడ్డి గారి పిల్లల్లో అందరి కన్నా చిన్నవాణ్ణయినా, ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా. ‘‘ఉద్యోగుల క్షేమం చూడాలి, వాళ్ళకు ముందు జీతభత్యాలివ్వాలి. వర్కర్లను ఎప్పుడూ ‘మీరు’ అనే తప్ప, తక్కువ చేసి పిలవకూడదు. వినయం ఎంత ఉంటే, అంత మంచిది. ఎప్పుడూ ఒకరితో పోల్చుకోకూడదు. నీ పైన ఎంతమంది ఉన్నారనే దాని కన్నా, కింద ఎంత మంది ఉన్నారనేది చూసుకోవాలి’’ - ఇలా ఆయన చెప్పిన జీవిత సూత్రాలు ఇప్పటికీ నాకు గుర్తే. ఈ తరానికీ మార్గ దర్శకమైన జీవితం, సందేశం ఆయ నది. అందుకే, ఆయనపై మంచి కాఫీ టేబుల్ బుక్ తేనున్నాం.

 - రెంటాల జయదేవ

 

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top