అద్భుత దృశ్యం.. కొండ అంచులకు చేరిన నీరు..!

Water Flowing Upwards Reaches Cliff Edge Spectacular Video - Sakshi

కోపెన్‌హాగన్‌: నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు అనే సామెత తెలిసే ఉంటుంది. అయితే, డెన్మార్క్‌లోని ఫారో ఐలాండ్స్‌లో మాత్రం దీనికి విరుద్ధమైన సన్నివేశమొకటి వెలుగు చూసింది. సముద్రపు అలల నుంచి నీరు అంతెత్తుతున్న కొండపైకి ప్రవహించింది. గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేకంగా పనిచేసిన ఈ దృశ్యాన్ని జాకొబ్సేన్‌ అనే వ్యక్తి గత సోమవారం కెమెరాలో బంధించాడు. సుడిగాలితో పాటు కొండ అంచులకు చేరుతున్న నీటి ప్రవాహపు వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇక ఈ విశేషంపై వాతావరణ నిపుణులు మాట్లాడుతూ.. ‘టోర్నడోలు ఏర్పడే క్రమంలో నలువైపులా ఒత్తిడికి గురైన గాలి భూమిపై ఉన్న చెత్త చెదారంతో గొట్టంలా మారి విధ్వంసం సృష్టిస్తుంది. అతి వేగంగా కదులుతూ సుమారు మేఘాలను తాకేటంత ఎత్తులో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. తాజా ఘటన కూడా ఈ కోవలోకి చెందినదే. టోర్నడో మాదిరిగానే ఇక్కడ గాలి గొట్టం ఏర్పడింది. అయితే, దానిలో వస్తువులు, చెత్తా చెదారం బదులు నీరు చేరింది. పక్కనే ఎత్తయిన కొండ ఉండటంతో అదే వేగంతో నీరు పైకి ప్రవహించింది. సాధారణంగా నీటితో ఏర్పడే గాలి గొట్టాలను నీటి చిమ్ములు అంటాం. అవి కాస్త ఎత్తు వరకు కదిలి బలహీనమవుతాయి. ఫారో ఐలాండ్స్‌లో బయటపడిన నీటి ప్రవాహాం సంఘటన మాత్రం అద్భుతమైందే..!’అని అన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top