డిగ్రీ అయ్యాక రెండేళ్లు ఉండొచ్చు

UK To Extend Work Visas For Overseas Students By 2 Years - Sakshi

వీసా నిబంధనల్ని పునరుద్ధరించిన బ్రిటన్‌ 

భారతీయ విద్యార్థులకు భారీగా ఊరట

లండన్‌: యూకేలో డిగ్రీ, పీజీ చేసే విద్యార్థులకు భారీగా ఊరట లభించింది. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వర్క్‌ వీసాలో పాత నిబంధనల్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు. దీంతో అక్కడ చదువుకునే నిపుణులైన విదేశీ విద్యార్థులు తమ కెరీర్‌ మలచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు భారీగా లబ్ధి చేకూరుతోంది. ప్రస్తుతం అక్కడ చదివే విదేశీ విద్యార్థులు డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ పూర్తయ్యాక 4నెలలు పాటు మాత్రమే ఉండే వీలుంది. 27 వర్సిటీలు పైలెట్‌ స్కీమ్‌ కింద ఆరు నెలల పాటు ఉండే అవకాశాన్ని కల్పిస్తాయి. వీసా నిబంధనల్ని సవరించడంతో చదువు పూర్తయ్యాక రెండేళ్ల పాటు యూకేలో ఉంటూనే ఉద్యోగం కోసం వెతుక్కోవచ్చు.

డిగ్రీ పూర్తయిన నాలుగు నెలలు మాత్రమే దేశంలో ఉండే అవకాశం ఇస్తే, ఉద్యోగాలు ఎక్కడ వస్తాయని, దీని వల్ల టాలెంట్‌ ఉన్న వారంతా వేరే దేశాలకు తరలివెళ్లిపోతారని యూకేలో యూనివర్సిటీలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై గత ఆరేళ్లుగా విస్తృతంగా చర్చ జరిగిన తర్వాత పాత నిబంధనలనే తీసుకురావాలని బోరిస్‌  సర్కార్‌ నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. ‘‘వీసా నిబంధనల్ని పునరుద్ధరించడం వల్ల విద్యార్థులు రెండేళ్ల పాటు పని చేయడంలో అనుభవాన్ని తెచ్చుకొని బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకునే అవకాశం కలుగుతుంది’’ అని యూకే హోంమంత్రి భారత్‌ సంతతికి చెందిన ప్రీతి పటేల్‌ అన్నారు.  

భారీగా తగ్గిన విద్యార్థుల సంఖ్య  
ఒకప్పుడు బ్రిటన్‌లో చదువు పూర్తయిన విద్యార్థులు మరో రెండేళ్ల పాటు అదే వీసాపై ఆ దేశంలో కొనసాగే అవకాశం ఉండేది. కానీ థెరిసా మే హోం మంత్రిగా ఉన్నప్పుడు 2012లో విద్యార్థులు రెండేళ్లు పాటు కొనసాగే నిబంధనలను రద్దు చేశారు. దీంతో బ్రిటన్‌కు వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య 55శాతానికి పడిపోయింది. 2010లో 51,218 మంది విద్యార్థులు బ్రిటన్‌కు వస్తే, 2011–12లో వారి సంఖ్య ఏకంగా 22,575కి పడిపోయింది. 2017–18 వచ్చేసరికి విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోయి 15,338కి చేరుకుంది. గత ఏడాది మాత్రం మళ్లీ విద్యార్థుల సంఖ్య పెరిగి 21 వేలకు పైగా చేరుకుంది. ‘రెండేళ్ల పోస్ట్‌ స్టడీ వీసా పునరుద్ధరించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. గత ఆరేళ్లుగా ఈ వీసా పునరుద్ధరణకు మేము పోరాటాలు చేస్తున్నాం’ అని నేషనల్‌ ఇండియన్‌ స్టూడెంట్స్‌ అండ్‌ అల్మని యూకే యూనియన్‌ సంస్థ చైర్‌ పర్సన్‌ సనమ్‌ అరోరా అన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top