సింగర్‌తో బ్రేకప్‌పై స్పందించిన నటుడు

Actor Himansh Kohli Said He Still Respect Neha Kakkar - Sakshi

మాజీ ప్రియురాలు నేహా కక్కర్‌ని ఇప్పటికి గౌరవిస్తున్నానని.. ఆమెకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని తెలిపాడు నటుడు హిమాన్ష్ కోహ్లీ. వీరిద్దరూ విడిపోయి దాదాపు సంవత్సరం అవుతుంది. ఈ క్రమంలో తాజాగా తమ బంధం గురించి మీడియాతో మాట్లాడారు హిమాన్ష్‌. హిందూస్తాన్‌ టైమ్స్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను దీని గురించి మాట్లాడతానని ఎప్పుడు అనుకోలేదు. జరిగింది ఏదో జరిగి పోయింది. నేను దాన్ని మార్చలేను. కానీ నేహా అంటే నాకు ఇప్పటికి గౌరవమే. ఆమెకు అంతా మంచే జరగాలని కోరుకుంటాను. క్లిష్ట పరిస్థితుల్లో కూడా మేం ఒకరికి ఒకరం మర్యాద ఇచ్చుకుంటాం. తనో గొప్ప వ్యక్తి. నేహా కోరుకున్న ప్రతీది ఆమెకు దక్కాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆమె పూర్తి ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని దేవుడిని వేడుకుంటున్నాను’ అని తెలిపారు. ఈ క్రమంలో వీరిద్దరు గత ఏడాది వచ్చిన ఓహ్‌ హమ్‌సఫర్‌ పాటలో కలిసి నటించారు.

దీని గురించి ప్రస్తావిస్తూ.. ‘మళ్లీ నేహాతో కలిసి పని చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా’ అని హిమాన్ష్‌ను ప్రశ్నించగా.. ‘ఎందుకు లేను. మంచి అవకాశాలను ఎందుకు జారవిడుచుకోవాలి. ఆసక్తికర ప్రాజెక్ట్స్‌ వస్తే.. తప్పకుండా నేహాతో కలిసి పని చేస్తాను. నా పనే నటించడం కదా’ అన్నారు హిమాన్ష్‌. గత ఏడాది ఇండియన్‌ ఐడిల్‌ రియాలిటీ షోలో వీరిద్దరు తాము రిలేషన్‌లో ఉన్నామని ప్రకటించారు. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో తమ మధ్య బంధం ముగిసిపోయిందని తెలిపారు. తొలత నేహానే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తాము విడిపోయినట్లు వెల్లడించారు. తన హృదయం ముక్కలైందని.. నిరాశలో కూరుకుపోయానని తెలిపారు నేహా. దాంతో హిమాన్ష్‌, నేహాను మోసం చేశాడంటూ నెటిజన్లు తనను విమర్శించడం ప్రారంభించారు. అయితే ఈ విమర్శలపై నేహా స్పందించారు. హిమాన్ష్‌కు మద్దతివ్వడమే కాక తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ క్రమంలో హిమాన్ష్‌కు మద్దతుగా ట్వీట్‌ చేశారు నేహా. ‘నేను ఆన్‌లైన్‌లో కొన్ని వార్తలు చదివాను. అవి పూర్తిగా అవాస్తవం. అవును నేను బాధపడుతున్న మాట వాస్తవమే.. కానీ నేను మోసపోలేదు. నిజాయతీగా చెప్పాలంటే హిమాన్ష్‌ చాలా ఉత్తముడు. తనను విమర్శించడం.. అతనిపై తప్పుడు ఆరోపణలు చేయడం మానండి. వాస్తవాలు తెలియకుండా మేం ఎవరి పేరు చెడగొట్టలేదు’ అంటూ ట్వీట్‌ చేశారు. అంతేకాక తన వ్యక్తిగత జీవితం గురించి బయట ప్రపంచానికి వెల్లడించడం పట్ల నేహా బాధపడ్డారు. ‘నాకు భావోద్వేగాలు ఎక్కువ. అందుకే నా వ్యక్తిగత జీవితం గురించి ప్రపంచానికి వెల్లడించాను కానీ నేను అలా చేసి ఉండకూడదు’ అన్నారు నేహా.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top